అహోబల నవనారసింహులను అత్యంత సులభంగా పట్టుకోవాలంటే రెండో, మూడో అన్నమయ్య కీర్తనలను పట్టుకుంటే చాలు. అన్నమయ్యకు వైష్ణవం ఇచ్చిన గురువు; ద్వాత్రింశతి (32 అక్షరాల) నారసింహ మంత్రాన్ని బోధించినవాడు అహోబల ఘనవిష్ణు యతీంద్రులు. ఆ నారసింహ మంత్రంలోని 32 బీజాక్షరాల ఆధారంగా ఒక్కో అక్షరానికి వెయ్యి కీర్తనల చొప్పున 32 వేల కీర్తనలు రాసి…పాడి…ఆ అనంత ఆధ్యాత్మిక అచ్చతెనుగు పద సంపదను మనకిచ్చినవాడు అన్నమయ్య. ఆ అహోబల నారసింహ స్పర్శ అన్నమయ్య పదకవితల్లో అడుగడుగునా పొంగిపొర్లుతూ ఉంటుంది. కీర్తన చివరి చరణంలో ఏ దేవుడైనా వెంకన్నలోనే దర్శనమిస్తాడు అన్నమయ్యకు. అదో మెరుపు. భక్తిలో మైమరపు.
Youtube : https://www.youtube.com/@dhatritvtelugu
Facebook : https://www.facebook.com/dhatritelugutv
Instagram: https://www.instagram.com/dhatritelugutv/
Twitter :https://x.com/Dhatri_Tv
సాధారణంగా ఒక విషయం మీద రెండోసారి చెప్పినా…రాసినా అనేక పునరుక్తులు వస్తాయి. అలాంటిది అన్నమయ్యకు జీవితమంతా చెప్పాల్సిన వస్తువు ఒకటే. చెక్కే పద శిల్పం ఒకటే. కానీ 32 వేల కీర్తనల్లో లక్ష భంగిమల్లో ఒకే వస్తువును మనకు చూపించినా…బహుశా ఆ మహానుభావుడి తనివి తీరినట్లు లేదు. ఇంకా చూపాల్సిన అనేక కోణాలు మిగిలిపోయినట్లే ఉన్నాయి. అందుకే అన్నమయ్యలాంటి కారణజన్ముడు యుగానికొక్కడే పుడతాడు అన్నారు ‘సరస్వతీపుత్ర’ పుట్టపర్తి నారాయణాచార్యులు.
ఇప్పట్లా ఫోటోలు, వీడియోలు, ఆడియోలు లేవు కాబట్టి ఏది చెప్పినా ఎదుటివాడికి ఒక కదిలే దృశ్యం కళ్ళముందు కనపడాలి. చెవుల్లో శబ్దంగా మారుమోగాలి. మనసులో బలంగా నాటుకోవాలి. మన కళ్ళతో చూసే అహోబలంకంటే అన్నమయ్య కళ్ళతో చూసే అహోబలం అద్భుతంగా ఉంటుంది. నరసింహుడిముందు నిలుచున్న ప్రహ్లాదుడిని పక్కకు జరిపి…మనల్ను నిలుచోబెడతాడు అన్నమయ్య. పదపదాన ఆయన అధికారపథమది. జ్ఞానపరమపద సోపానపదమది. నరసింహుడు కాదనలేదు. ప్రహ్లాదుడు కాదనలేడు.
అంతటి అన్నమయ్య పదచిత్రాల్లో బంధించిన అహోబల నరసింహుడు నాలుకపై ఉండగా మామూలు మాంసనేత్రాలతో చూడాల్సిన పనేముంది అనుకుంటూ…నంద్యాలనుండి ఉదయాన్నే అహోబలం బయలుదేరగానే అన్నమయ్యను వెంటబెట్టుకుని…ఆయన కళ్ళతోనే ఆ నవనారసింహులను దర్శించాము.
