వాణిజ్య ప్రకటనల్లో భాష ఇనుప గుగ్గిళ్లకంటే కఠినం. బియ్యంలో రాళ్లలా ఎక్కడో ఒకటి వస్తేనే పంటి కింద రాయి అని గుండెలు బాదుకుంటున్నాం. అలాంటిది రాళ్ల మధ్య బియ్యమయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి.
కొన్ని ప్రకటనల్లో మాటలు:-
అగ్నిని అవరోధిస్తుంది.
(మంటలను అడ్డుకుంటుంది)
ప్రహుర్ష వినియోగదారులు
(తృప్తి చెందిన వినియోగదారులు)
సిల్వర్ అయాన్ ఆధారిత ఇండియన్ మెడికల్ అసోసియేషన్
(భారత మెడికల్ అసోసియేషన్ ఆమోదించిన సాంకేతికత)
బ్రాకెట్లలో ఉన్నది అసలు విషయం. వాటి పైన ఉన్నది టాటా, హీరో, ఏషియన్ పెయింట్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీల తెలుగు అనువాద ప్రకటనల్లో భాష. బహుశా భారత దేశంలో పేరు గొప్ప కంపెనీల ప్రకటనలు మొదట ఇంగ్లీషులో తయారై, తరువాత హిందీలోకి అనువాదమై, చివర ప్రాంతీయ భాషల్లోకి వస్తాయి.
మన నల్లమల గూడేల్లో చెంచులు వాడాల్సిన ఒంటి సబ్బు ప్రకటన ఇటలీ మిలాన్ వీధుల్లో షూట్ చేసి, లండన్లో గ్రాఫిక్స్ కలిపి, బాంబేలో ఎడిట్ చేసి వదిలితే అందారు మెచ్చి రంగూల బట్టలు ఉతుక్కుంటూ ప్రతి తలకట్టుకు లేని దీర్ఘం పెట్టుకుని పాడుకుంటూ ఉంటాం. రంగూలు ఏమిటని ముప్పయ్ ఏళ్లుగా తెలుగు అందారు అడగలేకపోయారు. మొత్తం ఇంగ్లీషులో మాట్లాడే తెలుగు జాతితో పోలిస్తే అందారి రంగూలు ఏరకంగా చూసినా గొప్పే.
వాణిజ్య ప్రకటనల్లో భాష ఎలా ఉండాలి అనడానికి అమూల్ ప్రకటనలు ఒక కొలమానం. ఈ రంగంలో వారికి అమూల్ ప్రకటనలు పాఠ్య పుస్తకం లాంటివి. ఇన్ని దశాబ్దాలుగా రోజూ ఒక ప్రకటనను రూపొందిస్తున్న ఆ యాడ్ ఏజెన్సీని అభినందించాలి. ఆ కాపీ రైటర్లకు చేతులెత్తి మొక్కాలి.
ప్రపంచంలో జరిగే ప్రతి సంఘటనను పట్టుకుని- ఒక ఎడిటర్ ఎడిటోరియల్ రాసినట్లు అమూల్ ప్రకటన రెండు లైన్లలో అద్భుతంగా తయారవుతూ ఉంటుంది. పైగా ప్రతి విషయం, ప్రతి రోజూ అమూల్ కు ముడి పెట్టాలి. మాటల విరుపు, పొడి అక్షరాల చమత్కారం, రంగుల్లో వైవిధ్యం, పాటలు, సామెతల వాడుక…ఇలా భాషను ఎంత గొప్పగా, కవితాత్మకంగా, సృజనాత్మకంగా వాడుకోవచ్చో అమూల్ యాడ్ ను చూసి నేర్చుకోవచ్చు. ఇంతా చేస్తే రోజూ ఆ రెండు లైన్ల ప్రకటన ఇంగ్లీషులోనే ఉంటుంది. కానీ అది ఎవరి భాషకు వారికి సొంతంలా అనిపిస్తుంది.
ఉదాహరణకు తమిళనాడు ఎన్నికల్లో స్టాలిన్ గెలిచి, ముఖ్యమంత్రి అయిన సందర్భంలో అమూల్ యాడ్ చూడండి.
MK Stal win
అని ఎం కె స్టాలిన్ పేరులో అక్షరాలను అటు ఇటు చేసి ఆయన గెలుపును హెడ్డింగ్ చేశారు.
DMK అన్న ఆయన పార్టీకి నిర్వచనాన్ని
Delicious Mix in Kitchens అని అద్భుతంగా అమూల్ కు అన్వయించారు. చూడ్డానికి ఇది చాలా సింపుల్ గా ఉన్నా- ఇలా రాయడానికి చాలా విషయ పరిజ్ఞానం, భాష మీద పట్టు, పదాల మీద స్వారి చేయగల నేర్పు ఉండాలి.
అమూల్ పాలు శరీరానికి పౌష్టికాహారం. అమూల్ ప్రకటనలు మెదడుకు పౌష్టికాహారం. భాషకు మెడలో హారం.
-పమిడికాల్వ మధుసూదన్