Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఆఫ్ఘన్ లో తేదీలే మార్పు; అదే కథ- అదే వ్యథ

ఆఫ్ఘన్ లో తేదీలే మార్పు; అదే కథ- అదే వ్యథ

The rise, fall and rise of Taliban – An Afghan Story

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నడివీధిలో పట్టపగలు దేశ మాజీ అధ్యక్షుడు నజీబుల్లాను ఉరితీసినప్పుడు- 1996 అక్టోబర్ లో- అంటే పాతికేళ్ల క్రితం రాసిన వ్యాసమిది. అప్పటికీ- ఇప్పటికీ- ఎప్పటికీ ఆఫ్ఘన్ ఎందుకు మారదో తెలుసుకోవాలనుకుంటే- ఓపిక చేసుకుని ఈ వ్యాసం ఆసాంతం చదవండి.

కత్తుల వంతెనపై కాబూల్
An Afghan Storyఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నడిబొడ్డున ఆ దేశ మాజీ అధ్యక్షుడు నజీబుల్లాను దీపపు స్తంభానికి ఉరితీస్తే అయ్యో పాపం అన్నవారు లేరు.

రష్యా అండదండలున్న రోజుల్లో తనకు, తన ప్రభుత్వానికి వ్యతిరేకమనుకున్నప్రతివాడిని నజీబుల్లా వేటాడి, వెంటాడి మట్టుబెట్టాడు. తన ఉనికి కోసం ఆయన చేసిన యుద్ధంలో శత్రువులకంటే అమాయక ఆఫ్ఘన్ ప్రజలే ఎక్కువగా చనిపోయారు.

రెండు శతాబ్దాల రాజరికం వైదొలగి 1973లో ప్రభుత్వం ఏర్పడగానే ఆఫ్ఘనిస్తాన్ ప్రజల ఆనందానికి అవధుల్లేవు. అప్పటి నుంచి పేరుకు ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి కానీ జరుగుతున్నది మాత్రం ఇష్టారాజ్యం. మొన్నటివరకు అధ్యక్ష, ప్రధానులుగా ఉండి ప్రస్తుతం పరారీలో ఉన్న రబ్బానీ, హిక్మత్యార్లు కూడా ప్రభుత్వ సైన్యానికి ప్రత్యామ్నాయంగా సొంత సాయుధ ముఠాలు నడుపుతున్నవారే.

రష్యా ప్రత్యక్ష ప్రమేయం ఉన్నరోజుల్లో హీరోలుగా వెలిగిన కమ్యూనిస్టులు తరువాత జీరోలయ్యారు. ముస్లిం తెగలమధ్య వైషమ్యాలను ఆసరాగా చేసుకుని పస్తూన్ తెగకు హిక్మత్యార్, తాజిక్ తెగకు అహమ్మద్ షా మసూద్, ఉజ్బెక్ తెగకు అబ్దుల్ రషీద్లు అగ్రనాయకులయ్యారు. ఇక వారు ఆడింది ఆట పాడింది పాట. అయితే అధికారం దగ్గర మాత్రం అందరూ ఒకటవుతారు. ఉనికి కోసం వైషమ్యాలను పెంచి పోషిస్తుంటారు. ఈలోపు 94లో పాకిస్తాన్ చలవతో పుట్టిన ముస్లిం విద్యార్థి తీవ్రవాద సంస్థ ‘తాలిబన్’ ఆఫ్ఘనిస్తాన్ చరిత్రనేతిరగరాసింది. శాశ్వతంగా చీకట్లోకి నెట్టింది.

ఆదినుండి అపశ్రుతులే
మాజీ అధ్యక్షుడి ఉరితీత, ఇస్లామిక్ ప్రభుత్వం ఏర్పాటుతో ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. కానీ 1973 నుంచి కూడా ఆఫ్ఘనిస్తాన్ పయనం ముళ్ళబాట మీదే సాగుతోంది. సామాన్యుల ప్రాణానికి రక్షణ లేదు. ఏప్రభుత్వం ఎవరి కుట్రవల్ల కూలిపోతుందో? ఏ దేశం సహాయంతో ఎవరు అధికారంలోకి వస్తారో? ఆఫ్ఘన్ ప్రజల ఊహ కందదు.

