Thursday, March 28, 2024
HomeTrending Newsఎట్టికైనా, మ‌ట్టికైనా మ‌నోడే ఉండాలి : మంత్రి కేటీఆర్

ఎట్టికైనా, మ‌ట్టికైనా మ‌నోడే ఉండాలి : మంత్రి కేటీఆర్

 Modern Library : తెలంగాణ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌పై రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఆ రెండు పార్టీల నాయ‌కులు ప‌చ్చి మోస‌గాళ్లు.. వారిని న‌మ్మొద్ద‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు. ఎట్టికైనా, మ‌ట్టికైనా మ‌నోడే ఉండాలి. మ‌న పార్టీనే ఉండాలి. ఏనాటికైనా తెలంగాణ కోసం కేసీఆర్ క‌డుపులో ఉండే బాధ‌, కాంగ్రెస్, బీజేపీ నాయ‌కుల‌కు ఉండ‌దు. వారికి 29 రాష్ట్రాల్లో తెలంగాణ ఒక‌టి. మ‌న‌కు ఉన్న‌ది ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ‌. ఏనాటికైనా మ‌న ఇంటి పార్టీనే శ్రీరామ‌ర‌క్ష అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. నర్సంపేటలో ఇంటింటికీ గ్యాస్‌ సరఫరా కోసం ఏర్పాటు చేసిన‌ పీఎన్‌జీ గ్యాస్‌ లైన్‌ను ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డితో క‌లిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.  ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కేటీఆర్ ప్ర‌సంగించారు. తెలంగాణ‌లో 119 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. కానీ ఈరోజు పెద్దిసుద‌ర్శ‌న్ రెడ్డి నేతృత్వంలో న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గంలో కొత్త చ‌రిత్ర‌ను సృష్టించారు. రాష్ట్రంలోని ఎక్క‌డా లేని విధంగా మ‌హిళ‌ల కోసం ఇంటింటికీ గ్యాస్ అందించిన ఘ‌న‌త పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డికే ద‌క్కుతుంద‌న్నారు. న‌ర్సంపేట‌లో పీఎన్‌జీ గ్యాస్ లైన్ కింద 12,600 గ్యాస్ క‌నెక్ష‌న్లు ఇచ్చామ‌ని కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర‌మంత‌టా త‌క్కువ ధ‌ర‌కే గ్యాస్ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

న‌ర్సంపేట అభివృద్ధికి రూ. 50 కోట్లు..
వ్య‌వ‌సాయ ఆధార ప‌రిశ్ర‌మ‌ల‌ను న‌ర్సంపేట‌లో నెల‌కొల్పుతామ‌ని కేటీఆర్ ప్ర‌క‌టించారు. ఆహార శుద్ధి ప‌రిశ్ర‌మ‌ల‌ను తీసుకొచ్చే బాధ్య‌త ఈ ప్ర‌భుత్వానిది అని తెలిపారు. న‌ర్సంపేట అభివృద్ధికి రూ. 50 కోట్లు మంజూరు చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. చెరువు, రింగ్ రోడ్డు నిర్మాణానికి ఈ నిధులు ఖ‌ర్చు చేస్తామ‌న్నారు. ఏ ఎల‌క్ష‌న్లు లేన‌ప్ప‌టికీ ఎప్ప‌టిక‌ప్పుడు అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు అందిస్తున్నామ‌ని చెప్పారు. న‌ర్సంపేట‌ను ఒక ఉద్య‌మ కేంద్రంగా మార్చి.. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క‌పాత్ర పోషించారు. సాధించుకున్న తెలంగాణ‌ను అభివృద్ధి చేసుకుంటున్నామ‌ని మంత్రి తెలిపారు. భార‌త‌దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఇంటింటికీ న‌ల్లాల ద్వారా మంచినీరు అందిస్తున్నాం. కేసీఆర్ ప్ర‌భుత్వంలో న‌ర్సంపేట‌కు రెండు ఇరిగేష‌న్ ప్రాజెక్టులు మంజూరు చేసి నీళ్లు ఇచ్చామ‌న్నారు. దేవాదుల‌, కాళేశ్వ‌రం లిప్ట్ ఇరిగేష‌న్ ద్వారా ఎస్సార్ ఎస్పీ కింద ఉన్న భూముల‌కు నీళ్లు పారుతున్నాయ‌ని కేటీఆర్ తెలిపారు.

పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డిపై ప్ర‌శంస‌లు..
గ‌తంలో నర్సంపేట నియోజ‌క‌వ‌ర్గంలో ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాలు ఉండేవని కేటీఆర్ గుర్తు చేశారు. అడ్డ‌గోలు రాజ‌కీయాల‌తో అభివృద్ధిని ప‌ట్టించుకోలేదు. ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి చొర‌వ‌తో ఆస్ప‌త్రులు, డ‌యాల‌సిస్ సెంట‌ర్లు, సెంట‌ర్ డివైడ‌ర్లు, లైటింగ్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసుకున్నాం. మొద‌టిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సుద‌ర్శ‌న్ రెడ్డి న‌ర్సంపేట అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నార‌ని ప్ర‌శంసించారు. 2014లోనే సుద‌ర్శ‌న్ రెడ్డి గెలిచి ఉంటే.. న‌ర్సంపేట మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల కంటే అభివృద్ధిలో ముందు ఉండేద‌న్నారు. న‌ర్సంపేట ప్రాంత అభివృద్ధి కోసం నిరంత‌రం కృషి చేస్తున్నారు. ఇలాంటి నాయ‌కుల‌ను క‌డుపులో పెట్టుకుని చూసుకోవాలని కేటీఆర్ ప్ర‌జ‌ల‌కు సూచించారు.

అంతకుముందు వరంగల్ నగరంలో 1.5 కోట్లతో ఆధునీకరించిన ప్రాంతీయ గ్రంధాలయాన్ని మంత్రులు కేటీఆర్,దయాకర్ రావు ప్రారంభించారు. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో 150 KLD సామర్థ్యంతో నిర్మించే మానవ వ్యర్ధాల నిర్వహణ ప్లాంట్, జీడబ్ల్యూఎంసీ పరిపాలన భవనం, దివ్యాంగుల శిక్షణ కేంద్రం, స్పోర్ట్స్ కాంప్లెక్స్, కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇతర అభివృద్ధి పనులకు మంత్రులు కేటీఆర్, శ్రీమతి సత్యవతి రాథోడ్, దయాకర్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మేయర్ శ్రీమతి గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు
Also Read :
RELATED ARTICLES

Most Popular

న్యూస్