Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

వెనుకబడిన వర్గాల నుండి ఒక చదుకున్న వ్యక్తి తను వచ్చిన సమాజం అభివృద్ధి గురించి నిస్వార్థంగా, నిబద్ధతతో పని చేస్తే ఎలాంటి మార్పు ఉంటుందో ఒక ఉదాహరణ బీ.పీ. మండల్ ( బిందేశ్వరి ప్రసాద్ మండల్ ) బీహార్ లోని బనారస్ లో ఒక యాదవ్ కుటుంబంలో ఆగష్ట్ 25, 1918 లో జన్మించిండు. మాధేపురా జిల్లాలోని మోరో గ్రామంలో పెరిగిండు. మండేపురంలో మండల్ తన ప్రాథమిక విద్యని, దర్భాంగాలో ఉన్నత పాఠశాల విద్యని పూర్తి చేసిండు . పాట్నా కాలేజీలో ఇంటర్మీడియేట్ పూర్తి చేసిండు. ఆ తరువాత పై చదువులకై అతను ప్రెసిడెన్సీ కళాశాల కలకత్తాలో చేరిండు. దురదృష్టవశాత్తు, ఇంట్లో కొన్ని అనివార్యమైన పరిస్థితుల కారణంగా, అతను తన చదువుని విడిచిపెట్టవలసి వచ్చింది. మండల్ తన 23 వ ఏటనే జిల్లా కౌన్సిల్ కి ఎన్నికయిండు. 1945-51 మధ్య కాలములో మాధేపుర డివిజన్ లో జీతం తీసుకోకుండానే జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ గా పని చేసిండు.

మండల్ రాజకీయ జీవితం భారత జాతీయ కాంగ్రెస్ తో మొదలైంది. 1952 లో మొదటిసారి బీహార్ అసెంబ్లీకి శాసనసభ్యునిగా ఎన్నికయిండు. అధికార పక్షములో ఉండి బీహార్ లోని బలహీనవర్గ కుర్మీలపై అగ్రవర్ణ రాజుపుతులు దాడి చేయడాన్ని నిరసించిండు. 1965 లో తన నియోజకవర్గంలో భాగమైన గ్రామమైన పామాలో మైనారిటీలు,దళితులపై పోలీసులు చేస్తున్న అత్యాచారాలపై మాట్లాడాలని కోరుకున్నప్పుడు అధికార పక్షములో ఉండి ఈ అంశంపై మాట్లాడకూడదని ముఖ్యమంత్రి ఆదేసహించారు. దీంతో తన మనస్సాక్షిని చంపుకోలేక ఇతర పార్టీల ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరడానికి క్యూలు కడుతున్న సంధర్భములో తను నమ్మిన విలువల కోసం ప్రతిపక్ష పాత్ర నిర్వహించడానికి సిద్దమై సంయుక్త సోషలిస్ట్ పార్టీ (ఎస్ఎస్పి) లో చేరిండు.

ఎస్ఎస్పి రాష్ట్ర పార్లమెంటరీ బోర్డు ఛైర్మన్ గా నియమించబడిండు. 1967 ఎన్నికలలో ఎస్.ఎస్.పి అభ్యర్ధుల ఎంపికపై ఆయన చేసిన కృషి, ఆయన ప్రచారం వల్ల 1962 లో కేవలం 7 సీట్లు కల ఆ పార్టీకి 1967 లో 69 సీట్లు వచ్చినయి. బీహార్లో మొట్టమొదటి కాంగ్రెస్- ఎస్.ఎస్.పీ. ప్రభుత్వం ఏర్పడింది. ఆయన పార్లమెంటు సభ్యుడు కానప్పటికీ మంత్రివర్గంలో కేబినెట్లో చేర్చారు. ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసిండు. కానీ పార్టీలో , ప్రభుత్వములో కొన్ని విబేధాలు రావడముతో కాంగ్రెస్ పార్టీ బయటి నుండి మద్దతు ఇవ్వడముతో ఫిబ్రవరి 1, 1968 న బీ.పీ. మండల్ బీహార్ రాష్ట్ర రెండవ బీసీ ముఖ్యమంత్రిగా పని చేసిండు. కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకుంటూనే రాజీ పడకుండా రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల అవినీతిపై అయ్యర్ కమీషన్ వేసి విచారణ చేయించిండు. ఆ కమీషన్ నివేదికను బయలుపరచకుండా అప్పటి ప్రధాని ఇందిరాగాంధి స్వయంగా ఒత్తిడి తీసుకవచ్చింది.

