Thursday, April 25, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకందేవుడికన్నా దెబ్బే గురువు

దేవుడికన్నా దెబ్బే గురువు

Slap-Politics: దేవుడికన్నా దెబ్బే గురువు. ప్రతి సామెత వెనుక ఒక తిరుగులేని సత్యం ఉంటుంది. ఆ సత్యానికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర పునరావృతమవుతూనే ఉంటుంది. కాలదోషం పడితే అది సామెత కానే కాదు.

మధ్యప్రదేశ్ రేవా పార్లమెంటు బి జె పి సభ్యుడు జనార్దన్ మిశ్రా దేవుడికన్నా దెబ్బే ఎందుకు గొప్ప గురువో అనుభవపూర్వకంగా చెప్పారు. అందరూ తనను అనుసరించాలని చెబుతూనే ఉన్నారు. ఆయన స్పష్టంగా, బహిరంగంగా చెబుతున్న ప్రకారం… ఆయన వయసులో ఉండగా జిల్లా కలెక్టర్ల చెంపలు చెళ్లుమనిపించేవారట. ఒకసారి కలెక్టర్ ను కొడితే రెండేళ్లపాటు నాయకుడిగా ఒక వెలుగు వెలిగేవారట. తన రాజకీయ నాయకత్వ ప్రభ తగ్గిందనిపించగానే మళ్లీ కలెక్టర్ చెంపలు వాయించేవారట.

ఆయన ఇలా ఎంతకాలం కలెక్టర్ల చెంపలు వాయించారు? ప్రఖ్యాత నీతి కథలోలా- దూడకు పాలిచ్చి వస్తానని…మాట ప్రకారం మళ్లీ వచ్చి…తనకు తానుగా పులినోటికి దొరికిన తల్లి ఆవులా...ఎంత మంది జిల్లా కలెక్టర్లు, ఎన్ని చెంపలు ఆయన వాయించడానికి అనుకూలంగా పెట్టి…తరించారు? ఒక జిల్లాకు సర్వంసహా చక్రవర్తికి తక్కువకాని జిల్లా కలెక్టర్లు ఇలా ద్వైవార్షిక చెంపల వాయింపు కార్యక్రమానికి స్వచ్చందంగా వెళ్లేవారా? రెండేళ్లకొకసారి జనార్ధన మిశ్రుడి చేతిలో చెంప దెబ్బలు తిన్న కలెక్టర్ల పేర్లేమిటి? వారిలో ఒక్కరయినా ఈ జననేత మీద కేసులెందుకు పెట్టలేదు? ఒక బాధ్యతగల ప్రజా ప్రతినిధి ఇన్నేళ్ల తరువాత తను చేసిన నేరాన్ని గర్వంగా అంగీకరిస్తున్నప్పుడు…పోలీసులు ఇప్పటికయినా తమకు తాముగా(సూమోటో) కేసు ఎందుకు పెట్టడం లేదు?

రేప్పొద్దున మరో వృద్ధ జంబూక నేత…వయసులో ఉండగా తను చేసిన మానభంగ అత్యాచారాలను, ప్రాణభంగ హత్యాచారాలను, కిడ్నాపులను, దారి దోపిడీలను, దేశ దోపిడీలను కూడా ఇలాగే ఒళ్లు పులకించేలా ఒప్పుకుంటే…ఇలాగే విని, చదివి వదిలేద్దామా?

ఇప్పుడొకసారి అయిదు వందల ఏళ్లు వెనక్కు వెళదాం.
విజయనగర సామ్రాజ్యానికి శ్రీకృష్ణదేవరాయలు మరో పావు గంటలో చక్రవర్తిగా సింహాసనం అధిష్ఠించబోతున్నాడు. బంగారు కళశాల్లో నదీ జలాలు సిద్ధంగా ఉన్నాయి. వెండి పళ్లాల్లో పూలు, అక్షింతలు సిద్ధం. మంగళ వాద్యాలు మోగుతున్నాయి. ఊరు ఊరంతా మామిడి తోరణాలు వెలిశాయి. ప్రతి గుమ్మానికి అరటి బోదెలు కట్టారు. వీధులన్నీ ముత్యాల ముగ్గులతో ముస్తాబయ్యాయి. పసుపు, గంధాలతో గాలికి ప్రకృతి కొత్త వాసనలను అద్దింది. ఇక సుముహూర్తే సావధాన…అని మంత్రం చెప్పడమే తరువాయి. కృష్ణరాయల నెత్తి మీద ముత్యాల సరాలతో తులతూగే మైసూరు పట్టు తలపాగా తీసేసి… వజ్ర వైఢూర్యాలతో పొదిగిన బంగారు కిరీటం పెట్టి, చక్రవర్తి కరవాలం చేతికిచ్చే సమయం వచ్చేసింది.

