పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్స్ నియోజక వర్గం నుంచి గెలుపొందిన టిడిపి అభ్యర్ధికి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి డిక్లరేషన్ ఫాం అందజేశారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతో కూడిన ఈ నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ ఈనెల 13న జరిగింది. అనంతపురం శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ ప్రాంగణంలో 16న మొదలైన ఓట్ల లెక్కింపు నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో పూర్తయ్యింది, 7,500 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్లు ప్రకటించినా డిక్లరేషన్ ఫాం ఇవ్వడంలో జాప్యం జరిగింది. రీకౌంటింగ్ నిర్వహించాలని అధికార వైఎస్సార్సీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది, వారు నిర్ణయం తీసుకునే వరకూ ధృవీకరణ పత్రం ఇవ్వొద్దని వైసీపీ కలెక్టర్ ను విజ్ఞప్తి చేసింది. మరోవైపు చంద్రబాబు కూడా ఈ విషయమై ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. వెంటనే డిక్లరేషన్ ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎట్టకేలకు ఈ ఉదయం 9.30 గంటల ప్రాంతంలో కలెక్టరేట్ లో పత్రం ఇస్తామని కలెక్టర్ సమాచారం ఇచ్చారు. కొద్దిసేపటి క్రితం టిడిపి నేతలు కాల్వ శ్రీనివాసులు, పార్ధసారథి, ప్రభాకర్ చౌదరి లతో కలిసి వచ్చిన భూమిరెడ్డి డిక్లరేషన్ అందుకున్నారు.