Sunday, January 19, 2025
HomeTrending Newsస్నాతకోత్సవాలు వాయిదా వేయండి: గవర్నర్

స్నాతకోత్సవాలు వాయిదా వేయండి: గవర్నర్

Universities-Convocations: రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల దృష్ట్యా జనవరి, ఫిబ్రవరిలో నిర్వహించ తలపెట్టిన వార్షిక స్నాతకోత్సవాలను విశ్వవిద్యాలయాల ఉప కులపతులు వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశించారు. రోజువారీ నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య పెరగడం,  నూతన ఒమిక్రాన్ వేరియంట్ ఆవిర్భావం దృష్ట్యా గౌరవ గవర్నర్  హరిచందన్ శనివారం ఉన్నత స్థాయి  సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే పలు విశ్వవిద్యాలయాలు  స్నాతకోత్సవాల తేదీలను ఖరారు చేయగా, వాటిని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్న ఆయన, తదనుగుణంగా విశ్వవిద్యాలయాలకు సమాచారం పంపాలని రాజ్ భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియాను ఆదేశించారు.

విద్యార్థుల భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ స్నాతకోత్సవాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని గవర్నర్  హరిచందన్ గతంలో వైస్ ఛాన్సలర్‌లకు సూచించారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, పరిపాలనా సిబ్బంది ఆరోగ్య సంక్షేమం దృష్ట్యా ఇప్పటికే షెడ్యూల్ చేసిన స్నాతకోత్సవాలను వాయిదా వేయాలని గవర్నర్ ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ మాట్లాడుతూ ఒకవేళ స్నాతకోత్సవాలు భౌతిక రీతిలో నిర్వహిస్తే వారు కరోనాకు గురయ్యే అవకాశం ఉందని గవర్నర్ అభిప్రాయ పడ్డారు. కరోనా వైరస్ ముప్పు వేగంగా వ్యాప్తి చెందుతోందని,  రోజువారీ నమోదు అవుతున్న కేసులలో అపారమైన పెరుగుదల ఉందని గవర్నర్ పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్