Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసెలెబ్రిటీల సామాజిక నిస్పృహ

సెలెబ్రిటీల సామాజిక నిస్పృహ

Pan Parag Regret: ఏదో ఒక విషయాన్ని ప్రకటించేవి ప్రకటనలు. చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా ప్రకటనలు చెప్పలేవు. అందుకే సెలెబ్రిటీలు చెబితే ఎంతో కొంత గుడ్లప్పగించి జనం చూస్తారని ప్రకటనల్లో వారిని వాడుకుంటూ ఉంటారు. ఆయా ప్రకటనల్లో నటించే లేదా జీవించే సెలెబ్రిటీలు ఆయా వస్తువులను నిజంగా వాడుతున్నారా? అన్నది లోకం అడగకూడని ప్రశ్న.

తెలుగు టీ వీ లు ఆన్ చేస్తే చాలు- యువసామ్రాట్ అక్కినేని నాగార్జున ల్యాబ్ లో మైక్రోస్కోప్ లో చూసి సూక్ష్మాతి సూక్ష్మ మరకలను కూడా కడిగి పారేసే ఘడి డిటర్జెంట్ సోపు గుణ గణాలను చెబుతూ ఉంటాడు. అందులో నాగార్జున బట్టలు ఘడి సోపు వల్లే మెరవాలని నియమేమీ లేదు.

సాయి సూర్య డెవెలపర్స్ వారు ఊరవతల వేసిన లే అవుట్లలో సైట్లు కొనుక్కోమని చెప్పే ప్రిన్స్ మహేష్ బాబు అక్కడే ఇల్లు కట్టుకుని ఉంటున్నాడా? లేక భవిష్యత్తులో అక్కడ తన కలల కుటీరం కట్టుంటాడా? అని అడగగలమా?

విరాట్ కోహ్లీ లోటాలకు లోటాలు బూస్ట్ లొట్టలేసుకుని తాగితేనే బ్యాట్ తో బంతిని బాదగలుగుతున్నాడా?

మనం మన హీరోల కష్టాన్ని సరిగ్గా గుర్తించట్లేదు కానీ- రోడ్డు మీద పది రూపాయలు పెట్టి కూల్ డ్రింక్ బాటిల్ కొని తాగే మెళకువ, కామన్ సెన్స్ కరువై…ఈజిప్టు దాకా వెళ్లి, ఆ ఎడారిలో గొంతు తడారి, పిరమిడ్ మీది నుండి హాట్ బెలూన్ మీదపడి, ఎవడో దొంగ చేతిలో నుండి బాటిల్ లాక్కుని తాగుతుంటే మన గుండె తరుక్కుపోతుంది. ఒక కూల్ డ్రింక్ తాగడానికి ఇలా ప్రాణాన్ని పణంగా పెట్టాలా? లేక కూల్ డ్రింక్ ఇలాగే తాగాలా?

ఒక రోజు టీ వీ ల్లో వచ్చే ప్రకటనలు చూశాక సాధారణ ప్రేక్షకులకు కలిగిన అవగాహన ఇది:-
కరీనాకు చుండ్రు సమస్య. కత్రినాకు డ్రై హెయిర్ ప్రాబ్లమ్. శిల్పాకు జుట్టు రాలే సమస్య.
మీ ఇంట్లో ఆడవాళ్లు ఉంటే…మీ పొరుగింట్లో వాడు డియోడరెంట్ వాడకుండా మీరే జాగ్రత్త పడాలి.
మీ చదువు సంస్కారాలకంటే- మీ శరీరం రంగు చాలా ప్రధానం.
మీ వంటింట్లో ఉప్పు అయిపోతే కంగారు పడకండి. చిటికెడో, కడివెడో టూత్ పేస్ట్ వేసుకోండి. ఓరల్ కేర్ కోసం డెంటిస్టులచే సిఫారసు చేయబడినది.

మగవారు పెర్ఫ్యూమ్ లు ఆడవారిని ఆకర్షించడానికే వాడుతుంటారు.
షాంపూ ప్రకటనల గ్రాఫిక్స్- అవతార్ సినిమా గ్రాఫిక్స్ కన్నా నాణ్యంగా, ఆకర్షణీయంగా ఉంటాయి.
పళ్ల రసాల్లోకంటే- షాంపూల్లోనే ఎక్కువ పళ్ల రసం ఉంటుంది.

