Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసినిమా సాహిత్యం- ఒక పరిశీలన

సినిమా సాహిత్యం- ఒక పరిశీలన

ATA finds conspiracy in Telugu cinema  Literature:
సాక్షి దిన పత్రికలో, హైదరాబాద్ సిటీ పేజీలో, లకడికాపూల్ జోనల్ చోటులో ఒక చిన్న వార్త ఇది. సారాంశం- సినిమా పరిశ్రమలో సాహిత్యానికి విలువ లేకపోవడం. సినిమాల్లో సాహిత్యంలా ప్రతీకాత్మకంగా ఈవార్త కూడా ఎవరికీ కనిపించకుండా ఒక మూల పడి ఉంది.

నందిని సిద్ధా రెడ్డి, కె. శివా రెడ్డి, బి. నర్సింగ రావు తదితరులు పాల్గొన్న ఈ సమావేశాన్ని నిర్వహించింది- అమెరికా తెలుగు అసోసియేషన్- ఆటా. సాహిత్యానికి చోటు లేకుండా సినిమా పరిశ్రమలో పెద్ద కుట్ర జరుగుతోందని సమావేశం అభిప్రాయపడింది. ఈ కుట్ర కోణానికి వారి దగ్గర ఏయే ఆధారాలున్నాయో గానీ…ఈ వార్త మాత్రం నాకు తెగ నచ్చింది.

ఎక్కడో అమెరికాలో ఉన్న తెలుగువారు హైదరాబాద్ రావడమేమిటి? వచ్చి కవులతో ఒక మీటింగ్ పెట్టడమేమిటి? సినిమాల్లో సాహిత్యానికి విలువ లేకుండా చేయడానికి పెద్ద కుట్ర జరుగుతోందని బల్ల గుద్ది చెప్పడమేమిటి? ఆటాను మనస్ఫూర్తిగా అభినందిస్తూ…విషయంలోకి వెళదాం.

ఏది సాహిత్యం?
ఏది కాదు? అన్నదానికి నిర్వచనం సరిగ్గా లేకపోవడం వల్ల…కలం పట్టిన ప్రతివారూ తెలుగు నేల మీద కవులని తమకు తాము అనుకోవడం వల్ల…జీవం లేని గుడ్డి గూగుల్ యంత్రాలు కూడా సజీవ కవుల కంటే గొప్పగా రాస్తుండడం వల్ల…ఆటా సాహిత్య దృక్పథంలోనే ఏదో లోపం ఉన్నట్లు ఉంది. ఆటా ఉద్దేశం మంచిదే అయినా…సినిమాల్లో కవులకు, సాహిత్యానికి అవమానం జరగడం లేదని, కంటికి కనిపించని కుట్రలు ఏవీ జరగడం లేదని నేను సినీ పరిశ్రమ తరఫున వివరణ లాంటి హామీ ఇవ్వదలచుకున్నాను.

రత్తాలు బొత్తాలు పట్టుకున్నప్పుడు త్తా ప్రాస కుదిరి రైలు పట్టాలు తప్పి ప్రేక్షకుల గుండెల మీదికి నేరుగా వచ్చినప్పుడు సాహిత్యానికి సినిమా పెద్ద పీట వేసి…విలువ పెంచిందే కానీ…తగ్గించలేదు.

మి మ్మీ మిమ్మిమ్మీ
ఇకపై ఓన్లీ యూ అండ్ మీ…అన్నప్పుడు షేక్స్ పియర్ ను చంపి పుట్టిన ఇంగ్లీషు సాహిత్యాన్ని తెలుగు సినిమా సాహిత్యం విశాల హృదయంతో భరించిందే కానీ…కాదనలేదు.

దిగు దిగు దిగు నాగ …అని రాయకూడని, పాడకూడని మాటలు ఉన్నా సినిమా సాహిత్యం ఆ మాటలను మోసిందే కానీ…కాడి కింద పడేయలేదు.

నాటు మోటు పాటలతో చాటు మాటు వదిలి సినిమా సాహిత్యం వివస్త్ర అయితే దాక్కో దాక్కో పులొచ్చి కొరుకుద్ది పీక అని అరిస్తే…ప్రేక్షకులే పొదల చాటుకెళ్లి మానాలు కాపాడుకున్నారు.

చీమచీమ చిమ చీమ చీమా…అని గండు చీమలు హీరో ఇన్ బొడ్డు దగ్గర గింగిరాలు తిరిగితే జక్కన్నల చిత్ర శిల్పాలకు సినిమా సాహిత్యం కొండంత అండగా నిలిచిందే తప్ప…అర్థం పర్థం, అపార్థం, దురర్థం, అనర్థం అని కుట్రలేమీ చేయలేదే?

బన్నీని చూడగానే హీరో ఇన్ కు జారిన చున్నీతో అన్నీ కాదు కొన్నే కొల్లగొట్టు అని పిలుపునిస్తూ మధ్యలో ప్రాసకోసం అనవసరంగా తల్లిలాంటి పిన్నిని లాగితే సాహిత్యం పెద్ద మనసుతో అంగీకరించిందే కానీ…అభ్యంతరమేమీ చెప్పలేదే?

విజిలేస్తే సోడా బుడ్డి ప్రాసకోసం మిడ్డీని జారిస్తే…విశాఖ ఉక్కు కడ్డి నానా గడ్డి కరచి గడ్డి వాము వెనుక దాక్కుందే కానీ…సాహిత్యానికి రసభంగమేమీ జరగలేదే?

ఒకటో ఎక్కం కూడా మరచిపోయేట్లు ఒకటే గుర్తొస్తుంటే పాటలో ఎక్కాల లెక్కలను సాహిత్యం వెతుక్కుందే తప్ప…కవి/రచయిత రెమ్యునరేషన్ ఏమీ ఎగ్గొట్టలేదే?

Natu song

అయినా తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతి నిర్మాత కవే. ప్రతి దర్శకుడూ కవి సింహమే. 24 క్రాఫ్ట్ లలో ఉన్నవారందరూ కవులు, రచయితలు, సాహితీ కార్మికులే.

న భూతో న భవిష్యతి అనదగ్గ తెలుగు మహోజ్వల సాహిత్యం ఉన్నది ఒక్క సమకాలీన సినిమాల్లోనే. పరాయి గడ్డ మీద దశాబ్దాల పాటు ఉండడం వల్ల ఆటా వారు ప్రస్తుత తెలుగు సినిమాల్లో సాహిత్యానికి విలువ లేదని అనవసరంగా సమావేశం పెట్టి చాలా శ్రమ పడ్డారు. వచ్చినదారినే ఆటా వారు వెళ్లకుంటే…

ప్రస్తుత తెలుగు సినిమాల్లోని గొప్ప సాహితీ ఖండాలనదగ్గ వాటిని ఎంపిక చేసి వినిపించాల్సి వస్తుందని ఇందుమూలముగా బహిరంగ ప్రకటన చేయడమయినది. సినిమా క్రియేటివ్ లిబర్టీ నిరంకుశత్వాన్ని ప్రశ్నించే అధికారం ఆటాకు ఉండదని గ్రహించకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. సినిమా లేకుంటే తెలుగులో సాహిత్యమే లేదు. సాహిత్యం లేకపోయినా సినిమా ఉంటుందని…ఆటా అర్జంటుగా తెలుసుకోవాల్సిన అవసరముంది!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

తెలుగు పాటల తిక్క

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్