Tuesday, June 30, 2026
HomeTrending Newsఈ-కామర్స్‌పై జాతీయ విధానాన్ని తేవాలి : కేటీఆర్‌

ఈ-కామర్స్‌పై జాతీయ విధానాన్ని తేవాలి : కేటీఆర్‌

National Policy On E Commerce :

ఈ-కామర్స్‌పై కేంద్ర ప్రభుత్వం సత్వరమే జాతీయ విధానాన్ని తీసుకురావాలని తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌ స్టాండింగ్ కమిటీ ఆన్ కామర్స్ సమావేశం ఈ రోజు హైదరాబాద్‌ నగరంలోని శాసనసభ కమిటీ హాలులో జరిగింది. కమిటీ చైర్మన్‌ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలువురు సీనియర్‌ ఎంపీలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల ప్రతినిధులు, బ్యాంకింగ్, ఈ-కామర్స్ సంస్థలకు చెందిన సీనియర్ ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌తో పాటు ఇతర శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సాంకేతిక, సాఫ్ట్‌వేర్‌ రంగంలోని విప్లవాత్మక మార్పులను భారతదేశం అందిపుచ్చుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి అవసరమైన విధానపరమైన నిర్ణయాలతో పాటు మౌలిక వసతుల కల్పనపై వేగంగా చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌ అన్నారు. ఈ-కామర్స్‌పై జాతీయపరమైన పాలసీని సత్వరమే తీసుకురావాలన్న కేటీఆర్‌.. ఇందులో ఈ-కామర్స్‌కు అనుబంధంగా ఉన్న ఆన్‌లైన్‌ మోసాలు, సైబర్‌ సెక్యూరిటీ, మొబైల్‌ పేమెంట్స్‌, అత్యుత్తమ ఇంటర్‌నెట్‌ సౌకర్యం అందుబాటులో ఉండడం వంటి సంబంధిత రంగాలపై విప్లవాత్మకమైన నిర్ణయాలను కేంద్రం ప్రకటించాలన్నారు.

ఈ-కామర్స్‌, సాంకేతిక రంగాల్లో మార్పులను ఉపయోగించుకోవాలి
సిటిజన్ సర్వీస్ డెలివరీకి సంబంధించి కేంద్రం మరింత చురుగ్గా కదలాలని సూచించారు. ఈ-కామర్స్, సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులను ఉపయోగించుకొని పెద్ద ఎత్తున ఉద్యోగాలను కల్పించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో వస్తున్న మార్పులని మనం ఆపడం మానేసి, దాన్ని అందిపుచ్చుకొని ప్రపంచాన్ని లీడ్ చేసే విధంగా భారతదేశాన్ని తయారు చేయాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అయినా అందిపుచ్చుకోవడంలో భారత దేశ ప్రజలు ముందు వరుసలో ఉంటారన్నారు. ఇందుకు ఈ కామర్స్ మినహాయింపు కాదని స్పష్టం చేశారు.

పెద్ద ఎత్తున ఈ-కామర్స్ కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ లిటరసీపైన దృష్టి సారించాలన్నారు. భారత దేశంలోని వివిధ భాషల్లో డిజిటల్ లిటరసీని పెంచే ప్రయత్నం చేయాలని, భారత ప్రభుత్వం చేపట్టిన భారత్ నెట్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికీ ఇంటర్నెట్ వంటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి వాటికి అవసరమైన ఆర్థికపరమైన సహకారాన్ని అందించాలని కోరారు. ఇంటర్నెట్ ద్వారా లాస్ట్ మైల్ కనెక్టివిటీని అందించినప్పుడు అత్యంత మారుమూల ప్రాంతాల్లోని పౌరులకు కూడా ప్రపంచ స్థాయి పరిజ్ఞానం, సేవలు అందే అవకాశం ఉందన్నారు.

రాజకీయాలకతీతంగా నిర్ణయాలుంటేనే దేశాభివృద్ధి
ఏడున్నర సంవత్సరాలలోనే దేశంలో అత్యంత విజయవంతమైన రాష్ట్రంగా నిలిచిన తెలంగాణకు కేంద్రం ప్రోత్సాహం ఇవ్వడంలో చొరవ చూపడం లేదన్నారు. నిర్ణయాలు రాజకీయాలకు అతీతంగా ఉన్నప్పుడే భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వాసం ఉన్నదన్నారు. తెలంగాణ అభివృద్ధి అంటే భారతదేశ అభివృద్ధి అనే విషయాన్ని కేంద్రం గుర్తించాలని, ఏడున్నర సంవత్సరాలుగా తలసరి ఆదాయంతో పాటు జీఎస్‌డీపీ వంటి అంశాల్లో రెట్టింపు వృద్ధిని నమోదు చేసిందని గుర్తు చేశారు.
తెలంగాణ నుంచి వచ్చే సంపద దేశంలోని ఇతర వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి వినియోగం జరుగుతుందన్న అంశం తమకు గర్వకారణంగా ఉందని, అయితే తెలంగాణ అభివృద్ధికి కేంద్రం మరింత సహకారం అందించాలన్నారు. మేకిన్ ఇండియా నినాదం నిజరూపం దాల్చాలంటే కేంద్ర ప్రభుత్వం మరిన్ని పారిశ్రామిక ప్రోత్సాహకాలతో పాటు విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడే సాధ్యమవుతుందన్నారు. దేశంలోని సూక్ష్మ, మధ్యతరహా పారిశ్రామిక రంగానికి ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి పెద్ద ఎత్తున ఆర్థిక ప్రోత్సాహకాలు కల్పించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

Also Read : త్రిలోక సీతారాం రచనలు – వెలుగు రేఖలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular