Sunday, September 8, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంనీ మెడ సాక్షిగా!

నీ మెడ సాక్షిగా!

Surprise Gift :

మెడకాయ మీద తలకాయ ఉన్నవారెవరయినా ఇలా చేస్తారా?
నువ్ తొడ కోసుకుంటే…నేను మెడ కోసుకుంటా!
మెడ పట్టి గెంటేయడం…
మెడలు వంచడం…
మెడలో తాళి…
ఆశ లావు…పీక సన్నం…
తల నరకడం…
మెడకు ఉరి బిగించడం…
గొంతు పిసికి చంపడం…
దాక్కో దాక్కో మేక…పులొచ్చి కొరుకుద్ది పీక!

ఇలా మెడ/పీక చుట్టూ లెక్కలేనన్ని సామెతలు, వాడుక మాటలు, సినిమా పాటలు. దాశరథి చెప్పినట్లు- “ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో?” నాలుగు కాళ్లతో అడ్డంగా నడిచే శరీరాలు…రెండు కాళ్ల మీద నిటారుగా నిలుచోవడానికి కొన్ని లక్షల ఏళ్లు పట్టింది. మనిషి శరీర నిర్మాణం ఒక అద్భుతం. కొన్ని కోట్ల కోట్ల కణాల సమూహం నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటే మనం బతికి బట్టగట్టగలుగుతున్నాం. ఊపిరి దానికదిగా తిరుగుతూ ఉంటుంది. గుండె దానికదిగా కొట్టుకుంటూ ఉంటుంది. రక్తం దానికదిగా ప్రవహిస్తూ ఉంటుంది. కనురెప్ప దానికదిగా పడుతూ ఉంటుంది. శరీరం మనదే అయినా…అందులో ఏదీ మన నియంత్రణలో ఉండదు. ఇంతకంటే లోతుగా వెళితే ఇది శరీర నిర్మాణ- అనాటమీ పాఠమై మనకే అసహ్యం పుడుతుంది కాబట్టి ఇక్కడికి వదిలేద్దాం.

తాళి మెడకే కట్టడంలో చాలా ఔచిత్యం ఉంది. పాశం అంటే తాడు. తాడుతో కట్టేస్తాం కాబట్టి పశువులు అయ్యాయి. మనుషులను తాళ్లతో కట్టేయకపోయినా…కనిపించని కర్మ పాశాలు ప్రతి అవయవానికి గట్టిగా చుట్టుకునే ఉంటాయి. ఆ గొడవ ఇక్కడ అనవసరం.

శరీరంలో మెడ అత్యంత కీలకమయిన స్థానం. చాలా ప్రధానమయిన మెదడు, కళ్లు, చెవులు, ముక్కు, నోరు ఉన్న తల నిలబడాల్సింది మెడ మీదే. కాబట్టే గౌరవ సూచకంగా వేసే హారం మెడలోనే వేస్తున్నాం. జీవితభాగస్వామికి తాళిని కూడా మెడలోనే కడుతున్నాం.

అనకాపల్లి దగ్గర ఒకమ్మాయికి- అబ్బాయికి పెళ్లి నిశ్చయమయ్యింది.
“సిగ్గు తెరలలో కనులు దించుకొనీ తలను వంచుకొనీ
బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడ…రంగులీను …
నన్ను వదిలి నీవు పొలేవులే – అది నిజములే పూవు లేక తావి నిలువలేదులే – లేదులే…”
అని అబ్బాయి తన్మయత్వంలో పాట పాడాడు.

అవును…”నన్ను వదిలి నీవు పోలేవులే…ఇది నిజములే…”
అని అమ్మాయి అబ్బాయికి “సర్  ప్రైజ్ ” గిఫ్ట్ ఇచ్చింది. ప్రేమగా, హస్కీ వాయిస్ తో అచ్చికబుచ్చికములాడుకోవడానికని అబ్బాయిని ఆహ్వానించింది. ప్రేమ పొంగులువారుతుండగా అబ్బాయి మనో వేగంతో అమ్మాయి చెప్పినచోటుకు వెళ్లాడు. కళ్లు మూసుకో…నీకో “సర్ ప్రైజ్ ” అంటే అబ్బాయి కళ్లు మూసుకున్నాయి. తియ్యటి ముద్దు పెడుతుందని అబ్బాయి అనుకున్నాడు. మెడ మీద కత్తి గాటు ఘాటుగా పడింది. పసుపు బట్టల్లో ఉండాల్సిన జంట ఎరుపు బట్టల్లోకి దిగింది. పెళ్లి మంటపంలో ఉండాల్సిన జంటలో అబ్బాయి ఆసుపత్రిలో…అమ్మాయి జైల్లో ఉన్నారు. ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక అబ్బాయి గొంతు కోశానని అమ్మాయి గొంతు సవరించుకుని పోలీసు స్టేషన్లో సెలవిచ్చింది. విన్నవారి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. సారీ…సర్ ప్రైజ్ కత్తి దిగింది.

అమ్మాయి ప్రేమగా పిలిచినా…సర్ ప్రయిజ్ అన్నా మెడలను కాపాడుకోండి! అంటూ సోషల్ మీడియా రకరకాల జాగ్రత్తలు చెబుతోంది. ప్రేమ గుడ్డిది. ప్రేమకు మెడ మీద తలకాయ ఉండదు. మనిషికి మెడ చాలా కీలకం. మెడ తాళి సంగతి దేవుడెరుగు…ముందు బతకడానికి మెడలను కాపాడుకోండి! లేకపోతే…కళ్లు శాశ్వతంగా మూతలు పడే ఒక “సర్ ప్రయిజ్” ప్రేమ కత్తి మీ మెడ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది!

కా.భా.(కాబోయే భార్య) వస్తోంది…
దాక్కో! దాక్కో! పీక!!

-పమిడికాల్వ మధుసూదన్

ఇవి కూడా చదవండి: 

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది

RELATED ARTICLES

Most Popular

న్యూస్