1933 నుంచి ’73 వరకు జాహిర్షి రాజరికం కొనసాగింది. ప్రజా పాలన ప్రారంభమైంది ’73 నుంచీ. ఆఫ్ఘనిస్తాన్ అస్థిరత్వం అంచున ఊగిసలాడుతున్నది కూడా అప్పటి నుంచే. ’78 ఏప్రిల్ తిరుగుబాటులో ఆఫ్ఘన్ రాజకీయాల్లో రష్యా వేలు పెట్టింది. అప్పుడే దేశానికి దుర్దశ దాపురించింది. ఆ సమయంలో రష్యా పరోక్ష మద్దతుతో అమీన్ అధ్యక్షుడయ్యాడు. ’79 డిసెంబర్ 27న అమీన్ హత్యకు గురయ్యాడు. అంతవరకు తెరచాటున ఉన్నరష్యా ఆఫ్ఘన్లో పూర్తిగా ప్రవేశించింది. బబ్రక్ కర్మల్ రష్యా దయ వల్లే అధ్యక్షుడయ్యాడు.

రష్యా రాజకీయం – అమెరికా ఆరాటం
ప్రభుత్వం, చట్టాల కంటే ఆఫ్ఘనిస్తాన్లో మతానికే ప్రాధాన్యం. మీ దేశంలో రష్యా చేయి పెట్టి కమ్యూనిస్టు కోటను విస్తరించుకుంటోంది… మీరు గాజులు తొడుక్కుని కూర్చున్నారా? లెండి సాయుధ పోరాటం చేయండి…అంటూ ఆఫ్ఘనిస్తాన్ పౌరులను గెరిల్లాలుగా మార్చడంలో అమెరికా శక్తివంచన లేకుండా కృషి చేసింది. ఆఫ్ఘనిస్తాన్ కు అండగా ఉండి సానుభూతి తెల్పడంలో రష్యాను వ్యతిరేకించడం తప్ప అమెరికాకు మరో ఉద్దేశం లేదు. మొదట్లో రష్యా మీద కోపం కొద్దీ మొసలికన్నీరు కార్చినా – ప్రచ్ఛన్న యుద్ధానంతరం ఆ ఉద్దేశం మారిపోయింది. పాకిస్తాన్తో అమెరికా కుదుర్చుకున్న చమురు ప్రాజెక్టు దారి ఆఫ్ఘనిస్తాన్ దేశం గుండా పోతుంది. పైగా కంట్లో నలుసులా తయారైన ఇరాన్ పీచమణచడానికి ఆఫ్ఘనిస్తాన్ను పావుగా వాడుకోవచ్చు.

An Afghan Story

ఈ రెండు కారణాలకు మించి ఆఫ్ఘన్ పై అమెరికా ప్రేమకు మరో కారణం లేదు. అందుకే ఐక్యరాజ్యసమితి ఆదేశాలను పెడచెవిన పెట్టి నడిబజారున నజీబుల్లాను ఆటవికంగా ఉరితీసి అధికార దండాన్నిలాగేసుకున్నా అమెరికా పెదవి విప్పలేదు. ప్రజాస్వామ్య ప్రక్రియలను కొత్త ప్రభుత్వం గౌరవిస్తుందన్న ఆశ అమెరికాకు ఉందట. ఆఫ్ఘన్ కొత్త ప్రభుత్వంతో మైత్రికి పోలీసు పెద్దన్న అమెరికాకు ఎలాంటి అభ్యంతరం లేదట. ఎందుకుంటుంది…
అవసరం వారిది అయినప్పుడు?

