Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకీర్తనలో సంభాషణ

కీర్తనలో సంభాషణ

“మరలనిదేల రామాయణంబన్న?” అని తనను తానే ప్రశ్నించుకుని…“నావయిన భక్తి రచనలు నావిగాన…” అని తానే సమాధానం కూడా చెప్పుకున్నాడు తెలుగులో మెదటిసారి జ్ఞానపీఠం అందుకున్న విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షానికి ముందు మాటలో.

కంకంటి పాపరాజు ఉత్తర రామాయణం, భాస్కర రామాయణం, మొల్ల రామాయణం, ఒంటిమిట్ట వాసుదాసు రామాయణం…ఇలా నన్నయ్య, తిక్కనలనుండి మొన్న మొన్నటి పుల్లెల శ్రీరామచంద్రుడి వచనానువాదం దాకా తెలుగులో లెక్కలేనన్ని రామాయణాలు. అలాగే మిగతా భారతీయ భాషల్లో కూడా రామాయణ కావ్యాలెన్నో లెక్కే లేదు.

కాళిదాసు అంతటివాడు రఘువంశం రాస్తూ…
“వాల్మీకి మహర్షి రాసిన రామాయణం ముందు నా రచన ఏపాటి? పొట్టి చేతులవాడిని…ఎత్తయిన చెట్టు ఫలాలు అందుకోవాలని ఆశపడుతున్నాను” అని అత్యంత వినయంగా చెప్పుకున్నాడు.

“పలికెడిది భాగవత మఁట, 

పలికించెడివాడు రామభద్రుం డఁట, నేఁ

బలికిన భవహర మగునఁట,
పలికెద, వేఱొండు గాథ బలుకఁగ నేలా?”

అని తెలుగు భాషను, తెలుగు పద్యాన్ని మంత్రమయం చేసిన మన పోతన చెప్పుకున్నాడు.

మన భద్రాద్రి రామయ్యను చూస్తూ కంచెర్ల గోపన్న అల్లిన కీర్తనల్లో, పద్యాల్లో ఉన్నదంతా రామాయణమే. తమిళగడ్డ మీద తేట తెలుగులో అయోధ్యరాముడితో మన త్యాగయ్య మాట్లాడినదంతా రామాయణమే. తెలుగు పదకవితా పితామహుడు అన్నమయ్య వెంకన్నలో రాముడిని చూస్తూ పరవశించి పాడినదంతా రామాయణమే.

పల్లవి:-
ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకె
అదనెరిగి తెచ్చితిని అవధరించవయ్యా!

చరణం-1
రామా నిను బాసి నీ రామా నే చూడగ ఆ
రామమున నిను పాడెను రామ రామ యనుచు
ఆ మెలుత సీతయని అపుడు నే తెలిసి
నీ ముద్ర ఉంగరము నేనిచ్చితిని

చరణం-2
కమలాప్తకులుడా నీ కమలాక్షి నీ పాద
కమలములు తలపోసి కమలారిదూరె
నెమకి ఆలేమను నీ దేవియని తెలిసి
అమరంగ నీ సేమమటు విన్నవించితిని

చరణం-3
దశరధాత్మజా నీవు దశశిరుని చంపి
ఆ దశనున్న చెలిగావు దశ దిశలు పొగడ
రసికుడ శ్రీ వెంకట రఘువీరుడా నీవు
శశిముఖి చేకొంటివి చక్కనాయె పనులు

32 వేల అన్నమయ్య కీర్తనల్లో మనకు దొరికినవి దాదాపు పదిహేను వేలు. మిగిలిన రాగిరేకులు దొరకక కాలగర్భంలో కలిసిపోయాయి. దొరికినవాటిలో రామాయణంలో సీతమ్మ జాడ కనుక్కుని…రాముడి ఉంగరం ఆ తల్లికి ఇచ్చి…ఆమె గుర్తుగా ఇచ్చిన శిరసు మాణిక్యాన్ని (నెత్తిన పాపిట మధ్య పెట్టుకునే ఆభరణం) రాముడికి హనుమంతుడు ఇస్తున్న సందర్భాన్ని తెలిపే పద చిత్రమిది.

“ఓ స్వామీ!
సీతమ్మ క్షేమంగా ఉంది. నీ క్షేమం అడగమంది.
ఇదిగో సీతమ్మ శిరసు మాణిక్యం తెచ్చాను. నీకు దూరమై లంక ఆరామాల్లో రామా! రామా! అని విలపిస్తున్న సీతమ్మను గుర్తు పట్టి నీవిచ్చిన ఉంగరం ఇచ్చాను. పదే పదే నిన్ను తలచుకుంటున్న ఆ తల్లికి నీ క్షేమ సమాచారాన్ని విన్నవించాను.
ఓ దశరథ కుమారుడా!
నువ్వు త్వరగా ఆ దశలో ఉన్న దశకంఠుడిని చంపి…దశ దిశలు పొగుడుతుండగా సీతమ్మను క్షేమంగా తీసుకురా! స్వామీ!”

ఈ మాటలు వాల్మీకి రామాయణంలో లేనే లేవు. కానీ వాల్మీకి కంటే ఈ సందర్భాన్ని అన్నమయ్య అద్భుతంగా ఆవిష్కరించాడు. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని చెప్పడానికి వీల్లేదు. ఒక్కో కవి భావనా పటిమ, వైశాల్యం, సాంద్రత, భావావిష్కారం ఒక్కోలా ఉంటుంది. అందుకే మనం వాల్మీకి మాటను పారాయణ చేస్తాం. అన్నమయ్య మాటను పరవశించి పాడుకుంటాం. వాల్మీకి దారిలోఒక్క అంగుళం కూడా పక్కకు తప్పకుండా అదే రామాయణాన్ని అంతే రమ్యంగా చెప్పారు కాబట్టే…పిబరే రామరసం అని భక్తి పారవశ్యంతో మిగిలిన రామాయణాలను కూడా మనం నెత్తిన పెట్టుకుని తరతరాలుగా పూజిస్తున్నాం.

ఇది మాటనుకుంటే మాట. పాటనుకుంటే పాట. కీర్తనని అనుకుంటే కీర్తన. మంత్రమనుకుంటే మంత్రం. ఒక వార్తాహరుడుగా హనుమ చెబుతున్న వార్త అనుకుంటే వార్త. అన్నమయ్య మాత్రమే ఆవిష్కరించగల ఒకానొక పద విన్యాసమిది. పద చిత్రమిది. ఒక సన్నివేశానికి ప్రత్యక్షప్రసారమిది.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్