కర్ణాటకలో కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసులో రాష్ట్ర మంత్రి కేఎస్ ఈశ్వరప్పతోపాటు ఆయన సహాయకులు బసవరాజ్, రమేష్ లపై పోలీసులు ఈ రోజు (బుధవారం) కేసు నమోదు చేశారు. కర్ణాటకలోని ఉడిపి పట్టణంలోని ఓ లాడ్జిలో కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ శవమై కనిపించాడు. తన వద్ద నుంచి లంచం డిమాండ్ చేసిన మంత్రి, అతని సహాయకుల వల్లనే సంతోష్ పాటిల్ ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి సోదరుడు ప్రశాంత్ పాటిల్ ఆరోపించారు.
సంతోష్ పాటిల్ సోదరుడి ఫిర్యాదుతో మంత్రి ఈశ్వరప్పతో సహా అతని ఇద్దరు సహాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన సోదరుడిని మంత్రి బెదిరించడంతో పాటు అతనిపై పరువు నష్టం కేసు కూడా పెట్టారని, తన సోదరుడి మృతికి మంత్రి వైఖరే కారణమని ప్రశాంత్ ఆరోపించారు. సంతోష్ తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళుతున్నానని భార్యకు చెప్పి ఏప్రిల్ 11న బెల్గాం నుంచి బయలుదేరి అదృశ్యమయ్యాడు. మంగళవారం అతని మృతదేహం ఉడిపిలో శవమై కనిపించింది.
హిజాబ్ వివాదం నేపథ్యంలో మంత్రి ఈశ్వరప్ప వ్యాఖ్యలు సొంత పార్టీనే ఇరుకునపెట్టాయని, తాజాగా కాంట్రాక్టర్ మృతి కేసులో ఆయన ప్రమేయం పార్టీకి తలపోటులా మారిందని, అవినీతికి సంబంధించి కూడా ఆరోపణలున్నాయని అందుకే ఈశ్వరప్పను మంత్రి పదవి నుంచి తప్పించాలని సీఎం బొమ్మై నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీఎం.. ఈశ్వరప్ప నుంచి రాజీనామా కోరతారని తెలుస్తోంది. కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య కేసులో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్పపై ఎఫ్ఐఆర్ నమోదైంది వాస్తవమేని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు.
మరోవైపు ఈశ్వరప్పను మంత్రివర్గం నుంచి తప్పించాలని కర్ణాటక పిసిసి చీఫ్ డీకే శివకుమార్ నేతృత్వంలో గవర్నర్ థావర్ చాంద్ గేహ్లోట్ ను కలిసి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. అవినీతి ఆరోపణలు, కాంట్రాక్టర్ ఆత్మహత్యకు కారకుడైన ఈశ్వరప్పను వెంటనే మంత్రివర్గం నుంచి తప్పించి…అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన దరిమిలా ఈశ్వరప్పను కేబినెట్ నుంచి తప్పించేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇవాళ ఆయనపై కేసు నమోదు తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
Also Read : బీసీల ఆశాజ్యోతి – బి. పి.మండల్