Friday, November 22, 2024
HomeTrending NewsGun Culture: అమెరికాలో కాల్పుల మోత...22 మంది మృతి

Gun Culture: అమెరికాలో కాల్పుల మోత…22 మంది మృతి

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. మైనే రాష్ట్రంలోని లెవిస్టన్‌లో దుండగుడు జరిపిన మాస్‌ షూటింగ్‌లో 22 మంది మరణించారు. మరో 60 మందికిపైగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు.

కాల్పులు జరిపిన వెంటనే దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన పోర్ట్‌లాండ్ కు 56 కిలో మీటర్ల దూరంలో జరిగింది. పోర్ట్‌లాండ్‌లో అతి పెద్ద నగరం లెవిస్టన్, రెండో నగరం మైన్ అని అధికారులు వెల్లడించారు. దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

కాల్పులు జరిపినట్లు భావిస్తున్న అనుమానితుడి ఫొటోను పోలీసులు సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. అందులో అతడు సెమీ ఆటోమేటిక్‌ రైఫిల్‌తో కన్పించాడు. గతంలో యూఎస్‌ ఆర్మీలో పనిచేసిన ఓ రిజర్వ్‌ సభ్యుడిగా పోలీసులు భావిస్తున్నారు. అనుమానితుడిని రాబర్ట్‌ కార్డ్‌గా గుర్తించారు. 40 ఏళ్ల రాబర్ట్ మైనేలోని యూఎస్‌ ఆర్మీ రిజర్వ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో ఫైర్‌ ఆర్మ్స్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసి రిటైర్‌ అయినట్లు పోలీసులు వెల్లడించారు. గతంలో గృహహింస కేసులో అరెస్టయి విడుదలయ్యాడని చెప్పారు. ఈ ఏడాది ఆరంభంలో అతడి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఓ మానసిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

2023వ సంవత్సరం ఆగస్టు ఒకటి దాకా అమెరికాలో తుపాకి కాల్పుల్లో మరణించిన వారు 25,000 మంది అని నివేదికలు చెపుతున్నాయి. రోజుకు సగటున 118 మంది తుపాకి తూటాలకు బలి అవుతున్నారు. ఇందులో 420 మాస్ షూటింగ్స్…
అంటే తుపాకి తీసుకొని విచ్చల విడిగా చంపేయడం జరిగింది.

విచ్చిన్నమైపోతున్న వివాహ, కుటుంబ వ్యవస్థ… భరించలేని ఏకాంతం, మానసిక కుంగుబాటు, అగ్రేషన్ .. సెల్ ఫోన్ లు .. హింసాత్మక వీడియోలు .. మార్కెట్ లో విచ్చలవిడిగా దొరికే తుపాకులు (జనాభా కంటే మూడు కోట్ల తుపాకులు ఎక్కువ ) గంజాయి తదితర మాదక ద్రవ్యాల వాడకం అని మానసిక విశ్లేషకులు చెపుతున్నారు. కెనడా సరిహద్దుల్లోని మైనే రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వాడకం అధికంగా ఉంటుంది.

తుపాకీ సంస్కృతిని అమెరికాలో కట్టడి చేయటం ఆ దేశ ప్రభుత్వాల తరం కాదు. రాజకీయ పార్టీలతో మమేకమైన ఆయుధ సంస్థల లాబీ…అమెరికా విధానాలనే ప్రభావితం చేస్తుంది.

ఇవేవి పట్టనట్టు భారతీయ యువత చదువులు, ఉపాధి కోసం పెద్ద సంఖ్యలో అమెరికా తరలివెలుతున్నారు. కొద్దిరోజులుగా అమెరికా యువతలో ఆసియా ఖండం ప్రజల పట్ల ఏహ్య బావం పెరుగుతోంది. తమ ఉద్యోగాలను కొట్టేస్తున్నారని ఈసడించుకుంటున్నారు. ఇప్పుడు నల్లజాతివారి పట్ల ఉన్న ద్వేషబావం రాబోయే రోజుల్లో ఆసియా దేశ ప్రజల పట్ల పెరిగే ప్రమాదం ఉంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్