పల్లవి:-
నవనారసింహ నమో నమో
భవనాశితీర యహోబలనారసింహ
చరణం-1
సతతప్రతాపరౌద్రజ్వాలానారసింహ
వితతవీరసింహవిదారణా
అతిశయకరుణ యోగానంద నరసింహ
మతి శాంతపు కానుగుమాని నారసింహ
చరణం-2
మరలి బీభత్సపు మట్టెమళ్ల నరసింహ
నరహరి భార్గోటి నారసింహ
పరిపూర్ణశృంగార ప్రహ్లాదనరసింహ
సిరుల నద్భుతపు లక్ష్మీనారసింహ
చరణం-3
వదనభయానకపు వరాహనరసింహ
చెదరని వైభవాల శ్రీనరసింహ
అదన శ్రీవేంకటేశ అందు నిందు నిరవైతి
పదివేలు రూపముల బహునారసింహ
పల్లవి:-
మలసీ జూడరో మగసింహము
అలవి మీరిన మాయల సింహము
చరణం-1
అదివో చూడరో ఆదిమ పురుషుని
పెద యౌబళముమీది పెనుసింహము
వెదికి బ్రహ్మాదులు వేదాంతతతులు
కదిసి కానగ లేని ఘనసింహము
చరణం-2
మెచ్చి మెచ్చి చూడరో మితిమీరినయట్టి చిచ్చరకంటితోడి జిగిసింహము
తచ్చిన వారిధిలోని తరుణిగౌగిటజేర్చి నచ్చిన గోళ్ళ శ్రీ నరసింహము
చరణం-3
బింకమున జూడరో పిరితీయక నేడు
అంకపుదనుజ సంహార సింహము
వేంకటనగముపై వేదాచలముపై
కింకలేక వడి బెరిగిన సింహము
పల్లవి:-
నవమూర్తులైనట్టి నరసింహము వీడె
నవమైన శ్రీ కదిరి నరసింహము
చరణం-1
నగరిలో గద్దెమీది నరసింహము వీడె
నగుచున్న జ్వాలా నరసింహము
నగముపై యోగానంద నరసింహము వీడె
మిగుల వేదాద్రి లక్ష్మీ నరసింహము
చరణం-2
నాటుకొన్న భార్గవూటు నరసింహము వీడె
నాటకపు మట్టెమళ్ల నరసింహము
నాటి యీ కానుగుమాని నరసింహము వీడె
మేటి వరాహపులక్ష్మీ నారసింహము
చరణం-3
పొలసి అహోబలాన బొమ్మిరెడ్డి చెర్లలొన
నలిరేగిన ప్రహ్లాద నరసింహము
చెలగి కదిరిలోన శ్రీ వేంకటాద్రి మీద
మెలగేటి చక్కని లక్ష్మీ నారసింహము
ఇంకా చాలా నరసింహస్వామి కీర్తనలున్నాయి కానీ…ప్రస్తుత సందర్భానికి ఇవి చాలు. బ్రహ్మాండ పురాణం మొదలు మొన్నమొన్నటి రాజుల కాలం దాకా అహోబలం గురించి ప్రస్తావనలన్నీ రాస్తే పెద్ద పురాణమవుతుంది. ఎగువ అహోబలం, దిగువ అహోబలం రెండూ ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నా…నిజానికి ఎగువ, దిగువ అహోబలం చుట్టుపక్కల కలిపి నవనారసింహుల క్షేత్రం- అహోబలం. మూడు క్షేత్రాలకు కార్లో వెళ్ళవచ్చు. మిగతావి ఆటోల్లో, బైకులమీద, కాలినడకన వెళ్లాల్సినవి; కొండలు, కోనలు ఎక్కి దిగాల్సినవి. ఓపిగ్గా అన్నీ దర్శిస్తున్నవారూ ఉన్నారు. కార్లో, బస్సులో వెళ్లగలిగిన రెండు క్షేత్రాలను దర్శించే వారే ఎక్కువ.
ఔబళం, ఓబుళాపురం, ఓబులేశు, ఓబయ్య, ఓబమ్మ పేర్లన్నీ అహోబలం నుండి పుట్టినవే. బిలం అంటే గుహ. పెద్ద గుహలోకి నరసింహుడు వచ్చిన ఆశ్చర్యంగా “అహో! బిలం!” కలిపి “అహోబిలం” అయినట్లు చెబుతారు కానీ…అన్నమయ్యతో పాటు పూర్వులందరూ అహోబలం, “అహో! బల నారసింహుడు” అనే అన్నారు. బిలంతో మనకేమిటి ప్రయోజనం? నరసింహుడి కొలవలేని బలంతోనే మనకు పని, అవసరం కాబట్టి బలమే సమంజసమని భయభక్తులు అంగీకరించాయి.
పురాణ సంబంధమైన ప్రహ్లాద ప్రార్థన; నరసింహ ఆవిర్భావం; హిరణ్యకశిపు వధ అందరికీ తెలిసినవే. ఆ తరువాత ఉగ్రనారసింహుడిని శాంతిపజేయడానికి ఎవరికీ సాధ్యం కాలేదు. లక్ష్మీదేవిని అడిగితే ఆమెకూడా ఆ మహోగ్రరూపాన్ని చూసి వణికిపోయింది. అప్పుడు నల్లమల అటవీ ప్రాంతంలో తిరుగుతున్న చెంచు లక్ష్మి రంగప్రవేశం చేసి…నరసింహుడిని శాంతింపజేసింది. అప్పుడు చెంచు లక్ష్మి-నరసింహస్వామి తిరిగినవే ఈ అహోబల పుణ్యక్షేత్రాలు. ఒక్కో క్షేత్రాన్ని దర్శిస్తే ఒక్కో గ్రహం అనుగ్రహిస్తుందని అనాదిగా భక్తుల నమ్మకం.
Youtube : https://www.youtube.com/@MahathiBhakthi
Facebook : https://www.facebook.com/mahathibhakthi
Instagram: https://www.instagram.com/mahathibhakthi/
Twitter : https://x.com/Dhatri_Tv
అన్నమయ్య శాబ్దిక ప్రత్యక్ష ప్రసారంలో చూపించిన పదివేలు రూపుల నవనారసింహులను చూస్తూ…
పొలసి అహోబలాన బొమ్మిరెడ్డి చెర్లలొన
నలిరేగిన ప్రహ్లాద నరసింహాన్ని వెంటబెట్టుకుని…
వెదకి బ్రహ్మాదులు, వేదాంతతతులు కదిసి కానగలేని అలవిమీరిన ఆ మాయల అహోబల ఘన సింహాన్ని మనసులో ప్రతిష్ఠించుకొని… బెలుం గుహలవైపు వెళ్ళాము.
రేపు- నంద్యాల సీమ-4
“బెలుం గుహలు”
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు