From Every Nook and Corner:
పల్లవి:-
నానా దిక్కుల నరులెల్లా
వానలలోననె వత్తురు కదలి
చరణం-1
సతులు, సుతులు, పరిసరులు, బాంధవులు
హితులు గొలువగా నిందరును
శత సహస్ర యోజన వాసులు సు
వ్రతముల తోడనె వత్తురు కదలి
చరణం-2
ముడుపులు, జాళెలు, మొగి తలమూటలు
కడలేని ధనము కాంతలును
కడుమంచి మణులు కరులు తురగములు
వడిగొని చెలగుచు వత్తురు కదలి
చరణం-3
మగుట వర్ధనులు, మండలేశ్వరులు
జగదేకపతులు చతురులును
తగు వేంకటపతి దరుశింపగ బహు
వగల సంపదల వత్తురు గదలి
ఈరోజుల్లో కొందరు సొంత విమానాలు, అద్దె విమానాలు, బస్సులు, రైళ్లు, కార్లు వేసుకుని ప్రత్యేక వినోద విహార కాలక్షేప యాత్రలా తిరుమలకు వెళ్లి వస్తున్నారు. దేవుడి ముందు ధర్మాన్ని పక్కన పెట్టి వీలయినంత పైరవీలు, సిఫారసులు, డబ్బు ఖర్చుతో, అధికార అనధికార హోదా ప్రోటోకాల్ దర్శనాల కోసం ఎగబడుతున్నారు. వారిని దర్శనం చేసుకోవడంతో వెంకన్నే నిలువెల్లా పులకించినట్లు వెళ్లినంత వేగంగా విమానం రెక్కలు కట్టుకుని వెనక్కు వచ్చేస్తున్నారు.
ఒక అయిదు వందల ఏళ్లు కాలగమనంలో వెనక్కు వెళితే- ఉత్సవాలప్పుడు ఎవరెవరు ఎలా వచ్చారో అన్నమయ్య ఈ కీర్తనలో రికార్డ్ చేసి పెట్టాడు. బహుశా అప్పట్లో వానాకాలంలో ఇప్పటి బ్రహ్మోత్సవాల్లా ప్రత్యేక ఉత్సవాలేవో జరిగినట్లు ఈ కీర్తననుబట్టి స్పష్టంగా తెలుస్తోంది. అంతగా వానలు పడుతున్నా నానా దిక్కులనుండి ఆబాలగోపాలం కదిలి వస్తున్నారు. వందల వేల మైళ్ళ దూరం నుండి పిల్లా పాపలతో, బంధువులు, మిత్రులతో మూట ముల్లె సర్దుకుని వస్తున్నారు. మధ్యలో వంటావార్పు, స్నానపానాదులకు, రాత్రిళ్ళు ఎక్కడో ఒక చోట బసచేయడానికి తగిన ఏర్పాట్లతో వస్తున్నారు. ముడుపులు కట్టుకుని, మొక్కులు తీర్చుకోవడానికి దీక్షగా వస్తున్నారు. సామంత రాజులు, మండలాధీశులు(ప్రాంత పాలకులు) రాజులు, చక్రవర్తులు గుర్రాల మీద, ఏనుగుల మీద వస్తున్నారు. మణిమాణిక్యాలు, ధన ధాన్యాల మూటలను స్వామివారికి సమర్పించడానికి ఉత్సాహంగా వస్తున్నారు.
పల్లవి:-
అదెవచ్చె నిదెవచ్చె అచ్యుతుసేనాపతి
పదిదిక్కులకు నిట్టె పారరో యసురులు
చరణం-1
గరుడధ్వజంబదె ఘనశంఖరవమదె
సరుసనే విష్ణుదేవుచక్రమదె
మురవైరిపంపులవె ముందరిసేనలవె
పరచి గగ్గుల కాడై(ఱై) పారరో దానవులు
చరణం-2
తెల్లని గొడుగులవె దేవదుందుభులు నవె
యెల్ల దేవతల రథాలింతటా నవె
కెల్లురేగీ నిక్కి హరికీర్తి భుజములవె
పల్లపు పాతాళానఁ బడరో దనుజులు
చరణం-3
వెండిపైడిగుదె లవె వింజామరములవె
మెండగు కైవారాలు మించిన వవె
దండి శ్రీవేంకటపతి దాడిముట్టె నదెయిదె
బడుబండై జజ్జరించి పారరో దైతేయులు
ఒక సన్నివేశాన్ని వర్ణించడం కాకుండా…ఆ సన్నివేశంలోకి మనల్ను తీసుకెళ్లి కూర్చోబెట్టడానికి అన్నమయ్య ఎంచుకున్న రచనా శైలి అనన్యసామాన్యం. క్రికెట్ ప్రత్యక్ష వ్యాఖ్యానం చెప్పేవారు ఎలా బాల్ బాల్ గురించి క్రీడోత్సాహం పొంగిపొర్లేలా, కళ్లకు కట్టినట్లు వర్ణించడానికి ప్రయత్నిస్తారో…అలా అన్నమయ్య మనల్ను ముందుకు తోసి…తను వెనుక నుండి వ్యాఖ్యానం చెబుతూ ఉంటాడు.
అదిగదిగో…విష్ణువు సర్వ సైన్యాధ్యక్షుడు విషక్సేనుడు వచ్చేశాడు. రాక్షసులరా! ఇక దిక్కుకొకరుగా పారిపోండి.
అదిగో…గరుడధ్వజం…కనపడుతోందా!
ఇదిగో శంఖారావం…వినపడుతోందా!
విష్ణువు పంపిన సేనలివిగో…చూస్తున్నారా!
అడవులు పట్టుకుని అదృశ్యమైపొండి!
అదిగో…తెల్లని గొడుగులు…చూడండి!
ఇదిగో దేవదుందుభులు మోగుతున్నాయి…వినండి!
సకల దేవతా రథాలవిగో…దుమ్ము రేగుతోంది…అటు చూడండి!
అదిగో కనువిచ్చి…నిక్కి నిలిచి చూడండి…హరి భుజకీర్తులైన శంఖు చక్రాలు!
ఓ రాక్షసులారా! మీకు మీరే పాతాళంలో పడిపోండి!
అదిగో…బంగారు వెండి తోరణాలు…వింజామరలు!
తళతళలాడే కత్తులు చూశారా!
అదిగో…కోటి సూర్య ప్రభలతో అందరి వెనుక వెంకన్న తన కరవాలంతో మీ మీదికి ఉరికి వస్తున్నాడు.
ఓ రాక్షసులారా! కట్టకట్టుకుని పారిపోండి!
ఇక్కడ అన్నమయ్య మనతో మాట్లాడ్డమే లేదు. మన ముందు రాక్షసులతో నేరుగా మాట్లాడుతున్నాడు. మనకోసం రాక్షసులను తరిమేయడానికి వెంకన్న రావడాన్ని మైమరచి సీన్ బై సీన్ వర్ణిస్తున్నాడు. రాక్షసులను కూడా దయదలిచి…ఒరేయ్ ఎందుకురా మీకు వెంకన్నతో వైరం? ఎక్కడన్నా అడవులకో, పాతాళం కిందికో వెళ్లి బతికిపోండి అని అవకాశం ఇస్తున్నాడు. రాక్షసుల మీద వంక పెట్టి వెంకన్న రాకముందు, వచ్చాక వరుసగా జరుగుతున్నవన్నీ అదిగో అదిగో అని వీడియోను ఆపి ఆపి మరీ మనకు చూపిస్తున్నాడు.
అంతటి శ్రీవేంకటపతి సకల దేవతలతో మనకోసం దిగివస్తే మన సాధారణ మాంస నేత్రాలు ఏమి చూడగలుగుతాయి? మన సాధారణ చెవులు ఏమి వినగలుగుతాయి? అందుకే అన్నమయ్య కళ్లతోనే మనం వెంకన్నను చూడాలి. అన్నమయ్య కళ్లతోనే వెంకన్నను వినాలి.
రేపు:- అన్నమయ్య పదబ్రహ్మోత్సవం-3
“వెదకి వెదకి వీధుల్లో తిరిగే వెంకన్న”
-పమిడికాల్వ మధుసూదన్
9989090018