Friday, October 18, 2024
HomeTrending Newsటిబెటన్లకు అండగా అమెరికా

టిబెటన్లకు అండగా అమెరికా

తైవాన్ తో తగవుకు తహతహలాడుతున్న చైనాను కట్టడి చేసేందుకు అమెరికా పావులు కదుపుతోంది. సరిహద్దు దేశాలతో నలుదిశలా కయ్యానికి దిగుతున్న చైనా.. స్వార్థమే అజెండాగా గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో అమెరికా టిబెట్ అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చింది.

టిబెట్ సంస్కృతిని చెరిపివేయడానికి చైనా కుట్ర చేస్తోందని అమెరికా ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ ఆరోపించారు. భారత్ లో పర్యటిస్తున్న నాన్సీ పెలోసీ.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాలలో బౌద్ధమత గురువు దలైలామాతో సమావేశంమయ్యారు. ఆమెతోపాటు అమెరికా చట్టసభ విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్ మెక్ కాల్, ఇతర సభ్యులు ఉన్నారు.

చైనా సందర్శిస్తున్న వారు టిబెట్ వెళ్లేందుకు ఆంక్షలు విదిస్తున్నారని ఆరోపించారు. 25 ఏండ్లుగా టిబెట్ వీసా కోసం ప్రయత్నిస్తున్నానని… ఇన్నాళ్ళకు తీరిందని నాన్సీ పెలోసీ చెప్పారు. టిబెటన్ భాష వాడకాన్ని తగ్గించి టిబెట్ సంస్కృతిని చెరిపేందుకు చైనా ప్రయత్నాలను అమెరికా ఎంత మాత్రం సాగనివ్వబోదని నాన్సీ పెలోసీ స్పష్టం చేశారు. ఈ విషయమై చైనాపై మరింత ఒత్తిడి పెంచేందుకు అవసరమైన బిల్లుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ త్వరలో సంతకం చేస్తారన్నారు.

‘రిసాల్వ్ టిబెట్’ చట్టంపై టిబెట్ నేతలతో చర్చించాలని చైనాను కోరనున్నట్లు చెప్పారు. తొలుత టిబెట్ లో పర్యటించిన నాన్సీ పెలోసీ టీం… అక్కడ నుంచి హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలకు చేరుకుని దలైలామాతో భేటీ కావడం గమనార్హం. రిసాల్వ్ టిబెట్ చట్టంపై సంతకం చేయొద్దని జో బైడెన్‌ను చైనా కోరింది.

శాంతియుత జీవనం సాగించే టిబెటన్లపై చైనా దమననీతి సాగిస్తోందని నాన్సీ ఆరోపించారు. పొరుగు దేశాలతో కయ్యానికి దిగుతున్న చైనా ఆగడాలపై ఐక్యరాజ్యసమితిలో ప్రత్యేకంగా చర్చించాలని… ఇందుకోసం అమెరికా చొరవ తీసుకుంటుందని వెల్లడించారు. టిబెటన్లకు అమెరికా ఎల్లవేళలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

తైవాన్ తో ఏ క్షణంలో అయినా యుద్దానికి దిగేందుకు సిద్దమవుతున చైనాను దారిలోకి తెచ్చేందుకే అమెరికా నాన్సీ పెలోసీని ధర్మశాలకు పంపారని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకుల అంచనా.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్