చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ మూడు రోజుల కాల్ షీట్ ఇచ్చారని దీనిలో భాగంగానే విశాఖకు వచ్చారని, అయన వినిపించేది జనవాణి కాదని, చంద్రబాబు వాణి అని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఇంతకుముందు జరిగిన జనవాణితో ఏం సాధించారని ప్రశ్నింకాహారు. నిన్న విశాఖలో జన సేన కార్యకర్తలు అలజడి సృష్టించే ప్రయత్నం చేశారన్నారు. ఉత్తరాంధ్ర గర్జనలో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో మంత్రులు, పార్టీ నేతలపై దాడికి ప్రయత్నించారని మండిపడ్డారు. తమ పార్టీ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేశారని పవన్ ప్రశ్నించడం విచిత్రంగా ఉందని, దాడి చేస్తే అరెస్ట్ చేయకపొతే శాలువాలు కప్పి, దండలు వేసి సన్మానం చేస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబు చేతికి నొప్పి లేకుండా ఈ పని చేశారు కాబట్టి పవన్ కు ఆర్ధిక సన్మానం కూడా చేస్తారని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
శాంత్రి భద్రతలకు విఘాతం కలిగిస్తే అలాంటి శక్తులను అణచివేయాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉంటుందని అంబటి స్పష్టం చేశారు. సినిమా మోజులో ఉన్నవారు, మా కులం అంటూ ఎగబడే యువతను రెచ్చగొట్టడం సరికాదని, రాజకీయాలను రాజకీయాలుగా చేయాలి గానీ ఇలాంటి విధానాలతో రెచ్చగొట్టడం మానుకోవాలని హెచ్చరించారు. చంద్రబాబుకు పవన్ బానిసగా వ్యవహరిస్తున్నారని అందుకే ఒళ్ళు బలిసిన వారి పాదయాత్రకు మద్దతుగా నిలబడుతున్నారని తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. పార్టీ కార్యకర్తలను, నేతలను అదుపులో ఉంచుకోవాలని… జన సేన పేరు మార్చి బాబు సేన అనో, అశాంతిని సృష్టించే సేన అనో పేరు మార్చుకోవాలని పవన్ కు సూచించారు