I wish to do roles like Kota:
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప‘ సినిమా నిన్ననే థియేటర్లకు వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలో భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. అడవి నేపథ్యంలో .. ఎర్రచందనం దుంగల అక్రమరవాణా చుట్టూ తిరిగే కథ ఇది. ఈ సినిమా చూసినవారికి, అందులో స్మగ్లింగ్ ముఠా నాయకుడు కొండారెడ్డి పాత్రను పోషించిన అజయ్ ఘోష్ కూడా గుర్తుండిపోతాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను పంచుకున్నాడు.
“ఒక నటుడిగా నేను ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడవలసి వచ్చింది. కోట శ్రీనివాసరావుగారు ఎన్ని డైమన్షన్స్ అయితే చూపించారో, ఆయన మాదిరిగా నా స్టైల్లో చేయాలనుంది. ఒక ఆర్టిస్ట్ గా ఆయన నీడను తాకినా చాలు అనే కోరిక ఉంది. విలనిజంతో పాటు వివిధ రకాల పాత్రలను పండించాలని ఉంది. అజయ్ ఘోష్ అనేవాడు ఒక పరిపూర్ణమైన నటుడు అనిపించుకోవాలనుంది. మరి ఆ పరమాత్ముడు ఏం చేస్తాడో .. ఆ కళామతల్లి ఏం చేస్తుందో చూడాలి. సుకుమార్ తోనే కాదు త్రివిక్రమ్ గారు .. బోయపాటిగారితో కలిసి పని చేయాలనుంది. అలాగే నా గాడ్ ఫాదర్ పూరిగారి సినిమాలో మరోసారి విలన్ గా చేయాలనుంది.
ఇదిగో వీడు విలన్ .. అని నా మెడలో గంట కట్టిన తరువాతనే నన్ను ఇండస్ట్రీ గుర్తించింది .. ఆ పనిని పూరి జగన్నాథ్ గారు చేశారు. ఇక నేను మా ఊళ్లో ఒక చిన్న ఇల్లు కట్టుకున్నది ‘రంగస్థలం’ తరువాతనే. నటుడుగా నన్ను నిలబెట్టినవాడు సుక్కూ .. తమిళంలో వెట్రి మారన్. విషయం ఉన్న కొత్త కుర్రాళ్లు చాలామంది ఇండస్ట్రీకి వస్తున్నారు .. వాళ్లంతా కూడా నాకు అవకాశాలు ఇస్తున్నారు. నాది ప్రకాశం జిల్లా చీరాల దగ్గర ‘వేటపాలెం’. షూటింగు ఉన్నప్పుడు హైదరాబాద్ వస్తాను .. లేదంటే మా ఊళ్లోనే ఉంటాను” అని చెప్పుకొచ్చాడు.