Sunday, December 29, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకందెబదెబ దెబ్బలు పడతయ్ రో!

దెబదెబ దెబ్బలు పడతయ్ రో!

వెనకటికి రాజుల కాలంలో రాజుల పిల్లలకు పాఠాలు చెప్పాలంటే అయ్యవార్లకు నిలువెల్లా వణుకు పుట్టేది. వారిని కొట్టకూడదు. కనీసం తిట్టకూడదు. దాంతో వారు ఏ హోమ్ వర్కో చేసుకురాకపోయినా…క్లాసులో అల్లరి చేసినా వారిని కొట్టాల్సి వచ్చినప్పుడు వారి బదులు వేరే పిల్లలను కొట్టేవారట. కొన్ని రాజ్యాల్లో అయితే యువరాజులు, యువరాణుల వయసున్న అద్దె పిల్లలను క్లాసుల్లో వారి పక్కన సిద్ధంగా ఉంచేవారట. అయ్యవారి చేతిలో అనవసరంగా చావు దెబ్బలు తింటారెందుకు? ఆయన చెప్పిందేదో చేయొచ్చుగా? అని యువరాజులుంగారు, యువరాణులుంగారు ఈ దెబ్బలు తినే పిల్లలను అమాయకంగా అడుగుతుంటే…వారికి పుండుమీద కారం పూసినట్లు ఉండేదట.

బీ జె పి తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై కర్ణాటకలో మాజీ ఐ పి ఎస్ అధికారి. ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఇష్టపూర్వకంగా సొంతరాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. చిన్నప్పుడు వెనకటి అద్దె పిల్లల్లా దెబ్బలు తిన్న అనుభవం ఆయనకు ఉండి ఉండకపోవచ్చు. కానీ ఆధునిక కాలంలో ఆయన పురాతన శిక్షాస్మృతిని తనమీద తనే అమలు చేసుకోవడం మాత్రం బాగలేదు. ఆ దెబ్బలు మనకు తగులుతున్నట్లుగా బాధగా ఉంది. ఒకరిని కొట్టడం ఎంతనేరమో…మనల్ను మనం కొట్టుకోవడం కూడా అంతే నేరం. తమిళ సంప్రదాయంలో ప్రాయశ్చిత్తానికి ఇలా కొరడాతో తనను తాను శిక్షించుకోవడం ఉందని ఆయన వివరణ ఇచ్చుకున్నారు.

ఈ బుగ్గ నుండి ఆ బుగ్గలోకి, నాలుకమీద ఇనుప చువ్వలు గుచ్చుకోవడం; భుజాలకు కొక్కేలు తగిలించుకుని దేవుడి కావళ్ళు మోయడం; వీపుకు ఇనుప కొక్కేలు తగిలించుకుని సుబ్రహ్మణ్యస్వామి రథాలు లాగడం; నిప్పులు తొక్కుతూ మొక్కులు చెల్లించుకోవడం; దేవుడి విగ్రహాలున్న పెట్టెలు మోస్తూ కొరడాతో కొట్టుకోవడం ఇలా భక్తిలో ఎన్నెన్నో అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. తమిళనాడులో ఇంకా ఎక్కువున్నాయి.

పూర్వం రాజాస్థానాల్లో శిక్ష ప్రారంభం కొరడా దెబ్బలతోనే. నేర తీవ్రతను బట్టి కొరడా దెబ్బల సంఖ్య పెరుగుతూ పోతుంది. వేలు తీసేయడం; చెయ్యి నరకడం; కాలు నరకడం; నాలుక కోసేయడం; చెట్టుకు కట్టి కొట్టడం; గుండు కొట్టించి సున్నపు బొట్లు పెట్టి గాడిద మీద ఊరేగిస్తూ మెడలో చెప్పుల దండ వేయడం లాంటి ఎన్నెన్నో శిక్షలు ఉండేవి.

ఇంగ్లిష్ వాడు వచ్చాక న్యాయస్థానం కనుక్కోలేని విధంగా పైకి కనపడని దెబ్బలు కొట్టే ఒక సునిశిత విద్య వెలుగులోకి వచ్చింది. ఆ విద్య పోలీసుల చేతిలో ఇప్పటికీ మెరుగులు దిద్దుకుంటూనే ఉందని అనుభవజ్ఞులు చెబుతుంటారు.

అలాంటి పోలీసు వృత్తి నుండి రాజకీయాల్లోకి వచ్చిన అన్నామలై కొరడాతో తనను తాను శిక్షించుకోవడం; నలభై రోజులపాటు చెప్పులు వేసుకోకుండా తిరుగుతానని దీక్ష తీసుకోవడం ఎలా అర్థం చేసుకోవాలో తెలియక లోకం తికమకపడుతోంది.

చెన్నయ్ మహానగరంలో అన్నా యూనివర్సిటీ క్యాంపస్ లో ఒక విద్యార్థిని అత్యాచారానికి గురయ్యిందని…తమిళనాడులో అమ్మాయిలకు రక్షణ కరువయ్యిందని…బాధతో ఏమి చేయాలో తెలియక అన్నామలై తనను తాను కొరడాతో కొట్టుకున్నట్లున్నారు.

ప్రజాస్వామ్యంలో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి సవాలక్ష మార్గాలున్నాయి. అంత చదువుకుని, అనేక చోట్ల జిల్లా ఎస్ పి గా పనిచేసిన అన్నామలైకి ఆ విషయం తెలియక కాదు. తమిళనాడులో అర్జంటుగా స్టాలిన్ ప్రభుత్వాన్ని దించి బి జె పి ప్రభుత్వాన్ని ప్రతిష్ఠించాలన్న తొందరలో ఉన్నట్లున్నారు అన్నామలై. కొరడాతో ప్రారంభమైన ఈ స్వీయ శిక్ష ఎక్కడిదాకా వెళుతుందోనన్నదే ఇప్పుడు లోకం బాధ. దక్షిణాదిలో అన్ని రాష్ట్రాల్లో పాగా వేయడానికి దారులు వెతుక్కుంటున్న బీ జె పి ఎప్పటికైనా తమిళనాడులో కమలాన్ని వికసింపచేయడానికి అన్నామలై చేతికి కొరడా ఇచ్చిందా ఏమిటి? లేకపోతే ఖండించి ఉండేది కదా!

పూర్వపు రాజుల కథల్లో దెబ్బలు తినడానికి అద్దె పిల్లలు ఉండేవారు. ప్రస్తుత ప్రజాస్వామ్య సంవిధానంలో పార్టీ అధ్యక్షులే దెబ్బలు తినాలేమో! అది కూడా వారిని వారే కొట్టుకోవాలేమో!

అన్నామలై గారూ! కొంచెం కుదుటపడి మొన్న మొన్నటి మీ పార్టీ చరిత్ర చదవండి. పార్లమెంటులో మీ బీ జె పి రెండు సీట్లనుండి మూడుసార్లు వరుసగా అధికారంలోకి ఒక్క కొరడా దెబ్బ కూడా కొట్టుకోకుండానే వచ్చింది. కొరడా పక్కన పడేయండి సార్! మీరు కొట్టుకుంటుంటే మాకు వాతలు తేలుతున్నాయి. తట్టుకోలేము.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్