తిరుమలలో దాదాపు 1400 సంవత్సరాల కిందట జరిగిన బ్రహ్మోత్సవాల గురించి చారిత్రిక ఆధారాలున్నాయి. అంతకు ముందు కూడా జరిగే ఉంటాయి. శాసనాల్లాంటి ఆధారాలు దొరికి ఉండకపోవచ్చు. శిలాశాసనాలు, రాగి రేకులు, తాళపత్రాలు, కాగితం పుస్తకాలు, ఫోటోలు, వీడియో ఆధారాలుంటే తప్ప మనకు చరిత్ర కాదు. ఇప్పుడయితే గూగుల్లో లేనిది ఉన్నట్లు కానే కాదు.
బ్రహ్మోత్సవాలకు కదిలే వీడియోల్లాంటి, కదలని చిత్రాల్లాంటి, పలికే ప్రత్యక్షప్రసార వ్యాఖ్యానంలాంటి అన్నమయ్య కీర్తనలున్నాయి. ఆ పదచిత్రాలను ముందు పెట్టుకుని చూస్తే మనకు ఇప్పుడు కనిపించే బ్రహ్మోత్సవాలకంటే కోట్ల రెట్లు గొప్పగా కనిపిస్తాయి. వినిపిస్తాయి. బ్రహ్మోత్సవాల్లో ముంచి తేలుస్తాయి.
వెంకన్నతో నేను అని మనమిప్పుడు సెల్ఫీలు తీసుకోవడంలో పోటీలు పడుతున్నాం కానీ…అన్నమయ్య కీర్తనలన్నీ వెంకన్నతో ఆయన తీసుకున్న ఫోటో సెల్ఫీలే. వీడియో విల్ఫీలే. కాకపొతే మనచిత్రాలను మనమే రెండో రోజుకు దాచుకోలేక గాలికి వదిలేస్తాం. అన్నమయ్య సెల్ఫీ పదచిత్రాలను వెంకన్నే గుండెల్లో పదిలంగా దాచుకుని…చూసుకుంటూ…చదువుకుంటూ…వింటూ…మైమరచిపోతూ ఉంటాడు. ప్రపంచ భక్తి వాఙ్మయంలో జీవితకాలంలో ఒక దేవుడిమీద 32 వేల కీర్తనలు రాసి…పాడినవారు అన్నమయ్య తప్ప ఇంకొకరు ఉండకపోవచ్చు. అన్నమయ్యతో వెంకన్నకు ఎంత ప్రచారం జరిగిందో, జరుగుతోందో…అంతకంటే ఎక్కువ తెలుగు భాషకు, జానపదభాషకు ప్రచారం జరిగింది. జరుగుతోంది. మాండలిక భాష మంత్రమయమై నిత్యపారాయణమయ్యింది.
బ్రహ్మోత్సవాల్లో ప్రత్యక్షంగా పాల్గొనాలని చాలా మందికి ఉంటుంది. ప్రత్యక్షంగా పాల్గొన్నవారు కంటితో చూసినదానికంటే…ఇప్పుడు ప్రసార మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారాల్లో మనం చూస్తున్నదానికంటే అన్నమయ్య పదకవితల్లో బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అక్షరానికున్న శక్తి అదే. ఫోటో లేదా వీడియోలో ఏముంటే మన కన్ను అదే చూడాలి. అక్షరం పదంగా, పదాలు పదకవితగా మారిన అన్నమయ్య ఒక్కో కీర్తన ఒక్కో వీడియో డాక్యుమెంటరీ లాంటిది. ఒక్కో కీర్తన ఒక్కో కావ్యంతో సమానం. మన భావనా శక్తిని బట్టి అందులో ఆడియో, వీడియో, గ్రాఫిక్స్, యానిమేషన్, బ్యాక్ గ్రవుండ్ మ్యూజిక్, ఇతరేతర ఎఫెక్ట్స్ ఎన్నయినా ఊహించుకోవచ్చు. వినవచ్చు. చూడవచ్చు. చివరకు తాకి పరవశించవచ్చు.
అన్నమయ్య కీర్తనల త్రీ డి కళ్ల జోళ్లు పెట్టుకుని తిరుమల బ్రహ్మోత్సవాలను చూడడానికి ప్రయత్నిద్దాం. అన్నమయ్య కీర్తనలను మనం పట్టుకోగానే…ఆయన మన చేయి పట్టుకుని…ఏ ఎల్ వన్ సిఫారసు లెటర్, ఏ వి ఐ పి బ్రేక్, ఏ డోనార్ టికెట్ ఇవ్వలేని ముందువరుసలో కూర్చోబెట్టి సాక్షాత్తు వెంకన్నతో ముఖాముఖీ అపాయింట్ మెంట్ అరేంజ్ చేయిస్తాడు. కావాలంటే మనతరఫున అలమేలు మంగతో వాదించి స్వామి దర్శనమిప్పిస్తాడు.
పల్లవి:-
తిరువీధుల మెరసీ దేవదేవుడు
గరిమల మించిన సింగారముల తోడను
||తిరువీధుల మెరసీ||
చరణం 1
తిరుదండెల పై నేగీ దేవు డిదే తొలినాడు
సిరులు రెండవనాడు శేషుని మీద
మురిపేన మూడోనాడు ముత్యాలపందిరి క్రింద
పొరి నాలుగోనాడు పువ్వుకోవిల లోను
||తిరువీధుల మెరసీ||
చరణం 2
గక్కన ఐదవనాడు గరుడుని మీద
ఎక్కెను ఆరవనాడు యేనుగు మీద
చొక్కమై ఏడవనాడు సూర్యప్రభలోనను
యిక్కువ తేరును గుర్ర మెనిమిదో నాడు
||తిరువీధుల మెరసీ||
చరణం 3
కనకపుటందలము కదిసి తొమ్మిదోనాడు
పెనచి పదోనాడు పెండ్లి పీట
ఎనసి శ్రీ వేంకటేశు డింతి అలమేల్మంగతో
వనితల నడుమను వాహనాల మీదను
||తిరువీధుల మెరసీ||
బ్రహ్మోత్సవాల్లో ఏయే రోజు ఏయే వాహనాల మీద స్వామివారు ఊరేగుతున్నాడో తెలిపే వీడియో డాక్యుమెంట్ కంటే గొప్ప సాక్ష్యంగా నిలిచి వెలుగుతున్న కీర్తన ఇది. దీనిక్కూడా ప్రతిపదార్థాలు అవసరమయిన తెలుగు కరువు కాలాలు వచ్చాయి. దానికి అన్నమయ్య బాధ్యుడు కాదు. ఆనాటికి సమాజంలో అక్షరం ముక్క రానివారికి కూడా అత్యంత సులభంగా అర్థం కావాలని ఉద్దేశపూర్వకంగానే అన్నమయ్య అత్యంత సరళంగా రాశాడు.
గరిమల- గొప్పతనాల;
తిరుదండెము- చెక్క, కర్రల పల్లకీ(ఆది శేషుడి వాహనం);
పువ్వుల కోవిల- కల్పవృక్ష వాహనం;
కనకపుటందలము- బంగారు పల్లకి;
పెండ్లి పీట- కల్యాణోత్సవం-
మిగతా మాటలు సులభంగా అర్థమయ్యేవే కాబట్టి వాటి ప్రతిపదార్థాల జోలికి వెళ్లడం లేదు.
బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదిరోజులు తొమ్మిది రకాల వాహనాలు. పదో రోజు పెండ్లి పీటల మీద కూర్చోబెట్టి అక్షతలు చల్లుకోమని అన్నమయ్య అచ్చ తెలుగు బంగారు పళ్లెంలో తన పచ్చ పచ్చని పదాక్షర తలంబ్రాలను అయ్యవారి- అమ్మవారి పిడికిట్లో పోశాడు. ఆ దృశ్యమే – “పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు…” అపురూప దృశ్యాలై అయిదు వందల యాభై ఏళ్లుగా ప్రతి పెండ్లి పందిట్లో సిగ్గుల మొగ్గలై కొంత పెడ మరలి నవ్వుతూనే ఉన్నాయి. ఆ మూసిన ముత్యాల మొరగులు పెండ్లి కొడుక్కు మాత్రమే వినపడుతూనే ఉన్నాయి. నవదంపతుల ఆశల చిత్తాల్లో అలవోకలుగా హొయలుపోతూనే ఉన్నాయి. నిత్యకల్యాణం పచ్చతోరణమై తెలుగు గుమ్మాలకు వెలుగులు అద్దుతూనే ఉన్నాయి. భావించినవారి మది గదుల్లో గంధాలు చల్లుతూనే ఉన్నాయి.
రేపు:- అన్నమయ్య పదబ్రహ్మోత్సవం-2
“నానా దిక్కుల నరులెల్లా వత్తురు కదిలి”
-పమిడికాల్వ మధుసూదన్
9989090018