వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. నిన్న ఇద్దరు రాజ్యసభ ఎంపిలు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు లు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వారి రాజీనామాలను నిన్న సాయంత్రమే సభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి ఆమోదించారు, దీనికి సంబంధించిన బులెటిన్ కూడా విడుదలైంది.
మరోవైపు పార్టీ ఎమ్మెల్సీలు కూడా రాజీనామా బాట పట్టారు. మొన్న పోతుల సునీత పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నేడు మరో ఇద్దరు ఎమ్మెల్సీలు పదవులకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న బలి కళ్యాణ చక్రవర్తి, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న కర్రి పద్మశ్రీలు పదవులకు, పార్టీకి రాజీనామా చేస్తున్నారు.
2019 ఎన్నికల్లో తిరుపతి నుంచి లోక్ సభకు ఎన్నికైన బలి దుర్గాప్రసాద రావు ఆకస్మిక మరణంతో ఆ సీటును ఆశించిన ఆయన కుమారుడు కళ్యాణ చక్రవర్తికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి జి. గురుమూర్తిని ఎంపిగా నిలబెట్టారు.
కాకినాడకు చెందిన కర్రి పద్మశ్రీ వాడ బలిజ సామాజికవర్గానికి చెందినవారు. ఆమె భర్త నారాయణ రావు వైసీపీనేతగా ఉన్నారు. 2023 ఆగస్ట్ లో ఆమెను గవర్నర్ కోటాలో శాసనమండలికి నాటి సిఎం జగన్ ఎంపిక చేశారు.