Saturday, November 23, 2024
HomeTrending NewsLift Irrigation: 16న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రారంభం

Lift Irrigation: 16న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రారంభం

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్నిఈ నెల ( సెప్టెంబర్) 16న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందులో భాగంగా నార్లాపూర్ ఇన్ టేక్ నుంచి సెప్టెంబర్ 16 న మధ్యాహ్నం బటన్ నొక్కి బాహుబలి పంపు ద్వారా కృష్ణా జలాలను సిఎం కేసీఆర్ ఎత్తిపోయనున్నారు.
ప్రపంచంలో మరెక్కడా లేని అత్యంత భారీ పంపులతో నిర్మితమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి దక్షిణ తెలంగాణ ప్రజల తాగునీరు సాగునీరు అవసరాలను ఈ ఎత్తిపోతలు తీర్చనున్నాయని సీఎం తెలిపారు. ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ దార్శనికతతో అనేక అడ్డంకులను దాటుకుని మోక్షం లభించడం చారిత్రక సందర్భమని స్పష్టం చేశారు. దశాబ్ధాల కల సాకారమౌతున్న చారిత్రక సందర్భంలో దక్షిణ తెలంగాణ రైతాంగానికి, ప్రజలకు ఇది గొప్ప పండుగ రోజని సిఎం స్పష్టం చేశారు. అందుకోసం ప్రారంభమైన తెల్లారి (సెప్టెంబర్ 17 న) ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లాల్లోని పల్లె పల్లెనా ఊరేగింపులతో ఈ విజయాన్ని పెద్ద ఎత్తున సంబురాలతో జరుపుకోవాలన్నారు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం డా బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టుల పనులను సమీక్షించారు. ప్రాజెక్టు పరిథిలో కాల్వల తవ్వకం అందుకు సంబంధించి భూ సేకరణ సహా అనుబంధ పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను సిఎం కేసీఆర్ ఆదేశించారు.
కృష్ణా నదికి అనుసంధానించి, (శ్రీశైలం ఫోర్ ప్లో వద్ద) నార్లాపూర్ వద్ద నిర్మించిన ఇన్ టేక్ వద్దకు చేరుకొని అక్కడ స్విచ్ ఆన్ చేసి సిఎం కెసిఆర్ పంపులను ప్రారంభిస్తారు. వెట్ రన్ ద్వారా బాహుబలి పంపుల గుండా ఎగిసిపడే కృష్ణా జలాలు సమీపంలోని నార్లాపూర్ రిజర్వాయర్ కు చేరుకోనున్నాయి. మోటర్లు ఆన్ చేసిన వెంటనే సిఎం కేసీఆర్ నార్లాపూర్ రిజర్వాయర్ వద్దకు చేరుకుని రిజర్వాయర్ కు ఎత్తిపోతల ద్వారా చేరుకుంటున్న కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తెలంగాణ సాగునీటి రంగం చరిత్రలో మరో సువర్ణధ్యాయం లిఖించనున్నది.

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన జరిగిన ఈ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఛైర్మన్లు తదితర ప్రజాప్రతినిధులు, సీఎంఓ అధికారులు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సీఈలు తదితర ఇంజనీర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్