Allantha Doorana- Ali: ‘అల్లంత దూరాన’ చిత్రం చక్కటి ప్రేమకథతో విజువల్ ఫీస్ట్ గా ఉంటుందని ప్రముఖ హాస్యనటుడు అలీ పేర్కొన్నారు. విశ్వ కార్తికేయ హీరోగా, సీనియర్ నటి ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాసన్ హీరోయిన్ గా చలపతి పువ్వల దర్శకత్వంలో ఆర్.ఆర్. క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై శ్రీమతి కోమలి సమర్పణలో నిర్మాత ఎన్. చంద్రమోహనరెడ్డి తెలుగు, తమిళ భాషలలో నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణానంతర పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన కార్యక్రమంలో ఈ చిత్రం టీజర్ ను హాస్యనటుడు అలీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ “కధకు తగ్గట్టుగా ఆర్టిస్టులను ఎంపిక చేసుకుని ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. కేరళలో కొన్ని సీన్స్, పాటలు తీసేటప్పుడు ఎత్తైన కొండల అంచుల పైకి ఎక్కి టీమ్ చాలా రిస్క్ చేసింది. ఇందులో నటించిన నటుడిగా తప్పకుండా ఇదో మంచి చిత్రమవుతుందని చెప్పగలను” అని అన్నారు.

నిర్మాత‌ కె.ఎల్.దామోదరప్రసాద్ మాట్లాడుతూ “ఈ చిత్రకథతో పాటు విజువల్స్, మ్యూజిక్ వంటివన్నీ చాలా బావున్నాయి. ఖ‌చ్చితంగా అంద‌ర‌కీ న‌చ్చుతుంది అనిపిస్తుంది. విజ‌యం సాధించి నిర్మాత‌కు లాభాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ “ఈ చిత్ర హీరో,హీరోయిన్లు తమతమ పాత్రలలో చక్కగా ఒదిగిపోయినట్లు అనిపిస్తోంది. కథ, కథనాలకు ప్రాధాన్యమిస్తూ తీసిన ఏ చిత్రమైనా విజయవంతమవుతుంది. ఇక పాటలు సందర్భానుసారంగా అమరాయంటే, ఇక ఆ చిత్రానికి తిరుగుండదు. ఆ కోవలోనే ఈ చిత్రం అలరింపజేస్తుంది” అని విశ్వాసం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *