Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Tamil Tyagi: ఆయన పేరు త్రిలోక సీతారాం. మాతృభాష తెలుగు. కానీ పరిస్థితుల ప్రభావంతో ఆయన అనేక రచనలు చేసి తమిళ సాహితీవనంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్నారు.

ఇటీవల ఎస్. రామకృష్ణన్ అనే తమిళ రచయిత త్రిలోక సీతారాం గురించి చెప్తూ ఆయన మాతృభాష తెలుగు అని చెప్పడంతో సీతారాం విషయాలు ఒకటి రెండు పంచుకోవాలనిపించింది.

త్రిలోక సీతారాం తమిళనాడులోని పెరంబలూరుకి సమీపంలో ఉన్న తొండైమాందురై అనే ఊళ్ళో తిరువయ్యారు లోకనాథ అయ్యరు, మీనాక్షి సుందరమ్మాళ్ దంపతులకు 1917 ఏప్రిల్ ఒకటో తేదీన జన్మించారు. 1973 ఆగస్టులో తుదిశ్వాస విడిచారు. ఆయన తమిళ కవిగా, చిన్న కథల రచయితగా, అనువాదకుడిగా, పత్రికా రచయితగా పేరుగడించారు. ఆయన తల్లిదండ్రులు ఇంట్లో తెలుగులోనే మాట్లాడుకునేవారు.

మూడవ ఏట తండ్రిని పోగొట్టుకున్న సీతారాం మేనమామ ఇంట పెరిగారు. ఆయనకు లలిత అనే సోదరి, మరొక సోదరుడు ఉన్నారు.

ఆయనకు 1936లో 19వ ఏట పదేళ్ళ రాజమణితో వివాహమైంది. వీరికి మధురం, వసంత, ఇందిర అనే ముగ్గురు కుమార్తెలు, పశుపతి, సుబ్రమణియన్, మురళీధరన్, రామకృష్ణన్ అనే నలుగురు కుమారులు.

చిన్నతనంలోనే కవిత్వం పట్ల ఆసక్తి చూపిన సీతారాం 18వ ఏట ఇందియ వాలిబన్ (ఇండియన్ యూత్) అనే తమిళ పత్రికను ప్రారంభించారు.

తరువాత, విల్లుపురం సమీపంలోని పరిక్కల్ అనే చిన్న పట్టణంలో రామా సదాగోపాల్ నడుపుతున్న ‘త్యాగి” అనే పత్రికకు కొన్ని నెలలు సహాయ సంపాదకుడిగా పనిచేశారు.

“మందహాసన్” అనే కలంపేరుతో రాయడం ప్రారంభించి కొన్నాళ్ల తర్వాత త్రిలోకం సీతారాం పేరుతో రచనలు కొనసాగించారు.

‘సాహిత్య పడవ’ వ్యాస సంపుటి, ‘శివాజీ’ పత్రికా సంపుటం, ‘సిద్ధార్థన్’ అనువాదం తమిళం ఉన్నంత కాలం త్రిలోక సీతారాం అనే పేరు ఉంటుంది.

తిరువయ్యారు లోకనాథ సీతారాం అలియాస్ త్రిలోక సీతారాం తమిళ జాతీయ కవి సుబ్రమణ్య భారతియార్‌ని ప్రత్యక్షంగా చూడకపోయినప్పటికీ ఆయన రచనలంటే ప్రాణం. భారతియార్ కవిత్వం గురించి చెప్తుండేవారు. ఎక్కడికి వెళ్లినా భారతియార్ పాటలకు బాణీలు కట్టి పాడుతుండేవారు. దాదాపుగా ఆయన పాటలన్నీ సీతారాంకు కంఠస్థమే. భారతియార్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్న సీతారాంకు భారతియార్ శిష్యుడైన భారతిదాసన్ అంటేనూ మహా ఇష్టం. వీరి మధ్య మంచి స్నేహముండేది.

అలాగే తమిళనాడు రాజకీయనాయకులలో ఒకరైన కామరాజర్ కు త్రిలోక సీతారాం అంటే అభిమానం. 1961 జూలై 29వ తేదీన తిరుచ్చి టౌన్ హాలులో శివాజీ వారపత్రిక రజతోత్సవ సంచికను ఆవిష్కరించిన సభలో కామరాజర్ మాట్లాడుతూ త్రిలోక సీతారాం కవితలమీదా, శివాజీ పత్రికమీదున్న అభిమానంతో ఆయనను తమిళనాడు ప్రభుత్వ ఆస్థాన కవిగా నియమిస్తానని కొందరితో చెప్పారుకూడా. కానీ కొన్ని రాజకీయ కారణాలవల్ల అది నెరవేరలేదు.

ఓమారు డిఎంకె పార్టీ వ్యవస్థాపకుడు అన్నాదురై త్రిలోక సీతారాం గురించి మాట్లాడుతూ అగ్రహారంలో పుట్టిన అపూర్వ మనిషి సీతారాం అని ఆభివర్ణించారు. అలాగే తన పత్రిక ద్రావిడనాడు పత్రిక భారతిదాసన్ కోసం వెలువరించిన ప్రత్యేక సంచికకు ఓ గేయం రాసివ్వమని సీతారాంను కోరారు అన్నాదురై. అందుకు పారితోషికమూ ఇచ్చారు.

పారిశ్రామికవేత్త జి.డి. నాయుడుతోనూ ఆయనకు సత్సంబంధాలుండేవి. ఆయనను కోయంబత్తూరుకు పిలిపించి అనేకసార్లు సభలలో మాట్లాడించారు జి.డి. నాయుడు.

పద్దెనిమిదో ఏట కలం పట్టిన ఆయన కడదాకా రచనలు చేస్తూ 1973 ఆగస్టు 23న మరణించారు.

ఆయనకు నివాళులర్పిస్తూ ప్రముఖ రచయిత జయకాంతన్ “త్రిలోక సీతారాం ఇక్కడ సంచరించే సిద్ధపురుషులలో ఒకరు.
ఆయన మన రచనలు మనకో భాగ్యం. ఆయన ఎటూ పోలేదు. అస్తమించి మళ్ళీ ఉదయించే సూర్యుడిలాంటివారే సీతారాం.
ఆయన రచనలు భవిష్యత్ తరాలవారికీ ఓ వెలుగురేఖలే” అని గుర్తు చేశారు.

– యామిజాల జగదీశ్

Also Read : భాషా ప్రేమికుల స్ఫూర్తి ప్రదాత

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com