కర్మల్ తరవాత ’86 నుంచి ’92 వరకు నజీబుల్లా అధ్యక్షుడిగా వెలగబెట్టాడు. ఈయన దయవల్ల పుట్టిన అంతర్యుద్ధంలో చనిపోయిన అమాయకులు వేలల్లో ఉంటారని ఓ కాకి లెక్క. 192 మే 21న అమెరికా-రష్యాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం రష్యా సేనలు వైదొలిగాయి. అమెరికా గెరిల్లా పోరు కనుమరుగైంది.

ఆఫ్ఘనిస్తాన్ జాతిని నడిపించడానికే తామున్నట్లు రష్యా, అమెరికా, పాకిస్తాన్లు కంకణం కట్టుకోవడంతో సొంత దేశంలోనే ఆఫ్ఘన్ ప్రజలు పరాయి వారయ్యారు. అధికార దాహంతో జరుగుతున్న పోరాటాలు, శాంతి ఒప్పందాలు చూసి భరించలేని జనం పొట్టచేత పట్టుకుని పొరుగు దేశాలకు వలసవెళ్ళారు.

విదేశీ సైనిక దళాల విరమణ తరవాత ముజహదీన్ ల పాలన అంతర్యుద్ధాలకే సరిపోయింది. రష్యా సేనలపై చేసిన యుద్ధాన్ని అక్కడి ప్రజలు ‘జీహాద్ (పవిత్ర యుద్ధం) గా’ అభివర్ణించుకుంటారు. పవిత్ర యుద్ధం ఫలితం దక్కింది కానీ…ఆచరణలో జరిగింది మాత్రం ఆటవిక రాజ్యం అవతరణ.. ముస్లిం తెగలైన పస్తున్, తాజెక్, ఉజ్బెక్ లకు ఒకరంటే ఒకరికి పడదు. ఒక్కో తెగకు ఒక్కో నాయకుడు. ఒక్కో ప్రాంతంలో ఆ నాయకుడిది తిరుగులేని సామ్రాజ్యం. ప్రభుత్వం కూడా సాయుధ ముఠాలకు దాసోహమనాల్సిందే.

An Afghan Story :

పాక్ పెంచి పోషించిన ‘తాలిబన్’
పవిత్ర యుద్ధం రోజుల్లో ముల్లా మహమ్మద్ ఒమర్ ఓ వీరుడు. పాకిస్తాన్ సంప్రదాయంలో నడిచే స్కూలుటీచర్ ఆయన. దేశం కోసం యుద్ధంలో పాల్గొని ఓ కన్ను, కాలు పోగొట్టుకుని ముజహదీన్ పాలనతో విరక్తిచెంది మళ్ళీ ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్ళాడు. ఇప్పుడాయన వయసు 42 ఏళ్ళు.

మిలటరీ జవాన్లు మహిళలను మానభంగం చేసిన ఉదంతంతో కుపితుడై మళ్ళీ పోరుబాటలోకి వచ్చాడు. ‘తాలిబన్’ అంటేవిద్యార్థి అని అర్థం. తాలిబన్ ఇలా పురుడు పోసుకుందో లేదో అలా ఆయుధాలు అందించి ఎప్పటికి ఏవిధ్వంసక సహాయాలు అవసరమో దగ్గరుండి చేస్తూ వచ్చింది పాకిస్తాన్.

An Afghan Story

’94లో పుట్టిన ‘తాలిబన్‘ సభ్యులు మొదట్లో వెయ్యిమంది ఉంటే ఇప్పుడు పాతికవేలు దాటారు. ఆఫ్ఘనిస్తాన్ అన్ని రాష్ట్రాల నుంచి వెయ్యిమంది మతపెద్దలను పిలిచి ఒమర్ సమావేశపరిస్తే నువ్వే మా అధినాయకుడు…నువ్వెలా చెప్తే అలా చేస్తాం అనిమద్దతు ఇచ్చారు. మతం తన చెప్పుచేతల్లోకి వచ్చేసరికి ఒమర్కు వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. కాబూల్ను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించి రెండుసార్లు విఫలమైనా, నెమ్మదిగా సాధ్యమైంది మూడో ప్రయత్నంలో.

