Sunday, January 19, 2025

చీమల సేద్యం

పద్యం:-
అడవిపక్షుల కెవ్వడాహారమిచ్చెను?
మృగజాతి కెవ్వడు మేతబెట్టె?
వనచరాదులకు భోజన మెవ్వడిప్పించె?
జెట్ల కెవ్వడు నీళ్ళు చేదిపోసె?
స్త్రీల గర్భంబున శిశువు నెవ్వడు పెంచె?
ఫణుల కెవ్వడు పోసె బరగబాలు?
మధుపాళి కెవ్వడు మకరంద మొనరించె?
బసులకెవ్వ డొసంగె బచ్చిపూరి?

జీవకోట్లను బోషింప నీవెకాని
వేఱె యొక దాత లేడయ్య వెదకిచూడ!
భూషణవికాస | శ్రీధర్మ పురనివాస |
దుష్టసంహార | నరసింహ దురితదూర |
-నృసింహ శతకంలో కవి శేషప్ప

అర్థం:-
అడవిలో పక్షులకు ఆహారం ఎవరిస్తున్నారు?
జంతువులకు మేత ఎవరు పెడుతున్నారు?
అడవిలో ప్రాణులకు అన్నం ఎవరు పెడుతున్నారు?
చెట్లకు ఎవరు నీళ్లు చేది పోస్తున్నారు?
స్త్రీల గర్భంలో శిశువును ఎవరు పెంచుతున్నారు?
పాములకు ఆహారం ఎవరు పెడుతున్నారు?
తేనెటీగలకు మకరందాన్ని ఎవరు ఇస్తున్నారు?
పశువులకు పచ్చి గడ్డిని ఎవరు అందిస్తున్నారు?
ఎంత తరచి చూసినా…జీవకోట్లకు వేళకింత ఆహారం పెట్టి…పెంచి పోషించేవాడివి నీవు తప్ప…
వేరొక దాత లేడయ్యా! నరసింహస్వామీ!

సృష్టిలో తానొక్కడే గొప్పవాడని మనిషి విర్రవీగుతూ ఉంటాడు కానీ…ప్రతి ప్రాణికీ తన ఉనికిని తనకు తానే కాపాడుకునే విద్య అంతర్గతంగా ఉంటుంది. నిజానికి ఆహారాన్వేషణలో, కష్టాల్లో గట్టెక్కడంలో మనిషి కంటే మిగతా ప్రాణులే గొప్ప.

ఒక చీమ అతి చిన్న బెల్లం ముక్కను కష్టపడి ఇతర చీమల సహాయంతో మోసుకుపోతుంటే అటుగా వెళుతున్న నారదుడు చూసి…జాలి పడి…అర చేతిలోకి తీసుకుని…అయ్యో చీమా! ఎంత కష్టపడుతున్నావు? నేను వైకుంఠానికి వెళుతున్నాను. నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్లి…పునరావృతి రహిత శాశ్వత వైకుంఠ స్థానం ఇప్పిస్తాను…నాతో రా! అన్నాడు. నాతో పాటు ఒకసారి నా చీమల గూట్లోకి రండి స్వామీ! అని నారదుడిని చీమ తన ఇంటికి తీసుకెళ్లింది. అక్కడ వందల చీమలు. అరలు అరలు. ప్రతి అరలో చెక్కర, బెల్లం ముక్కలు. ఏమిటిదంతా? అని అడిగాడు నారదుడు. వర్షాకాలం వస్తోంది కదా స్వామీ! నాలుగు నెలలకు సరిపడా ఆహారాన్ని నిల్వ చేసి పెట్టుకున్నాము. ఎండన పడి వచ్చారు…కొంచెం బెల్లం పానకం కలిపి ఇవ్వమంటారా! చల్లగా తాగి వెళుదురు కానీ…అని చీమ అతిథి మర్యాదతో అడిగింది.

నారాయణ! నారాయణ!
సృష్టిలో అతి చిన్న చీమక్కూడా ఆహార సేకరణ, ఆహార నిల్వ మీద ఇంతటి క్లారిటీ పెట్టావా స్వామీ! అని నారాయణుడిని మనసులో తలచుకుని… “జీవకోట్లను పోషింప నీవెకాని…
వేఱె ఒక దాత లేడయ్య వెదకిచూడ!”
అన్న కవి శేషప్ప పద్యం పాడుకుంటూ…చీమకు థాంక్స్ చెప్పి…చీమ గూట్లో నుండి బయటపడ్డాడు.

చీమల సామ్రాజ్యం చిట్టిది కాదని నారదుడికి తెలుసు. మనకు తెలియాలనే ఒక సందర్భాన్ని సృష్టించుకుని ఉంటాడు.

దాదాపు ఆరున్నర కోట్ల సంవత్సరాల క్రితమే చీమలు వ్యవసాయం నేర్చుకుంటే …మనిషి మాత్రం మొన్న మొన్ననే నేర్చుకున్నాడని నిన్ననే అమెరికాలో ఒక పరిశోధనలో తేలింది. నిజానికి భూమిమీద తొలిసారి సేద్యం చేసింది కూడా చీమలేనని ఈ పరిశోధన తేల్చి చెబుతోంది.

భూమిని ఒక పెద్ద గ్రహశకలం ఢీకొన్నప్పుడు భూమ్మీద చెట్టూ చేమ అన్నీ బూడిదైపోయాయి. చాలావరకు జీవులు మట్టిలో మట్టిలా కలిసిపోయాయి. మిగిలి ఉన్న చీమలకు ఎక్కడా ఆహారం దొరకడం లేదు. సూర్యరశ్మి లేకపోవడం వల్ల చెట్లు చిగురించడం లేదు. అప్పుడు చీమలు ఆకుల్లో ఉన్న కొంతభాగాన్ని కొరికి పుట్టల్లోకి తీసుకెళ్లి విత్తనాలుగా దాచుకున్నాయి. వాటిమీద శిలీంధ్రాలు ఏర్పడ్డాక ఆహారంగా తిని…మనుగడకు ఢోకా లేకుండా జాగ్రత్త పడ్డాయి.

అమెరికా, కరేబియన్ దీవుల్లో లీఫ్ కట్టర్(ఆకులను కొరికే)జాతికి చెందిన దాదాపు 250 రకాల చీమలు ఇప్పటికీ ఇలాగే ఆకులను తీసుకెళ్లి…భద్రపరుచుకుని…తిని…బతుకుతున్నాయి.

ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో తనొక్కడే అత్యంత తెలివైనవాడని మనిషి భ్రమ. ప్రళయం వచ్చి సర్వం నాశనమైనా తన ఆహారాన్ని తానే పండించుకోగలిగింది అత్యంత అల్పప్రాణి చీమ. ప్రళయం వచ్చి కాలి కింద భూమి రెండుగా చీలిపోతున్నా పండించి…వండించి…వడ్డించుకోవడం చేతకాక స్విగ్గిలో జొమాటా పాతరాతియుగపు కూర ఆర్డర్ ఇచ్చుకుంటాడు అన్నీ చేతనైన అతి గొప్ప మనిషి!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్