దశమంతులకే “దాశరథి” గారి పరిచయం దొరికేదేమో …
నేను దశమంతుడను కనుకే వారి సాన్నిహిత్యం లభించిందేమో…
నేను చదువుకునే రోజుల్లో “శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం” అంటే నాకు తిరుపతి దేవాలయంతో సమానం …ఎందుకంటే ఎందరో కవుల రాకపోకలకి, వారి కవితాగానాలకి నిలయం అది.
ఆనాటి ఎందరెందరో కవులను ప్రత్యక్షంగా చూడ్డానికి, వారి వారి రసాత్మకమైన కవితలు వినడానికి …మాకు అదే వేదిక. ఆవేదికపై శ్దాశరథి గారిని, సి. నారాయణ రెడ్డి గారిని , దేవులపల్లి రామానుజ రావు గారిని, గుంటూరు శేషేంద్ర శర్మ గారిని ,ఆరుద్ర గారిని… శ్రీశ్రీ గారిని…ఇలా ఎందరినో కలిసే అవకాశం నాకు లభించింది.
వారిలో నాకు “నన్ను తమకు” సన్నిహితంగా ఉంచుకొని స్ఫూర్తిని కలిగించిన మాటలతో… కవితావేశాన్ని నింపిన వారు… సినారె, దాశరథి గార్లు. దాశరథి గారు ఏ కవి సమ్మేళనానికి వచ్చినా …వారు కారు దిగడానికి ముందే నేను అక్కడ నిలబడితే… నా భుజం మీద చేయి వేసి వేదిక వరకు నడిచి వచ్చిన… జ్ఞాపకాలు నన్ను ఎప్పుడూ ఉత్తేజితుడిని చేస్తూనే ఉంటాయి. భాషానిలయంలో ఒకసారి నేనొక కవిత చదివినప్పుడు… వారు ఆ సభకి అధ్యక్షత వహిస్తూ…. నా కవిత పూర్తికాగానే … “పిట్ట కొంచెం కూత ఘనము, ఎంత పెద్ద గొంతుతో, ఎంత స్పష్టంగా కవిత్వం చెప్పాడు వీడు!” అని నా గురించి చెప్పిన మాటలు, నా కవితా ప్రస్థానంలో ఈరోజుకి నన్ను నడిపిస్తూనే ఉన్నాయి. ఎన్నో సభల్లో వారు కవిత్వం చెబితే ప్రత్యక్షంగా వినే భాగ్యం దొరికింది ….ముఖ్యంగా వారి తెలంగాణ ఉద్యమం నాటి మాటలు పాటలు కలగలిపిన కవిత్వం రక్తాన్ని ఉప్పొంగించేవి.
జర్నలిస్ట్, రచయిత పమిడికాల్వ మధుసూదన్ పరిచయం అయిన తర్వాత “ఆ చల్లని ఆ సముద్ర గర్భం దాచిన బడబానల మెంతో” గీతాన్ని ఆయన గానం చేస్తూ వినిపిస్తున్నప్పుడు, నా కళ్ళ ముందు దాశరథిగారే ప్రత్యక్షమై …వింటున్నట్టు అనిపించేది. వారు ఎన్నెన్నో కవితల్ని వినిపిస్తుండేవారు.
దాశరథి గారు సినిమా కోసం ఎన్నెన్నో పాటల్ని రాసినా ….నాకు ఇష్టమైనది మాత్రం …భగవంతుడిని నిందాస్తుతి చేస్తూ…నిలబెట్టిన పాట… ” నడిరేయి ఏ జాములో స్వామి నిను చేర దిగి వచ్చునో “ అంటూ తన కమ్యూనిస్టు భావాలని ఈ భక్తి గీతంలో చొప్పించిన తీరు అనన్యసామాన్యమైనది. వెంకటేశ్వర స్వామిని ఇలా “కలవారినే గాని కరుణించలేడా?… నిరుపేద మొరలేవి వినిపించుకోడా?” అలాంటప్పుడు స్వామికి “కరుణామయుండన్న బిరుదేలనమ్మ… అడగవే మాయమ్మ అలవేలుమంగ” అని ప్రశ్నించిన తీరు…. నేను స్వామిపై పాటలు రాస్తున్నప్పుడు అనేకచోట్ల నాకు స్ఫూర్తిని రగిలించింది. అందుకే నా పాటల్లో సుతి మెత్తని ఎత్తిపొడుపులతో… నిందాస్తులు కనపడతాయి. అలాంటి మహానుభావుడి శతజయంతి వేళ తీపి గురుతులు నెమరువేసుకోవడం ఒక పులకింత.
(దీనితో ఈ ధారావాహిక సమాప్తం)
-నరసింహా రెడ్డి
మా పల్లె