Saturday, November 23, 2024

రైతుకు పట్టం

Fair Translation: సాధారణంగా అనువాద ప్రకటనల్లో తెలుగు వివస్త్ర అయి సిగ్గుతో తలదించుకుని ఉంటుంది. గుడ్డి గూగుల్ అనువధ హింస ఇప్పుడు గోడదెబ్బకు తోడయిన చెంప దెబ్బ. ఈత చెట్టుకు గూగుల్ అనువాదం swimming tree. గూగులమ్మ యంత్రం మెదడు ప్రకారం ఈత స్విమ్మింగ్ అయినప్పుడు ఈత చెట్టు స్విమ్మింగ్ ట్రీ అయి తీరాలి. దాన్ని తప్పు పట్టడానికి వీల్లేదు. వేళ్లతో కదల్లేక స్విమ్మింగ్ కు వెళ్లలేని ఈతకు గూగుల్ ఈత నేర్పుతోందని మనం పెద్ద మనసు చేసుకుని అంగీకరించాలి. ఇంగ్లీషు, హిందీలో తయారై…తరువాత తెలుగులోకి అనువాదమవుతున్న ప్రకటనల్లో 90 శాతం గూగుల్ ద్వారానే అనువాదం అవుతున్నాయి. లేదా గూగుల్ స్థాయిలోనే గుడ్డిగా మనుషులయినా అనువాదం చేస్తూ ఉండాలి. 99 శాతం మంది ప్రకటనలను చదవరు, వినరు, పట్టించుకోరు కాబట్టి బతికి బట్ట కట్టుకోగలుగుతున్నారు. లేకపోతే వీధికొక ఎర్రగడ్డ ఉన్నా సరిపోయేది కాదు.

ప్రకటనల నిత్య అమావాస్యల్లో నిండు పున్నమిలా…జన్మకో శివరాత్రిలా ఎప్పుడో ఒక మెరుపులాంటి అందమయిన నుడికారపు తెలుగు అనువాదంతో ప్రకటన వస్తుంది. అది అలవాటు ప్రకారం మన కంటికి ఆనదు. అలాంటి ఒకానొక గొప్ప అనువాద ప్రకటన ఇది. నిజానికి ఇది కవిత్వానువాదం. మామూలు ప్రకటన కాదు. ఇందులో కూడా రెండు మూడు అక్షర దోషాలు, విరామ చిహ్నాలు అటు ఇటు అయినా…క్షమించి చదివితే అనువాదకుడు పదహారణాల తెలుగు కోసం ఎంతగా ప్రయత్నించాడో అర్థమవుతుంది.

రైతులకు అండగా నిలబడండి అన్న పిలుపునిస్తూ ఒక సంస్థ విడుదల చేసిన ఫుల్ పేజీ రంగుల ప్రకటన ఇది. బ్యాక్ గ్రౌండ్లో భుజాన పారతో పొలానికి వెళుతున్న రైతు గ్రాఫిక్ ఇమేజ్ ను ప్రతీకాత్మకంగా పెద్దది పెట్టారు. అతడి వక్షస్థలం మీద టెక్స్ట్ పెట్టారు.

Advertisement Farmers

ఆ టెక్స్ట్ ఇది:-

ప్రతి రోజూ సూర్యుడిని నిద్ర లేపి…
పక్షులకు, జంతువులకు, మనకు ఆహారం పెడుతున్నాడు.
ఎవరతను?

ఒక నదిలా తిరుగుతున్నాడు. దుంపలా భూమిలో ఉన్నాడు. చెట్టులా భూమి పైన ఉన్నాడు.
ఎవరతను?

మట్టిలో విత్తనంలా ఉన్నాడు. తేనీటిలో పంచదారలా కరిగిపోయాడు. బియ్యంలో, కొబ్బరిలో, పండులో అన్నిట్లో ఉన్నాడు.
ఎవరతను?

అతను సృష్టించేవాడు. పంచే వాడు. మనందరికీ తిండి పెట్టేవాడు.
మనందరినీ పాలించేవాడు. నాలో, నీలో ఉండేవాడు.

ఎవరతను?
అతను రైతు”

ప్రకటనను తెలుగులోకి అనువదించింది ఎవరో కానీ…వారికి శిరసు వంచి నమస్కరించాలి. ప్రకటనను తయారు చేసినవారిని, ఈ ప్రకటన ఇచ్చిన సంస్థను కూడా అభినందించాలి.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

అన్నంతో ఆరోగ్యం వయా కుక్కర్!

Also Read :

అమూల్ ప్రకటనల్లో భాషకు నీరాజనం

RELATED ARTICLES

Most Popular

న్యూస్