ఒడిశాలో దుర్గ్-పూరీ ఎక్స్‌ప్రెస్‌కు పెనుప్రమాదం తప్పింది. నౌపడా జిల్లాలోని ఖరియార్ రోడ్ రైల్వే స్టేషన్ వద్ద పూరీ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రైలులోని బీ3 ఏసీ కోచ్‌లో (B3 coach) గురువారం రాత్రి 10 గంటల సమయంలో మంటలు వచ్చాయి. అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బ్రేక్ ప్యాడ్‌లో లోపం వల్ల మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. బ్రేకులను పూర్తిగా వదిలేయకపోవడం వల్ల రాపిడి తలెత్తి మంటలు అంటుకున్నాయని చెప్పారు. బ్రేక్ ప్యాడ్ మినహా రైలుకు ఎలాంటి నష్టం జరుగలేదని స్పష్టం చేశారు. మంటలను గుర్తించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది.. వాటిని ఆర్పివేశారని వెల్లడించారు. కొద్దిసేపటి తర్వాత రైలు అక్కడి నుంచి వెళ్లిపోయిందని పేర్కొన్నారు.
Odisha: ఒడిశాలో మరో రైలు ప్రమాదం…తప్పిన ముప్పు
రైలు ఖరియార్ రోడ్ స్టేషన్‌కు గురువారం రాత్రి 10.07 గంటలకు వచ్చిందని ఈస్ట్‌కోస్ట్ రైల్వే అధికారులు చెప్పారు. అలారం చైన్ లాగిన తర్వాత రిలీజ్ కాలేదని, దీంతో బ్రేక్ ప్యాడ్లపై ఒత్తిడి పడి మంటలు తలెత్తాయని చెప్పారు. కోచ్ లోపల ఎలాంటి మంటలు రాలేదన్నారు. సమస్యను పరిష్కరించిన తర్వాత రాత్రి 11 గంటలకు రైలు స్టేషన్ నుంచి బయల్దేరిందన్నారు. కాగా, దేశ రైల్వే చరిత్రలోనే అత్యంత దుర్ఘటన ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగ బజార్ స్టేషన్ వద్ద ఈ నెల 2న జరిగిన విషయం తెలిసిందే. బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, కోరమండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్సు రైలు ప్రమాదానికి గురవడంతో 288 మంది మరణించారు. మరో 1100 మందికిపైగా గాయపడ్డారు.