Saturday, November 23, 2024
HomeTrending Newsఅభివృద్ధి పథంలో ఏపీ: నితిన్ గడ్కరీ

అభివృద్ధి పథంలో ఏపీ: నితిన్ గడ్కరీ

All are equal: తాము దేశంలోని ఏ ప్రభుత్వంపైనా వివక్ష ప్రదర్శించబోమని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఈ దేశం అందరిదని… దానిలో భాగంగానే ప్రధాని మోడీ ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్’ సిద్ధంతాన్ని ఆచరిస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలతో రహదారి ప్రాజెక్టులు చేపడుతున్నామని చెప్పారు. తమ శాఖకు ఎలాంటి నిధుల కొరత లేదని తేల్చి చెప్పారు. సిఎం జగన్ నేతృత్వంలో దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ముఖ్యమైన రాష్ట్రమని కితాబిచ్చారు.  రాష్ట్రంలో 21,559 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతోన్న 51 రహదారి ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలతో కలిసి నితిన్ గడ్కరీ భూమి పూజ చేసి శిలా ఫలకాలు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ప్రసంగిస్తూ దేశవ్యాప్తంగా 22 గ్రీన్ ఎక్స్ ప్రెస్ హై వే లు నిర్మిస్తున్నామని, వీటిలో ఆంధ్ర ప్రదేశ్ లో ఆరు ఉన్నాయన్నారు. ఛత్తీస్ ఘడ్ రాజధాని రాయ్ పూర్ నుంచి ఒడిశా మీదుగా విశాఖ వరకూ 465   కిలోమీటర్ల  రహదారిని 16,102 కోట్ల రూపాయల వ్యయంతో  నిర్మిస్తున్నామని వివరించారు.  రవాణా, మౌలిక సదుపాయాల రంగంలో అత్యంత కీలకమైన, పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చే ఈ ప్రాజెక్టును 2024నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.  తన సొంత నియోజకవర్గమైన  నాగపూర్  నుంచి  విజయవాడ కు మరో ప్రాజెక్టు 405కిలోమీటర్ల మేర 15వేల కోట్ల రూపాయలతో చేపట్టామని చెప్పారు.

ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా  మన దేశం దిగుమతులు తగ్గించుకొని ఎగుమతులు పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని, దీనిద్వారా ఉపాధి అవకాశాలు విస్తారంగా వస్తాయని, తద్వారా భారత ఆర్ధిక వ్యవస్థ ప్రపంచంలోనే నంబర్ వన్ గా ఉంటుందని  గడ్కరీ ధీమా వ్యక్తం చేశారు. దీనిలో ఆంధ్ర ప్రదేశ్ పాత్ర కూడా ఎంతో ప్రముఖంగా ఉంటుందని, రాష్ట్రంలో ఉన్న పోర్టులు దీనికి ఉపకరిస్తాయని వెల్లడించారు. సిఎం జగన్ నాయకత్వంలో రాష్త్రం ప్రగతి పథంలో దూసుకు పోతోందని గడ్కరీ చెప్పారు. రోడ్డు రవాణా తో పాటు పోర్టులు జల రవాణా కూడా అభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషిస్తాయన్నారు.  ఏపీ రాష్ట్రం ఇథనాల్, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో రాష్ట్రం గ్రోత్ సెంటర్ గా మారుతోందన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్