Thursday, March 13, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంస్మగ్లింగ్ పాత్ర

స్మగ్లింగ్ పాత్ర

విలేఖరి:-
కన్యారావు గారూ! నెలకు నాలుగు వారాలుంటే…మీరు ఎనిమిదిసార్లు బెంగళూరు నుండి దుబాయ్ ఎలా వెళ్ళి…మళ్ళీ రాగలుగుతున్నారో చెప్పగలరా?

కన్యారావు:-
ఎమిరేట్స్ విమానంలో.

వి:-
ఏడ్చినట్లుంది. అది మాకూ తెలుసు. వెళ్ళినప్పుడు మీ నడుము ఖాళీగా…నడుమే లేనట్లు ఉండి… వచ్చేప్పుడు అందరి పొట్టలు మీలో లయించినట్లు ఉబ్బి ఉంటోందట!

క:-
నేను బేసిగ్గా సౌతిండియన్ ఫుడ్డే తింటాను. దుబాయ్ లో సౌతిండియన్ ఫుడ్ వేళకు దొరక్క అరబ్ ఫుడ్డు తిన్నాను. దాంతో ఉబ్బు సహజం.

వి:-
ఒక్కోసారి పది, పదిహేను కేజీల బంగారం మీ నడుముకు చుట్టుకుని ఉంటోందట. ప్రొఫెషనల్ బంగారం స్మగ్లింగ్ లో ఎంతకాలం నుండి ఉన్నారు? మీ నాన్న రాష్ట్రంలో పోలీసు ఉన్నతాధికారి కావడం వల్ల…మీరు బెంగళూరులో బంగారంతో దిగిన ప్రతిసారీ చెకింగులు, కస్టమ్స్ స్కానింగులు లేకుండా సాయుధ ప్రోటోకాల్ తో దర్జాగా విమానం దిగి వెళ్ళిపోతున్నారట!

క:-
నా నడుముకు అంతంత బంగారం తీగలై, సోగలై ఎలా చుట్టుకుంటోందో నాకు తెలియడం లేదు. ఇదొక అసంకల్పిత స్వర్ణ అయస్కాంత చర్య. దీనిమీద భౌతిక, రసాయన శాస్త్రవేత్తలు సంయుక్తంగా పరిశోధన చేసి తేల్చాలి!

వి:-
బెంగళూరులో దిగగానే ఆ బంగారాన్ని మీరొక నగలదుకాణం అతడికి ఇచ్చేవారట కదా! ఆయన్ను కూడా అరెస్ట్ చేశారు…మీరు స్మగ్లింగ్ ను వృత్తిగా ఎంచుకున్నారా? ఇందులో మీరు సూత్రధారి? పాత్రధారి? పాత్రల్లో ఉన్నారా?

క:-
నేను అనేక పాత్రలు వేశాను.

వి:-
అవునవును. అనేక పాత్రల్లో బంగారాన్నే నింపుకుని, ఒంపుకుని దుబాయ్ ఎడారులనుండి బెంగళూరుకు వస్తారట కదా?

క:-
పాత్ర, సిచువేషన్ డిమాండ్ చేసింది.

వి:-
ఇప్పటికి ఎన్ని టన్నుల బంగారం స్మగ్లింగ్ చేసి ఉంటారు?

క:-
నేనింకా కన్యను. రేప్పొద్దున పెళ్లయ్యాక టన్ను బంగారమన్నా ఒంటిమీద లేకపోతే ఎలాగమ్మా? అని నిజాయితీపరుడైన మా నాన్న తండ్రిగా నిజాయితీగా బాధపడితే…నేను కూతురిగా తండ్రి మనసెరిగి…నిజాయితీగా నా ప్రయత్నం నేను చేశాను.

వి:-
స్మగ్లింగ్ కు తండ్రి పరపతిని, ఆయుధాలను, ప్రోటోకాల్ ను వాడుకున్నారు. అంతేనా?

క:-
దీన్ని స్మగ్లింగ్ అంటారా? నాకు తెలియదు. కూతురిగా నా కర్తవ్యం అనుకున్నాను. బాధ్యత నెరవేర్చడంలో భాగమనుకున్నాను….

(విలేఖరి కరెంట్ షాక్ తగిలిన కాకిలా బెంగళూరు కెంపే గౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికులు బయటికి వచ్చే గేట్ ముందు స్పృహదప్పి…కాళ్ళు చేతులు కొట్టుకుంటూ…విలవిలలాడుతుంటే…దయగలవారెవరో మొహమ్మీద నీళ్ళు చల్లి…ఒక ప్లేట్లో వేడి వేడి బిసిబేళీబాత్ తీసుకొచ్చి…తినిపించారు. తరువాత కూర్గ్ కాఫీ తాగించారు.

స్పృహలోకి వచ్చి…తేరుకుని లేచిన విలేఖరి…తన వృత్తికి రాజీనామా చేయడానికి బెంగళూరు ఎం. జి. రోడ్ కార్యాలయానికి కాలినడకన బయలుదేరాడు!)

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్