రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ఆదివారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరగనున్నమావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారుల సమావేశంలో జగన్ పాల్గొంటారు. ఈ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై ఇప్పటికే సిఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, పాఠశాలలు, ఇతర మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్రం అమలు చేస్తోన్న పథకాలు, కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన విషయాలతో ఒక నివేదిక కూడా సిద్ధం చేశారు.
ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు గిరిజనుల ఆర్ధిక, సామాజిక అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, అందుకే ఆయా ప్రాంతాల్లో మావోల పట్ల ప్రజలు ఆకర్షితులు కావడం లేదని ఈ సమావేశం సందర్భంగా డిజిపి గౌతమ్ సావాంగ్ వెల్లడించారు. రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయని, సాయుధ మావోయిస్టుల బలం సుమారు 50కి పరిమితమైందని డిజిపి వివరించారు. మావోయిస్టుల రిక్రూట్‌మెంట్ పట్ల గిరిజన యువకులు ఆసక్తి చూపడంలేదని, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలే దీనికి ప్రధాన కారణమని డీజీపీ అభిప్రాయపడ్డారు.
గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్ధిక సహకారం కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్లుండి జరిగే సమావేశంలో సిఎం జగన్ ఈ మేరకు పలు ప్రతిపాదనలను కేంద్రం ముందు పెట్టే అవకాశం ఉంది.