మంత్రి సీతక్కకు ఉర్దూ రాదు, ఇంగ్లిష్ అర్థం కాదు- నాకు తెలుగు రాదు- ఆమె చెబుతున్నది అర్థం కాదు- ఎలా? అని శాసనసభలో ఎం ఐ ఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసి అనడం మర్యాదగా లేదు. కాంగ్రెస్ కు ప్రస్తుతమున్న అవసరాల నేపథ్యంలో అక్బరుద్దీన్ ను ఏమీ అనలేకపోవచ్చు. ఎవరు అధికారంలో ఉంటే…వారితో అంటకాగుతూ ఓల్డ్ సిటీని సొంత ఆస్తిగా ఎం ఐ ఎం ఏలుతూ ఉండవచ్చు.
కానీ అక్కడ సీతక్కను చిన్నబుచ్చినట్లు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆమె గ్రామీణ నేపథ్యం, తెలుగు మీడియం చదువు, ఉద్యమ నేపథ్యం అందరికీ తెలిసినవే. నిజానికి తెలుగు తెలియకపోవడం, తెలుగు అర్థం కాదని అదేదో గర్వకారణమైనట్లు చెప్పుకుని…అక్బరుద్దీన్ తనను తాను బయటపెట్టుకున్నాడు. ఒక తెలుగు రాష్ట్రంలో బాధ్యతగల శాసనసభ్యుడిగా ఉంటూ నిండు సభలో అనాల్సిన మాట కాదది.
“ఆమెకు ఉర్దూ, ఇంగ్లిష్ రాకపోవడం సంగతి తరువాత. నువ్ తెలుగు నేర్చుకోకపోవడం, కనీసం అర్థం చేసుకోకపోవడం ఏమన్నా బాగుందా?” అని కనీసం సున్నితంగా అయినా అక్బరుద్దీన్ ను ఒక్క కాంగ్రెస్ నాయకుడైనా అడగలేకపోయాడు. చివరకు ఆమే నా మాతృభాష తెలుగు- తెలుగులో చెబుతున్నాను- అని వివరణ ఇచ్చుకున్నారు.
రాజకీయ అవసరాలు(పొలిటికల్ కంపల్షన్స్) అలాంటివి. అదే సభలో అదే సెషన్స్ లో ప్రతిపక్ష కె టీ ఆర్ చెన్నయ్ డీలిమిటేషన్ మీటింగ్ గురించి మాట్లాడితే…ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్పించుకుని…నాలుగు ఇంగ్లిష్ ముక్కలు మాట్లాడితే ఏమన్నా గొప్పా? నేను గ్రామీణ ప్రభుత్వ బడుల్లో తెలుగు మీడియంలోనే చదువుకున్నాను. నా భాషలోనే నేను మాట్లాడుతాను- అని హోటల్లో ఆర్డర్ తీసుకోవడానికి పనికొచ్చే ఇంగ్లిష్ అంటూ విరుచుకుపడ్డారు. మరి సీతక్క దగ్గరికొచ్చేసరికి అటు ఉన్నది ఎం ఐ ఎం కావడంతో మౌనమే శరణ్యమైనట్లుంది.
విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఒక్కడే ధైర్యంగా ఈ ప్రశ్న వేశాడు ఎక్స్ వేదికగా- ‘‘ఇక్కడే పుట్టి పెరిగిన నీకు తెలుగు ఎందుకు రాదు..? ఎందుకు నేర్చుకోలేదు..? అది నీ సామాజిక బాధ్యత కాదా..? ఉర్దూ, ఇంగ్లిష్ రాకపోతే చిన్నచూపా..? ఇదేం పొగరు..? సభలో తెలుగులో వ్యవహారాలు నడుస్తుంటే మరి నువ్వేం అర్థం చేసుకుంటున్నట్టు..? సభలో ప్రసంగాలు దంచి వెళ్లగానే సరిపోతుందా..? తెలుగు రాకపోతే నీకు రాష్ట్రంలోని సమస్యలు ఏం అర్థమవుతాయి..?’’ అని కౌంటర్ చేశాడు.
అది సీతక్కకు జరిగిన అవమానం కాదు. తెలుగుకు జరిగిన అవమానం. మీడియాలో ఈ విషయం వచ్చాక అయినా అక్బరుద్దీన్ పశ్చాత్తాపం వ్యక్తం చేయాల్సింది. వివరణ ఇవ్వాల్సింది. కొందరినుండి కొన్ని ఆశించకూడదేమో!