Sunday, February 23, 2025
HomeTrending Newsడ్రగ్స్ పై గోబెల్స్ ప్రచారం: సిఎం జగన్

డ్రగ్స్ పై గోబెల్స్ ప్రచారం: సిఎం జగన్

డ్రగ్‌ వ్యవహారంపై విపక్షాలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. లేని అంశాన్ని ఉన్నట్టుగా ప్రచారం చేస్తున్నారని, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్షం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

శాంతి భద్రతలపై క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ ప్రచారం చేస్తున్నారని, ఏపీలో డ్రగ్స్‌ వ్యవహారం నిజం కాదని తెలిసి కూడా ఇవే వార్తలను కొన్ని మీడియా సంస్థలు, వెబ్‌సైట్లు ప్రముఖంగా ప్రచారం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.  ఇలాంటి దుష్ప్రచారాలపట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు

⦿ రాష్ట్రంలోని అన్ని కాలేజీలు, యూనివర్శిటీలు మాదక ద్రవ్య రహితంగా ఉండాలి
⦿ దీనికోసం తక్షణ చర్యలు తీసుకోవాలి, అన్ని చోట్లా పర్యవేక్షణ  ఉండాలి
⦿ డ్రగ్స్ ఉదంతాలు ఉన్నాయా? లేవా?  అనే దానిపై సమీక్షించాలి
⦿ ఒకవేళ  అనుమానం వస్తే వెంటనే అలాంటి కాలేజీలను మ్యాపింగ్‌ చేయాలి
⦿ ఎవరు పంపిణీ చేస్తున్నారు, ఎక్కడ నుంచి వస్తున్నాయన్న దానిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి
⦿ దీన్ని ఒక సవాల్‌గా తీసుకోండి,  కమిషనర్లు, జిల్లాల ఎస్పీలకు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వండి
⦿ ప్రతి నాలుగు వారాలకు ఒకసారి దీనిపై ప్రగతి నివేదికలు సమర్పించండి
⦿ ఒక కార్యాచరణను రూపొందించుకోండి
⦿ అన్ని కాలేజీలు, యూనివర్శిటీలు డ్రగ్‌ ఫ్రీగా ఉండాలన్నది ప్రధాన ఉద్దేశం

డ్రగ్స్ తో పాటు ‘దిశ’ అమలు, మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు సంబంధించి ప్రత్యేక కోర్టులు, రాష్ట్రంలో నేరాల నిరోధం–తీసుకుంటున్న చర్యలు, పోలీసు బలగాల బలోపేతం, తదితర అంశాలపై సీఎం సమగ్రంగా సమీక్షించారు. ఈ సమావేశానికి హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, ఆర్ధిక శాఖ కార్యదర్శి కె సత్యనారాయణ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్‌ అనురాధ, ఇంటలిజెన్స్‌ చీఫ్‌ కే వి రాజేంద్రనాథ్‌ రెడ్డి,  వివిధ రేంజ్‌ల డీఐజీలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్