Aswana Vahana Seva: పరమాణువు మొదలు బ్రహ్మాండాలన్నీ నిండి ఉన్న పరమాత్మ రూపాన్ని దర్శించి…పరవశించి పాడుతున్నాడు అన్నమయ్య. అంతటి రూపం అత్యంత సులభంగా అంజనాద్రి మీద వెంకన్న రూపంలో దొరుకుతోందని ఆనందపడుతున్నాడు.
పల్లవి:-
అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాదిసిరి అంజనాద్రిమీది రూపము
చరణం-1
వేదాంతవేత్తలెల్ల వెదకేటి రూపము
ఆదినంత్యము లేని యారూపము
పాదు యోగీంద్రులు భావించు రూపము
యీదెస నిదివో కోనేటిదరి రూపము
చరణం-2
పాలజలనిధిలోన బవళించేరూపము
కాల సూర్యచంద్రాగ్నిగల రూపము
మేలిమి వైకుంఠాన మెరసిన రూపము
కీలైనదిదె శేషగిరిమీది రూపము
చరణం-3
ముంచిన బ్రహ్మాదులకు మూలమైనరూపము
కొంచని మఱ్ఱాకుమీది కొనరూపము
మంచి పరబ్రహ్మమై మమ్మునేలిన రూపము
యెంచగ శ్రీవేంకటాద్రి నిదె రూపము
వెంకన్నను ఆశ్రయిస్తే అణిమ, గరిమ, లఘిమ లాంటి అష్టసిద్ధులు దొరుకుతాయి.
అది- వేదాంతవేత్తలు కోరి కోరి వెతికే రూపం. ఆది- అంతాలు లేని రూపం. యోగులు తపస్సుగా భావించే రూపం. ఇదుగో ఇక్కడే కోనేటి పక్కన కొలువైన రూపం.
అది- పాలసముద్రంలో పవళించిన విష్ణురూపం. సూర్య చంద్రులు రెండు కళ్లుగా కలిగిన కాలరూపం. వైకుంఠంలో గొప్పగా వెలిగే రూపం. ఇదుగో ఇక్కడ శేషాద్రి మీద వెలిసిన రూపం.
అది- బ్రహ్మాదులు కొలిచే రూపం. ప్రళయకాలంలో కూడా నిలిచి మర్రి ఆకు మీద తేలే వటపత్రశాయి రూపం. పరబ్రహ్మమై మనల్ను రక్షించే రూపం. ఇన్ని మాటలెందుకు? తరచి చూస్తే…అన్నీ కలగలిసి వేంకటేశ్వరుడుగా వెలసిన రూపమిది.
తిరుమల ఉత్సవాల్లో తిరిగే వేంకటేశ్వరుడి వెంట మనల్ను తిప్పుతున్నాడు ఈ కీర్తన ద్వారా అన్నమయ్య.
పల్లవి:-
దేవశిఖామణి దివిజులు వొగడగ
వేవేలు గతుల వెలసీ వాడే
చరణం-1
వీధుల వీధుల వెసతురగముపై
భేదిల బల్లెము బిరబిర దిప్పుచు
మోదము తోడుత మోహన మూరితి
ఏ దెస జూచిన నేగీ వాడే
చరణం-2
కన్నులు దిప్పుచు కర్ణములు కదల
సన్నల రాగెకు చౌకళింపుచును
అన్నిటా తేజియాడగ దేవుడు
తిన్నగ వాగేలు తిప్పీవాడే
చరణం-3
వలగొని దిరుగుచు వాలము విసరుచు
నిలిచి గుఱ్ఱమటు నేర్పులు చూపగ
బలు శ్రీ వేంకటపతి అహోబలపు
పొలమున సారెకు పొదలీవాడే
దేవతలు పొగుడుతుండగా వేవేల రూపాల్లో వెంకన్న తిరుమలలో తిరుగుతున్నాడు.
అశ్వవాహనమెక్కి బల్లెం తిప్పుతూ వీధులు విధులన్నీ తిరుగుతున్నాడు. ఎటువైపు చూసినా ఆ మోహనాకారుడయిన వెంకన్నే కనిపిస్తున్నాడు.
కన్నులు అటు ఇటు తిప్పుతూ అన్ని దిక్కులను కలయజూస్తున్నాడు. తళతళలాడే ఆయుధాలు తిప్పుతూ శత్రువులను తరిమేస్తూ…మన రక్షణకోసం తిరుగుతున్నాడు.
గుర్రం మీద యోధుడిలా స్వారి చేస్తున్నాడు. అహోబలం పొలంలో నరసింహ స్వామి అవతారంలో స్వేచ్ఛగా తిరుతున్నది సాక్షాత్తు వెంకటేశ్వరుడే.
రేపు:- అన్నమయ్య పదబ్రహ్మోత్సవం-7
“అన్నమయ్య పదకవితా తపస్సు”
-పమిడికాల్వ మధుసూదన్
9989090018