Monday, January 20, 2025
HomeTrending NewsYSRCP: లోకేష్ చేస్తున్నది విహార యాత్ర: అనిల్

YSRCP: లోకేష్ చేస్తున్నది విహార యాత్ర: అనిల్

తాను మంత్రిగా ఉన్న సమయంలో జిల్లాలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రావాలని టిడిపి నేత నారా లోకేష్ కు మాజీ మంత్రి పి. అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. మీరు అధికారంలో ఉన్న ఐదేళ్ళలో,  తన మూడేళ్ళ హయంలో ఎన్ని ప్రాజెక్టులు చేపట్టామో చర్చిద్దామని ప్రతిపాదించారు. కరోనా సమయంలో కూడా పనులు చేపట్టి నెల్లూరు, పెన్నా బ్యారేజ్ లు పూర్తి చేశామని, జిల్లాకో 3వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు పూర్తిచేశామని వివరించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో అనిల్ మీడియాతో మాట్లాడారు. లోకేష్ ది పాదయాత్ర అనేకంటే విహార యాత్ర అంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు. సాయంత్రం నాలుగింటికి బైటకు వచ్చి రాత్రి తొమ్మిదింటికి పూర్తి చేస్తున్నారన్నారు. జగన్ గతంలో ఎండా, వాన లెక్క చేయకుండా పాదయాత్ర చేశారన్నారు. నెల్లూరు హై లెవల్ కెనాల్-2 కు టిడిపి ప్రభుత్వం హడావుడిగా టెండర్లు 4 శాతం ఎక్కువకు వేస్తె, తాము అధికారంలోకి వచ్చిన తరువాత 40 కోట్లు ఆదాచేసి కొత్తగా టెండర్లు పిలిచామన్నారు.

నెల్లూరు జిల్లాలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని, క్లీన్ స్వీప్ చేస్తామని అనిల్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఆర్ధిక మంత్రిగా ఉన్న రామనారాయణ రెడ్డి సంగం బ్యారేజ్ ను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఏది మాట్లాడినా చెల్లుతుందని అనుకుంటే అది పోరపాటన్నారు. పార్టీలు మారడం ఆనంకు అలవాటేనని, ఆయనవన్నీ అవకాశవాద రాజకీయాలేనని ఎద్దేవా చేశారు. సిఎం జగన్ వల్ల ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆనం ముందు తన పదవికి రాజీనా చేసి మాట్లాడాలన్నారు. ఆనం కుటుంబ పరువు ప్రతిష్టలు ఇంకా నిలబడి ఉన్నాయంటే అది ఆనం విజయ్ కుమార్ రెడ్డి వల్లేనని, మాటకు కట్టుబడి జగన్ వెంట నడుస్తున్నారని, కానీ రామనారాయణ ఎవరు అధికారంలోకి వస్తుంటే ఆ పార్టీలోకి మారతారని విమర్శించారు.  జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన పార్టీకి నష్టం లేదని, కలుపు మొక్కలు అన్నీ వెళ్లిపోయాయని, వారు ఇక్కడ ఉండి వెన్నుపోటు పొడిచే కంటే వెళ్ళిపోవడమే మంచిదన్నారు. రేపు మరోసారి జగన్ సిఎం కాగానే ఇదే ఆనం… లోకేష్ ను నానా తిట్లు తిడతారని, దానికి లోకేష్ సిద్ధంగా ఉండాలన్నారు. నెల్లూరు జిల్లా జగన్ కు అడ్డా అని, ఆనం ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్లు దక్కవని తేల్చి చెప్పారు.

నెల్లూరు నుంచి వచ్చే ఎన్నికల్లో నారాయణ బదులు ఆయన కుమార్తెను బరిలోకి దించుతున్నట్లు వార్తలు వస్తున్నాయని, దానిని ఉద్దేశించే తాను రాజమాత వ్యాఖ్యలు చేశానని తప్ప వేరే అభిప్రాయం కాదని అనిల్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్