అంతర్జాతీయంగా అమెరికా – పాకిస్తాన్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాయి. రోగి కోరింది వైద్యుడుచెప్పింది ఒకటే అయినట్లు అమెరికా కోరిందే పాక్ చేసింది. కీలకమైన గిల్గిత్, వాఖాన్ కారిడార్, కారకోరం ప్రస్తుతం అక్షరాలా పాక్ చేతుల్లో ఉన్నట్లే. తాను అనుకున్నది కాణీ ఖర్చులేకుండా పాకిస్తాన్ నెరవేర్చుకోగలిగింది. మహా అయితే ముజహదీన్లను పావులుగా వాడుకుంది. రేపటి బలిపశువులుగా మార్చింది. ఇదే ట్రిక్కును కాశ్మీర్ పై పాక్ ప్రయోగించదని గ్యారంటీ ఏమిటి? అని అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ కొత్త ఇస్లామిక్ రాజ్యంతో సత్సంబంధాల కోసం పాకిస్తాన్ ఏకంగా ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్నే పంపుతోంది. తను నాటిన మొక్క మహా వృక్షమై ఒక రాజ్యం మేర విస్తరించినపుడు సహజంగానే పాక్ ఆనందానికి నిఘంటువుల మాటలు చాలవు.

విభజించి పాలించు
ఒకప్పుడు బ్రిటీషువారి రాజనీతి- ‘విభజించి పాలించు’. ఇప్పుడీ నీతి హోల్ మొత్తంగా అమెరికాది. తెగల నాయకులైన హిక్మత్యార్, అహమ్మద్ షా మసూద్, అబ్దుల్ రషీద్, రబ్బాని, దోస్తమ్లు ఎవరికెవరూ తీసిపోరు. హిక్మత్యార్, రబ్బాని పరారీలో ఉన్నంత మాత్రాన అశక్తులు కారు. వారు చిటికె వేస్తే ప్రాణత్యాగానికి సిద్ధపడే వేల సాయుధ యువకులున్నారు. పంజశిర్ ప్రాంతాల్లో వీరివి దుర్భేద్యమైన కోటలు. దాదాపుతొమ్మిది రాష్ట్రాల్లో యుద్ధ వీరుడు దోస్తమ్ ఎంత చెబితే అంత.

‘తాలిబన్’ల మద్దతు సున్నీలకే ఉంటుంది. షియా సేనలు తాలిబన్ను రూపుమాపాలని కాపుకాచి ఉన్నాయి. ఇవన్నీ గమనించి అమెరికా చెప్పే పరిష్కారం- దేశాన్ని కాబూల్ ట్రైమువరేట్, దోస్తమ్ మిలీషియా, తాలిబన్ పేరిట మూడు స్వతంత్ర రాజ్యాలుగా ఏర్పాటు చేయాలి అని. అలా జరిగితే అమెరికా పెత్తనానికి తిరుగులేదు. చమురు దారికి డోకా ఉండదు. జాతుల మధ్య పోరాటాలను అంతంచేసి ప్రపంచాన్ని ఒకటి చేయాలని ఐక్యరాజ్యసమితి ఆదర్శాల్లో పెద్దక్షరాల్లో ఉంటుంది. ఐ.రా.స. అంతర్జాతీయ శాంతి, భద్రత, మానవహక్కుల సాక్షిగా ఆఫ్ఘనిస్తాన్లో ఉరికొయ్యపై కొత్త ప్రభుత్వం పుట్టింది. స్వార్థమే పరమార్థంగా తిలా పాపం తలా పిడికెడు పంచుకున్న కాబూల్ కోట కత్తుల వంతెనపై ఎన్నాళ్ళు నిలబడుతుందో?

