ముంబైలో జరుగుతున్న విపక్ష కూటమి (ఇండియా) సమావేశంలో రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ప్రత్యక్షం కావడం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపింది. ఈ సమావేశానికి సిబల్‌ను అధికారికంగా ఆహ్వానించకపోయినప్పటికీ ఆయన హాజరు కావడం పలువురిని విస్మయపరిచింది.
ఇండియా భేటీలో అనూహ్యంగా కపిల్ సిబల్ కనిపించడంపై ఇండియా ముంబై భేటీలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్ధవ్ ఠాక్రేకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఫిర్యాదు చేశారు. అయితే విపక్ష సమావేశానికి ఎవరు హాజరైనా తమకు అభ్యంతరం లేదని కాంగ్రెస్ అగ్రనేత, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కపిల్ సిబల్ గత ఏడాది మేలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏను దీటుగా ఎదుర్కొనే క్రమంలో ఉమ్మడి అజెండా, సీట్ల సర్ధుబాటుపై స్పష్టత కోసం ఈ సమావేశంలో విపక్షాలు కసరత్తు సాగిస్తున్నాయి. ఇదే సమావేశంలో విపక్ష కూటమి ఇండియా లోగోను కూడా ఖరారు చేయనున్నారు. కూటమి కన్వీనర్ నియామకంపైనా నేతలు చర్చించనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి పోరుకు సంబంధించి ఈ భేటీలో విపక్ష నేతలు కీలక నిర్ణయాలతో ముందుకు రానున్నారు. సమన్వయ కమిటీ, సహా పలు ఉప కమిటీలను నేతలు ప్రకటిస్తూ సంయుక్త ప్రకటనను జారీ చేయనున్నారు.