ఈ లోపు కృష్ణా! అని మహా మంత్రి తిమ్మరుసు పిలుపు వినపడడంతో…కృష్ణరాయలు ఆయనవైపు చూశాడు. అత్యవసరమయిన పని…ఒక్కసారి సింహాసనం వెనుక ఉన్న అభ్యంతరమందిరంలోకి వస్తావా? అని అడిగాడు. కొన్ని క్షణాల్లో పట్టాభిషేకం జరగబోతుండగా తిమ్మరుసు అత్యవసరమయిన పని అన్నాడంటే…ఏమి జరిగిందో? అనుకుంటూ వెంటనే యాంటీ రూములోకి వెళ్లాడు. తలుపు గడియ పెట్టి…కృష్ణా ఒకసారి తలపాగా తీసేయ్ అన్నాడు తిమ్మరుసు. తీసేశాడు కృష్ణరాయలు. అంతే! కృష్ణరాయల చెంప మీద చెళ్లుమనిపించాడు తిమ్మరుసు. కృష్ణరాయలుకు షాక్. ఎందుకిలా అకారణముగా, అదియునూ…ఈ వేళ ఇలా మదీయ చెంపను మీరు వాయించితిరి? అని అడిగాడు కృష్ణరాయలు. మరో పావు గంట తరువాత నువ్ చక్రవర్తివి. నేను ఆఫ్టరాల్ మంత్రిని. అప్పుడు కొట్టకూడదు. చక్రవర్తిగా నీ నిర్ణయాలతో ఎవరయినా అకారణంగా దెబ్బలు తింటే, శిక్ష అనుభవిస్తే, అవమానాల పాలైతే, బాధ పడితే ఎలా ఉంటుందో? నీకు శాశ్వతంగా గుర్తుండడానికే ఈ చెంప దెబ్బ అన్నాడు. కృష్ణరాయలు చెంప నొప్పి మరచిపోయి…తిమ్మరుసు కాళ్ల మీద పడ్డాడు. తిమ్మరుసు కృష్ణరాయలును తట్టి లేపి…గట్టిగా కౌగిలించుకున్నాడు. పట్టాభిషేకం జరిగింది. దక్షిణాపథంలో విజయనగర విజయ పతాక వినువీధిన రెపరెపలాడింది.

Janardhan Mishra Slap

ఇది నిజంగా జరిగిందో? లేక కట్టు కథో? తెలియదు. కానీ ప్రచారంలో మాత్రం ఉంది. కానీ- ఇందులో నీతి మాత్రం గ్రహించదగ్గది. అందుకే అయిదు శతాబ్దాలుగా ఈ కథ ప్రవహిస్తూనే ఉందని “హంపీ నుండి హరప్పా దాకా” పేరిట గొప్ప కావ్యం రాసిన తిరుమల రామచంద్ర అన్నారు.

ఇప్పుడు మళ్లీ ప్రస్తుతంలోకి వద్దాం. జనార్దన్ మిశ్రాలు వయసులో ఉండగా…పదవి చేపట్టే ముందు లోపలికి పిలిచి చెంప చెళ్లుమనిపించిన తిమ్మరుసులు లేకపోబట్టి కదా అమాయక కలెక్టర్ల చెంపలు ఎరుపెక్కి, బొబ్బలెక్కి, టన్నులకు టన్నుల ఆయింట్ మెంట్లు అవసరమయ్యాయి?

తిమ్మరుసు దెబ్బ కృష్ణరాయలుకు నీతి పాఠం.
మిశ్రా జనార్ధనులకు ఎవరు చెప్పాలి గుణపాఠం?

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : మరపురాని మాఫియా

RELATED ARTICLES

Most Popular

న్యూస్