ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దేశాల్లో పట్టు బిగించేందుకు చైనా ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. తాలిబాన్ ఏలుబడితో ప్రపంచ దేశాలు ఆఫ్ఘనిస్తాన్ తో సంబంధాలు తెగతెంపులు చేసుకున్నాయి. తాలిబాన్ విధానాల్ని ప్రపంచ దేశాలు విమర్శిస్తుంటే చైనా లోపాయికారిగా ఆర్థిక సాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే కొద్ది రోజుల క్రితం ఖుజ్దర్ ప్రాంతంలో గనుల తవ్వకాలకు చైనా కంపెనీలకు అవకాశాలు లభించాయి. ఆఫ్ఘన్ కు చెందిన ఏడు బిలియన్ డాలర్లను అమెరికా సీజ్ చేసినా మిలియన్ డాలర్ల సాయం చైనా చేస్తోంది. ఆర్థికంగా సమస్యల్లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కు సాయం పేరుతో దూకుడుగా వ్యవహరిస్తున్న చైనా పాలకులు ఆ స్థాయిలో తాలిబాన్ ల నుంచి సహకారం అందటం లేదనే అసంతృప్తితో ఉన్నారు.
జింజియాంగ్ రాష్ట్రంలో వియ్ఘుర్ ముస్లిం ఉద్యమాలు చైనాకు కంట్లో నలుసుగా మారాయి. వియ్ఘుర్ ఉద్యమకారులు కొందరు సాయుధులై చైనా సైన్యంతో తలపడుతున్నారు. వీరు దాడులు చేసి ఆఫ్ఘన్ పారిపోతున్నారు. వీరికి మొదటి నుంచి తాలిబాన్ వెన్నుదన్నుగా ఉంది. ఇప్పుడు అంతా అనుకూలంగా ఉంది..వియ్ఘుర్ వేర్పాటువాదులను అప్పచేప్పమని తాలిబాన్ లను కోరితే వారి నుంచి సరైన స్పందన రావటం లేదనే అక్కసు చైనాలో స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి తోడు తాలిబాన్ సహకారంతో పాకిస్తాన్ లో చెలరేగుతున్న తెహ్రిక్ e తాలిబాన్ పాకిస్తాన్ (TTP) బలూచ్ వేర్పాటువాదులకు ఆయుధ శిక్షణ ఇస్తోంది. బలోచిస్తాన్, సింద్, ఖైభర్ పఖ్తుంక్వ రాష్ట్రాల్లో చైనా పౌరులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ఎక్కువగా బలూచిస్తాన్ లో చోటు చేసుకుంటున్నాయి. మైనింగ్ ప్రాంతాలు, గ్వదర్ ఓడరేవు, విద్యుత్ ప్రాజెక్టుల వద్ద దాడులు చేస్తున్న బలూచ్ ఉద్యమకారులు ఇటీవల కరాచీ నడిబోడ్డులో పట్టపగలే చైనా పౌరుడిని హతమార్చారు. దాడులు చేస్తున్న అన్ని వర్గాల వారికి ఏదో రకంగా తాలిబాన్ల నుంచే సాయం అందుతోంది. ఈ విషయం తెలిసి కూడా చైనా ఏమి చేయలేకపోతోంది.
బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI) ప్రాజెక్టు మొదలు పెట్టి దశాబ్దం గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. యూరోప్ ను అనుసంధానించే ఆఫ్ఘనిస్తాన్ మార్గంపై చైనా ఆసక్తి కనబరుస్తున్నా తాలిబన్లు స్పందించటం లేదు. మరోవైపు గ్వదర్ ఓడరేవును కలిపెందుకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా నిర్మించిన బిఆర్ ఐ ప్రాజెక్టుపై స్థానిక ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే పుండు మీద కారం చల్లినట్టుగా తాలిబన్లు ఇండియాతో దౌత్య సంబంధాలకు ఉవ్విల్లురుతున్నారు. కాబుల్ లో భారత దౌత్య కార్యాలయం ప్రారంభిస్తే పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తామని తాలిబన్లు ఇటీవలే ప్రకటించారు. దీంతో చైనా తాలిబాన్ లను ఎలా దారిలోకి తీసుకురావాలా అని మదనపడుతోంది.
శ్రీలంకలో 99 ఏళ్లకు ఒక పోర్టు లీజ్, పాక్ గిల్గిట్- బాల్కిస్థాన్ లో అడ్డా, ఆఫ్ఘనిస్థాన్ లో త్వరలో కొత్త ప్రాజెక్టులు, నేపాల్ కు భారీగా అప్పు, చిట్టగాంగ్ ఓడరేవు అభివృద్ధి పేరుతో బంగ్లాదేశ్ లోబరుచుకునేందుకు యత్నాలు, మయన్మార్ మిలిటరీ చెప్పుచేతుల్లో పెట్టుకున్న తీరు… పకడ్బందీగా చైనా మన దేశాన్ని అష్ట దిగ్భందనం చేస్తోంది. చైనా తీరుపై ఆయా దేశాల ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తుంటే ఇండియా తదనుగుణంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది.
Also Read : బరితెగించిన చైనాకు భారత్ షాక్