Ali met CM: తన విషయంలో త్వరలో గుడ్ న్యూస్ ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారని సినీ నటులు అలీ వెల్లడించారు. నేడు కుటుంబ సమేతంగా తాడేపల్లిలోని నివాసంలో సిఎంను అలీ కలుసుకున్నారు. ఏమి ఇస్తారనేది తనకు తెలియదని, రెండు వారాల్లో ప్రకటన ఉండొచ్చని తెలిపారు. పార్టీ ఆఫీసు నుంచే ఈ ప్రకటన చేస్తామని జగన్ హామీ ఇచ్చారన్నారు.
గత గురువారం సినీ ప్రముఖులు సిఎం జగన్ తో జరిపిన సమావేశంలో కూడా అలీ పాల్గొన్నారు. ఆ మరుసటి రోజు నుంచే అలీకి త్వరలో మంచి పదవి ఇస్తారని, రాజ్యసభకు పంపబోతున్నారని ప్రచారం జరిగింది. తన కుటుంబం సిఎంతో కలిసి ఫోటో దిగాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారని, ఈ విషయాన్ని మొన్న జగన్ కు చెప్పినప్పుడు అయన ఈరోజు సమయం ఇచ్చారని అలీ వెల్లడించారు. వైఎస్ కుటుంబంతో తనకు ఎప్పటినుంచో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. గత ఎన్నికలలోనే తనకు టికెట్ ఆఫర్ ఇచ్చారని అయితే సమయం లేనందువల్ల తానే వద్దని చెప్పానన్నారు.
ఈరోజు జరిగిన సమావేశం పూర్తిగా వ్యక్తిగతమని సినిమా అంశాలు చర్చకు రాలేదని అలీ చెప్పారు. సినిమా రంగ సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా నటులను పిలిచి అవమానించారన్న వార్తల్లో నిజం లేదన్నారు.
Also Read : సిఎం జగన్ ను కలవనున్న విష్ణు