ప్రధానితో మాట్లాడడానికి నిరాకరించడముతో ప్రభుత్వముపై అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గడముతో 30 రోజులకే మండల్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ సంఘటనలో బీహార్ గవర్నర్ చర్యలో స్పష్టంగా పక్షపాతం ఉంది. మండల్ ప్రభుత్వానికి అతను సృష్టించిన అడ్డంకులు దేశ చరిత్రలో భాగమైనయి. అతను తరచూ తన మంత్రులకు, “ఓట్లను సంపాదించడానికి కులపరమైన విజ్ఞప్తి సహించవచ్చు కానీ ప్రభుత్వాల నిర్ణయాలల్లో ఏ కులతత్వాన్ని సహించవద్దు” అని చెప్పే మండల్ తన ప్రభుత్వములో పరిపాలనలో ఎక్కడ కులతత్వాన్ని ప్రదర్శించకుండా పాలించిండు. మార్చి 5 , 1967 న సోషిత్ దళ్ ( అణగారిన ప్రజల పార్టీ ) ని స్థాపించిoడు. 1972 లో తిరిగి శాసన సభకి ఎన్నికయిండు. 1972 లో అప్పటి బీహార్ బ్రాహ్మణ ముఖ్యమంత్రి పాండే మిథిలా యూనివర్సిటీ పేరుతో అందులో కింది ఉద్యోగి నుండి వైస్ ఛాన్సలర్ వరకు ఒకే కులం వారితో నింపాలనే ప్రయత్నాలని వ్యతిరేకించిండు.

1974 లో శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసి జయప్రకాష్ నారాయణ నేతృత్వములో నడుస్తున్న అవినీతి వ్యతిరేక ఉద్యమములో పాల్గొన్నాడు. 1977 లో జనతా పార్టీ తరపున లోక్ సభకి ఎన్నికయిండు. ఎమర్జెన్సీ తర్వాత ఏర్పాటైన జనతా ప్రభుత్వం ఇందిరాగాంధీని డిబార్ చేయాలని అధికార పార్టీ సభ్యులు తెచ్చిన తీర్మానాన్ని మండల్ వ్యతిరేకించిండు. మండల్ తన రాజకీయ జీవితంలో సోషలిస్ట్ రాజకీయాల ఆలోచనపరుడిగా పని చేసిండు. బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగములో కల్పించిన ఆర్టికల్ 340 ప్రకారం “ సామాజిక మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతుల పరిస్థితులని పరిశీలించేందుకు రాష్ట్రపతి ఒక కమీషనుని నియమించి ఆ కమీషన్ సూచించిన సిఫార్సులపై తగు చర్యలు తీసుకునేందుకు పార్లమెంట్ కి సూచిస్తడు “. దీని ప్రకారం జనవరి 1 ,1979 న జనతా ప్రభుత్వం కాలములో ఏర్పాటు చేసిన రెండవ వెనకబడిన తరగతుల కమీషన్ ఛైర్మన్ గా బీ.పీ. మండల్ భాధ్యతలు చేపట్టిండు. కమీషన్ డిసెంబర్ 31 , 1980 న ప్రభుత్వానికి తన నివేదికని సమర్పించింది. కానీ జనతా పార్టీ ప్రభుత్వం పడిపోవడంతో మండల్ సిఫార్సుల అమలు మూలకి పడింది.

మళ్లీ 1990 ఆగష్ట్ 7 న తొలి భారత బ్రాహ్మణేతర ప్రధాని వీ.పీ.సింగ్ తమ జనతాదళ్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రకారం మరియు మాన్యవర్ కాన్షీరామ్ డిల్లీ లోని బోట్స్ క్లబ్ వద్ద 40 రోజుల పాటు ‘ మండల్ అమలు కరో యా కుర్సీ ఖాళీ కరో ‘ ( మండల్ సిఫార్సులని అమలు చేయండి లేదా గద్దె దిగిపోండి ) అంటూ చేసిన ఆందోళన వల్ల పార్లమెంట్ లో మండల్ కమీషన్ సూచించిన 40 సిఫార్సులల్లో కనీసం ఒక్కటైన బీసీలకు కేంధ్ర ప్రభుత్వ ఉద్యోగాలల్లో 27% రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ప్రకటించిండు. మళ్లీ ఒకసారి బీసీల గురించి పట్టించుకున్నందుకు ప్రభుత్వానికి మద్దతిస్తున్నవారు మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం పడిపోయింది.మండల్ కమీషన్ సిఫార్సులని పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతి ఏడు ఆగష్ట్ 7 ని ‘ మండల్ డే ‘ గా జరుపుకుంటున్నాము . కేవలం 61 ఏళ్ల వయస్సులో మండల్ క్రియాశీలక రాజకీయాలను విడిచిపెట్టిండు. తన నివేదిక నుండి వ్యక్తిగతంగా ఎటువంటి రాజకీయ ఫలితాలని ఆశించలేదు. అతను ఏప్రిల్ 13, 1982 న పాట్నాలో మరణించాడు. బీసీలు విద్యా, ఉద్యోగ, చట్ట సభల్లో, ఆర్థిక రంగంలో న్యాయమైన వాటా పొందినప్పుడే బీ.పీ. మండల్ కి  దేశ ప్రజలు ఇచ్చే సరైన నివాళి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com