Welfare Calendar: రాష్ట్రంలో పేద ప్రజలకు తాము వెల్ఫేర్ క్యాలెండర్ పెడుతున్నామని, అయితే ఇది చంద్రబాబుకు మాత్రం ఫేర్‌వెల్ క్యాలెండర్ అవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఆర్ధిక సంవత్స రానికి సంబంధించిన సంక్షేమ క్యాలండర్ ను అసెంబ్లీ వేదికగా సిఎం వెల్లడించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడిన సిఎం తన ప్రసంగంలో భాగంగా సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ఏయే నెలల్లో ఏయే పథకాలు చేపట్టబోయేది ప్రకటించారు.
“ఏప్రిల్ 2022 నుంచి మార్చి 2023 వరకు మనందరి ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ఏ పధకం ఏ నెలలో అందించబోతోంది అన్నది వివరిస్తూ.. ఈ గౌరవ సభ సాక్షిగా ఈ సంక్షేమ క్యాలెండర్ ప్రకటిస్తున్నాను”
“ఏప్రిల్ నెలలో వసతి దీవెన, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమం పెడుతున్నాం. మే నెలలో విద్యాదీవెన. విద్యా సంవత్సరంలో త్రైమాసికం పూర్తి కాగానే ఇఛ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అందులో భాగంగానే జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాలకు సంబంధించి మే లో విద్యాదీవెన ఉంటుంది. ఖరీఫ్ 2021కు సంబంధించి అగ్రికల్చర్ ఇన్సూరెన్స్. ఈ ఏడాది ఖరీఫ్‌కు ఉపయోగపడే విధంగా మే మాసంలో ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇదే మే మాసంలో రైతుభరోసా సొమ్మను రైతుకు పెట్టుబడి కోసం డబ్బులు పెట్టే విధంగా చేస్తున్నాం. మత్స్యకార భరోసాను కూడా ఆ నెలలోనే ఇస్తున్నాం. జూన్‌లో అమ్మఒడి కార్యక్రమం అమలు చేస్తున్నాం. రూ.6500 కోట్లు ఈ ఒక్క పథకంలో ఇస్తున్నాం. జూలైలో విద్యాకానుక, వాహనమిత్ర, కాపు నేస్తం, జగనన్న తోడుతో పాటు, అర్హత ఉండీ పథకాలు అందని వారికి ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేస్తాం”
“ఆగష్టులో విద్యాదీవెన కార్యక్రమం, ఎంఎస్‌ఎంఈలకు ఇన్సెంటివ్‌లు ఇచ్చే కార్యక్రమం, నేతన్న నేస్తం జరుగుతాయి. సెప్టెంబరులో వైయస్సార్ చేయూత పథకం అమలు చేస్తాం. ఈ పథకం ద్వారా 25 లక్షల అక్కచెల్లెమ్మలకు రూ.4500 కోట్లు అందిస్తాం. అక్టోబరులో వసతి దీవెన, రైతు భరోసా రెండో విడత కూడా ఉంటుంది. నవంబరులో విద్యాదీవెన, వడ్డీలేని రుణాలు రైతులకు అందించే కార్యక్రమం ఉంటుంది. డిసెంబరులో ఈబీసీ నేస్తం, లా నేస్తంతో పాటు అర్హత ఉండి మిగిలిపోయిన వారికి ఆయా పథకాలు అందిస్తాం. జనవరిలో రైతు భరోసా మూడో విడత, వైయస్సార్ ఆసరా ఉంటుంది. దాదాపుగా 79 లక్షల అక్కచెల్లెమ్మలకు మేలు చేస్తూ.. దాదాపు రూ.6700 కోట్లు అందించే కార్యక్రమం. జనవరిలోనే జగనన్న తోడు కార్యక్రమం, పెన్షన్‌ను రూ.2500 నుంచి రూ.2750 పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. పిబ్రవరిలో విద్యాదీవెన, జగనన్న చేదోడు కార్యక్రమం ఉంటుంది. మార్చిలో వసతి దీవెన కార్యక్రమం ఉంటుంది” అంటూ ప్రసంగంలో పేర్కొన్నారు.
Also Read : వికేంద్రీకరణపై వెనకడుగు లేదు: సిఎం జగన్