Sunday, January 19, 2025

ఏ మాయ చేశావే?

Naga Chaitanya Akkineni and Samantha announced separation:

నిజమే.
కొందరికి-
పెళ్లి పబ్లిక్;
విడాకులు ప్రయివసీ.

పెళ్లి ధూమ్ ధామ్;
విడాకులు గప్ చుప్.

పెళ్లి డెస్టినేషన్;
విడాకులు డెస్టినీ.

పెళ్లి నేత్రోత్సవం;
విడాకులు భారం.

పెళ్లి పులకింత;
విడాకులు చింత.

పెళ్లి బంధం;
విడాకులు బంధ విమోచనం.

పెళ్లి మోహం;
విడాకులు జ్ఞానం.

పెళ్లి అవసరం;
విడాకులు అత్యవసరం.

ప్రేమ ప్రేమగా మిగిలిపోవచ్చు.
ప్రేమ పెళ్లిగా మారవచ్చు.
పెళ్లి నిలబడవచ్చు.
లేదా విడాకులు కావచ్చు.

ఇది పెళ్లి- విడాకుల స్వరూప స్వభావాలు, లక్షణాల మీద జనరల్ చర్చ కాదు. సందర్భం తెలుసు కాబట్టి…చర్చ అక్కడికే పరిమితం.

కలిసి ఉండడానికి కారణాలు వెతుక్కోరు. కలిసి ఉంటారంతే. విడిపోవడానికి కారణాలు వెతుక్కుంటారు.
విడిపోవడానికి ఒక్క కారణం చాలు.
పెళ్లి, విడాకులు వ్యక్తిగతం. కానీ…సెలెబ్రిటీల పెళ్లి లోకానికి ఎంత పెద్ద వార్తో…వారి విడాకులు కూడా అంతకంటే పెద్ద వార్తే అవుతుంది.

మీడియాకు బుద్ధి ఉందా? అని అన్నప్పుడే అసహనంలో ఉన్న అసలు అర్థం తెలిసిపోయింది. ఇప్పుడు అధికారికంగా ఎవరి దారులు వారివి కాబట్టి…వారి ప్రయివసీని కాపాడాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది.

బుద్ధిలేని మీడియా బుద్ధిని వెతుక్కుంటూ…
విడాకులకు కారణాలను కూడా వెతకడాన్ని బుద్ధికలిగి విడిపోయిన జంట ఆపలేకపోయింది. విడాకుల బుద్ధికి మీడియాలో వచ్చిన కారణాలన్నిటినీ గుదిగుచ్చితే దాని సారమిది.

ఇంటిపేరు బరువు
పెళ్లయ్యాక అమ్మాయి ఇంటి పేరు మారవచ్చు. మారక పోవచ్చు. మారాలని రూలేమీ లేదు. మారడం ఒక ఆచారం అని దానికి లేని పవిత్రతను కూడా ఆపాదించారు. ఇంటిపేరు గొప్పది(?) అయితే పెళ్లయినా అలాగే ఉండిపోతుంది. గొప్పది కాకపొతే మారిపోతుంది. ఎవరి ఇంటి పేర్లు మారాయో? ఎవరి ఇంటి పేర్లు మారలేదో? ఎవరికి వారు ఊహించుకోవచ్చు. ఇదొక పేరు ప్రతిష్ఠల పాకులాట. లేదా చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోవడం. ఇది అందరికీ, అన్నివేళలా నచ్చదు. ఇంటిపేరు ఇనుప పంజరంలో ఇరుక్కున్న పక్షి స్వేచ్ఛ కోసం అలమటిస్తుంది.

ఆర్థిక స్వాతంత్య్రం
ఒకే ఫీల్డ్ లో ఉన్న భార్యాభర్తల్లో…భర్త కంటే భార్య ఎక్కువ సంపాదిస్తే…ఆ భార్య భరించాల్సిన హింస పగవాడికి కూడా వద్దు. ఇంతకంటే చర్చ వద్దు.

నటనకు పరిమితులు
సృజనాత్మక ఫీల్డ్ లో ఉన్నవారికి పెళ్ళికి ముందు అంతా ఓకె. పెళ్లయ్యాక పరిమితులు మొదలవుతాయి. ఈ పరిమితులు మహిళలకే పరిమితం.

వెబ్ సీరీస్
వెబ్ అంటేనే గబ్బు, బోల్డ్ అని అర్థం. ఈ విడాకులకు వెబ్ సీరీస్ నటన కారణం కాకపోవచ్చు. వెబ్ సీరీస్ రెమ్యునరేషన్ ఒక కారణం అయి ఉండవచ్చు.

కుదరని పొత్తు
ముచ్చట పడి చేసుకున్న పెళ్లి మూడు తరాలకు నిలబడాలని సయోధ్య ప్రయత్నాలు సీరియస్ గానే జరిగాయి. కానీ అప్పటికే కాపురంలో బీటలు వారాయి.

తెలియని కారణాలు
హంతకులు, నియంతలు, వెన్నుపోటుదారులు ఎప్పటికయినా నాశనమవుతారు…అన్న శాపనార్థపు డి పి లో ఎన్నెన్నో ఇతరేతర కారణాలు కనపడుతున్నాయి. వారికై వారే చెబితే తప్ప మనకు తెలియని కారణాలు. నిజానికి అవే అసలయిన కారణాలు. ఇంటి పేరు, వెబ్బు, డబ్బు కారణం కానే కాదు.

ప్రతి ఆర్గ్యుమెంట్ లో…
1 . నీ అభిప్రాయం
2. నా అభిప్రాయం
3 . వాస్తవం
మూడు కోణాలుంటాయి. కొన్ని సందర్భాల్లో మూడూ ఒకటి కావచ్చు. కొన్ని సందర్భాల్లో రెండు ఒకటి కావచ్చు. కొన్ని సందర్భాల్లో మూడు కోణాలు దేనికదిగా కలవని శ్రుతిలో విడిగా ఉండిపోవచ్చు.
.

ప్రస్తుత సందర్భంలో ఎవరు ఎవరికి బరువయ్యారు?
విడాకులకు ఎవరు బాధ్యులు?
ఏ మాయ చేసినట్లు చిగురించిన ప్రేమ మొగ్గతొడిగి పెళ్లిపూలు పూచి పాటలు పాడుకునేలోపే…ఏమయ్యిందో ఏమో! ఇన్ స్టాగ్రామ్ లో వేరు దారుల వార్తను వారే ప్రకటించుకున్నారు.
భార్యాభర్తలుగా విడిపోయి…మంచి స్నేహితుల్లా
ఎవరి దారిలో వారు ఉండదలుచుకున్నారట. వారు వేరైనా చల్లగా ఉండాలని వారి కుటుంబ పెద్ద కోరుకుంటున్నారు. మనం కూడా అదే కోరుకుందాం.

-పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్