Pan Parag
అమూల్ పాల కంటే- అమూల్ కార్టూన్లు అందంగా, ఆరోగ్యంగా, భావగర్భితంగా ఉంటాయి.
భారతదేశంలో బైకులు కొనే అబ్బాయిలందరూ, అమ్మాయిలను వెంటేసుకుని తిరగడానికే కొంటుంటారు.
మొహమంతా పులుముకోకుండా డైరీ మిల్క్ చాకొలేట్ ను తినకూడదు.
బకార్డి సంగీతం సి డీ లు చేసి అమ్ముకుంటూ ఉంటుంది. డైరెక్టర్ స్పెషల్, కింగ్ ఫిషర్ మినరల్ వాటర్ అమ్ముకుంటూ ఉంటాయి.
భారత దేశంలో తల్లీ కూతుళ్లు మాట్లాడుకునే ఒకే ఒక అంశం- జుట్టుకు పూసుకునే నూనె.
ఎవరయినా ల్యాబ్ లో వైట్ కోట్ వేసుకుంటే శాస్త్ర జ్ఞానం తన్నుకుని వస్తుంది.

“ఈ చిత్రీకరణలో ఎక్కడా జంతువులను వాడలేదు. వాడినా గాయపరచలేదు.
అనుభవజ్ఞులయిన నిపుణుల పర్యవేక్షణలో చేసినవి. ఎవరూ అనుకరించకండి.
సృజనాత్మక, భావనాత్మక, ప్రతీకాత్మక సంచిత విచలిత విస్మిత ప్రారబ్ధ ఖర్మ ప్రతిబింబిత దృశ్యీకరణ” అని కాళిదాసుకు కూడా అర్థం కాని నారికేళ పాకభాషలో ఏదో డిస్ క్లైమర్ టెక్స్ట్ కూడా ఉంటూ ఉంటుంది.

Pan Parag

పాన్ మసాలా పోషకాహారం కాదని అందరికీ తెలుసు. నోటికి, పంటికి, ఒంటికి చాలా ప్రమాదం అని కూడా అందరికీ తెలుసు. కానీ దేశమంతా నములుతూనే ఉంటారు. దేశం మీద ఉమ్మేస్తూనే ఉంటారు. సిగరెట్టు పెట్టెల మీద ఆరోగ్యానికి ‘హానికరం’, మద్యం దృశ్యాల మీద ‘హానికరం’ అక్షరాలు, చిత్రాలు చిత్రంగా నవ్వుకుంటూ ఉంటాయి. హానికరం అక్షరాలు చదువుతూనే వాటిని సేవిస్తూ ‘హాయికరం’ అనుకునేవారు కోట్ల మంది.

మిగతా హీరోలతో పోలిస్తే అక్షయ్ కుమార్ భిన్నం. చేసే సినిమాలు మొదలు, నిజ జీవితంలో నడిచే దారి కూడా భిన్నం. కొన్ని విలువలకు లోబడి ఉంటాడు.

లండన్ థేమ్స్ నది బ్రిడ్జ్ పక్కన యాలకుల పాన్ పొడి నోట్లో వేసుకుంటూ అజయ్ దేవగన్ భారతీయులందరినీ అదే పాన్ పొడి తినాలని ఎంతో కాలంగా ప్రాధేయపడుతున్నాడు. అజయ్ దేవగన్ కు ఆ మధ్య షారూఖ్ ఖాన్ కూడా తోడయ్యి టన్నులకు టన్నులు పాన్ పొడి తినడం మొదలు పెట్టాడు. తాజాగా అదే ప్రకటనలో అక్షయ్ కుమార్ కూడా పాన్ పొడి తినడం ప్రారంభించాడు. ఆ ప్రకటన విడుదలయిన నాలుగు రోజుల్లోనే అభిమానులు, శ్రేయోభిలాషులు అక్షయ్ మీద విరుచుకుపడ్డారు. అభిమానుల అభ్యంతరాలను అక్షయ్ హుందాగా స్వీకరించి…తప్పును దిద్దుకున్నాడు. క్షమాపణలు చెబుతూ ఒక లేఖ విడుదల చేశాడు.

“తప్పయింది. మన్నించండి. ఇంకెప్పుడూ ఇలాంటి ప్రకటనల్లో నటించను. న్యాయపరమయిన చిక్కులు ఉంటాయి కాబట్టి…ఆ కాలపరిమితి అయ్యేదాకా ప్రకటనను ఆపలేను. అయితే ఈ ప్రకటనకు తీసుకున్న పారితోషికం మొత్తాన్ని ఒక సామాజిక సేవా కార్యక్రమానికి వినియోగిస్తాను”

ప్రేక్షకుల అభ్యంతరాలకు వెంటనే స్పందించినందుకు, క్షమాపణలు కోరినందుకు అక్షయ్ అభినందనీయుడు.

వింటున్నారా?
గ్రేటాది గ్రేటు స్టారాధి స్టారులారా!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : 

ప్రకటనలు- వికటనలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్