An Afghan Story :

రాచరికం నుండి ఇప్పటిదాకా వరుస పరిణామాలు
ఆఫ్ఘనిస్తాన్లో రెండొందల ఏళ్ళ రాజరికానికి 1973లో తెరపడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దినమొకయుగంగా జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. సైన్యం పోరులో కొందరు, జాతులవైషమ్యాల్లో కొందరు వెరసి 80 వేలకు పైగా అమాయకులే చనిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలు వరుసగా-

1973:
రెండు శతాబ్దాల రాజరికం అంతమైంది. రాజు జాహిర్లైను పక్కకు తప్పించి మిలిటరీ అధికారాన్ని హస్తగతంచేసుకుంది.

1978:
అధ్యక్షుడు రావూర్ హతం. మార్ ముహమ్మద్ తూకి అధ్యక్షుడిగా ఎన్నిక కమ్యూనిస్ట్ విధానాలకువ్యతిరేకంగా సంప్రదాయ ఇస్లామిక్ సంస్థలు పోరాటం ప్రారంభించడం.

1979:
హజీవుల్లా అమీన్ ప్రధానిగా నియామకం. అధ్యక్షుడు తరాకీ హత్యానంతరం అమీన్ అధ్యక్షుడిగా ఎన్నిక. సోవియట్ రవాణా విమానాలు కాబూల్లో దిగడం ప్రధాన స్థావరాలను, రేడియోను స్వాధీనం చేసుకోవడం. బట్రక్ కర్మల్ అధ్య సోవియట్ మిలిటరీ సహాయం అడగడం.

1980:
ఆఫ్ఘన్లోని విదేశీ సైనిక దళాలన్నీ వెంటనే విరమించుకోవాలని ఐక్యరాజ్యసమితి ఆదేశం. అఫ్ఘాన్లోని పాకిస్తాన్ మీలిటెంట్లకు పాకిస్తాన్ నుంచే కాక అమెరికా, సౌదీ అరేబియా, ఈజిప్ట్, చైనా దేశాల నుంచి ఆయుధాలు అందడం ప్రారంభమైంది.

1989: ఫిబ్రవరి 15 కంతా వెనక్కు వెళ్ళాలంటూ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, రష్యా, అమెరికా ఒక ఒప్పందానికి వచ్చాయి. ఈ సమావేశం జెనీవాలో జరిగింది.

1989 ఫిబ్రవరి:
రష్యా దళాలు వెనక్కు వెళ్ళాయి. ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడిగా ప్రధానిగా అబ్దుర్రబ్ రసూల్ సయాఫ్ ప్రధానిగాఅయ్యారు.

1989 మార్చి:
కమ్యూనిస్టులందరినీ అరెస్టు చేసి కొత్త తిరుగుబాటు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ముజహదీన్లు పన్నినకుట్ర విఫలమైంది.

1989 ఏప్రిల్:
కాబూల్ ను హస్తగతం చేసుకోవడానికి శత్రు సైన్యాలు పోరాడుకున్నాయి. బర్వోనుద్దీన్ రబ్బాని అధ్యక్షుడయ్యాడు.

1993:
అహ్మద్ షా మసూద్, గుల్ లుద్దీన్ హికత్యార్, రబ్బానీ ముఠాల మధ్య జరిగిన భీకర పోరాటంలో 10 వేలమందికి పైగా ప్రజలు చనిపోయారు.

1994 ఆగస్టు:
దక్షిణ ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన మహమ్మద్ ఒమర్ అఖుంద్ తాలిబన్: (ఇస్లాం విద్యార్థి తీవ్రవాద సంస్థ) ఏర్పాటు చేశాడు. నెలల కాలంలో దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ‘తాలిబన్’ శాఖోపశాఖలుగావిస్తరించింది.

1995:
మార్చిలో ఒకసారి, అక్టోబర్లో ఒకసారి కాబూల్ ను వశం చేసుకోవడానికి తాలిబన్’ విఫలయత్నం చేసింది.

1996 ఏప్రిల్ 3:
ఒమరు అధినాయకుడిగా ఎన్నుకుంటూ వెయ్యి మంది సంప్రదాయ ప్రముఖులు తీర్మానించారు. ఘోర్రాష్ట్రం రాజధాని నగవరణ్ తమనుంచీ పోయి ‘తాలిబన్ వశమైందని ప్రభుత్వం అధికారికంగాప్రకటించింది.

1996 జూన్ 26:
తాలిబన్ కాబూల్ పై రాకెట్ ప్రయోగించింది. 54 మంది చనిపోయారు. అంతవరకు బద్ధవైరంతో ఉన్నహిక్ముత్యారో
రబ్బానీతో ఒప్పందం కుదుర్చుకుని ప్రధాని అయ్యాడు.

1996 సెప్టెంబర్ 11:
తూర్పు ప్రాంతంలోని జలాలాబాద్, పాకిస్తాన్ సరిహద్దులోని నాంగారార్లను లాలిబన్ స్వాధీనం చేసుకుంది.

1996 సెప్టెంబర్ 22:
తూర్పు ప్రాంతంలోని కునార్ రాష్ట్రం పూర్తిగా తాలిబన్ వశమైంది. ప్రభుత్వానికి మద్దతు తెలిపే ఈ రాష్ట్రంపైతాలిబన్ పట్టు సాధించడం విశేషం.

1996 సెప్టెంబర్ 25:
సరోబి, తూర్పు కాబూలు తాలిబన్ చేతిలోకి వచ్చాయి.

1996 సెప్టెంబర్ 27:
కాబూల్ ను తాలిబన్ పూర్తిగా వశపరచుకుంది. మాజీ అధ్యక్షుడు నజీబుల్లాను నడివీధిన ఉరితీసి, ఆఫ్ఘన్ నుఇస్లాం రాజ్యంగా ప్రకటిస్తూ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

2001 సెప్టెంబర్:
అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్లను విమానాలతో కూల్చివేసిన అల్ ఖైదా తీవ్రవాదులు. ఈ విధ్వంసానికి పథకరచన, శిక్షణ అఫ్ఘాన్లోనే జరిగినట్లు నిర్ధారణ.

2001 డిసెంబర్:
అమెరికా సైనిక దళాలు అఫ్ఘాన్లోకి ప్రవేశం. తీవ్రవాద స్థావరాలపై దాడులు మొదలు.

2002 ఏప్రిల్:
ఆఫ్ఘన్ పై అమెరికా అధ్యక్షుడు బుష్ మార్షల్ ప్లాన్

2009:
బుష్ దారినే అనుసరించిన ఒబామా ఆఫ్ఘన్ విధానం.

2009:
ఆఫ్ఘన్ పై పట్టు కోసం పాకిస్థాన్ సాయం కోరిన ఒబామా.

2011:
ఆఫ్ఘన్ భూభాగం నుండి అమెరికా సైనిక దళం సీల్స్ అర్ధరాత్రి ఆపరేషన్ మొదలు పెట్టి పాకిస్తాన్ అబోతాబాద్ లో దాక్కున్న అల్ ఖైదా సుప్రీం ఒసామా బిన్ లాడెన్ ను హతమార్చింది.

2014:
అఫ్ఘాన్లో నెమ్మదిగా అమెరికా సైనిక దళాల సంఖ్య కుదింపు.

2020:
అఫ్ఘాన్లో అమెరికా సైనిక దళాలను నామమాత్రం చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన.

2021:
ఆఫ్ఘన్ తో ఇక తమకు సంబంధమే లేదన్నట్లు మొత్తం అమెరికా సైన్యాన్ని వెనక్కు పిలిపించిన కొత్త అధ్యక్షుడు బైడెన్.

2021 ఆగస్టు:
ఇదే అదనుగా కాచుకు కూర్చున్న తాలిబాన్లు ఒక్క నెలలో దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఆఫ్ఘన్ అధ్యక్షుడు పరార్. ప్రభుత్వం గాయబ్.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read: ఆఫ్ఘన్ పాపంలో ఎవరి వాటా ఎంత?

Also Read: విమానాల మానం తీసిన తాలిబన్లు

RELATED ARTICLES

Most Popular

న్యూస్