పోలవరం ప్రాజెక్టు సందర్శన భావోద్వేగానికి గురిచేసిందని, దివంగత నేత వైఎస్ఆర్ బతికి ఉంటే ఈ ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి అయ్యేదని ఏపి ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2005లో పోలవరం ప్రాజెక్టుకు శ్రీకారం చుడితే ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ముఖ్యమైన ఘట్టం ఆవిష్కృతమైందని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు ఎంతో భావోద్వేగానికి గురిచేసిందన్నారు. సజ్జల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల బృందం నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించింది. స్పిల్ వే పనులను, కాపర్ డ్యామ్ లను నేతలు క్షుణ్ణంగా పరిశీలించారు. సుమారు గంటపాటు పర్యటించిన ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పనుల వివరాలపై అధికారులను అడిగి తెలుసుకుని, ఆసక్తిగా గమనించారు.
జూన్ 12 న పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే నుంచి గోదావరి జలాలు వెళ్లిన సందర్భాన్ని ఎటువంటి ఆర్భాటాలకు లేకుండా సాదాసీదాగా నిర్వహించామని, ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని ప్రజా సంక్షేమం కోసం మాత్రమే పనిచేస్తామని పేర్కొన్నారు. వైఎస్ఆర్ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన ఎన్నో ప్రాజెక్టులు చేపట్టారని సజ్జల గుర్తు చేశారు.
దేశ చరిత్రలో వైఎస్సార్ ఎప్పటికీ అపర భగీరధుడిగా నిలుస్తారని సజ్జల పేర్కొన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ గా చేపట్టారని కానీ గత ప్రభుత్వం కమీషన్ల మీద కక్కుర్తితో కేంద్రం చేపట్టాల్సిన ఈ ప్రాజెక్ట్ ను చంద్రబాబు ప్రభుత్వం రూ. 23 వేల కోట్లకు ఒప్పుకుని రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు. మన జుట్టు తీసుకెళ్లి కేంద్రం చేతిలో పెట్టి రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారన్నారు.
కష్టకాలంలోనూ ఒక దీక్షతో సీఎం వైఎస్ జగన్ పోలవరం పనులు చేయిస్తున్నారని, ఇంత విపత్కర కోవిడ్ సమయంలోనూ పనులు చేయడం ఒక విజయమని అభివర్ణించారు. కేవలం ఈ ప్రాజెక్ట్ లో కాపర్ డ్యామ్ కట్టి అనాలోచితంగా గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల డయా ఫ్రం వాల్ దెబ్బతిన్న విషయం వాస్తవం కాదా.. అని ప్రశ్నించారు.
జగన్ మోహన్ రెడ్డి హయాంలో అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పూర్తి అవుతుందనే నమ్మకం ఉందని, ఆ దిశలోనే పునరావాసం కూడా ముందుకు సాగుతోందన్నారు. పునరావాసం కేంద్రమే చేయాల్సి ఉంటే 23 వేల కోట్లకు అన్నీ ఒప్పుకుని వచ్చింది మీరు కాదా అని ప్రశించిన సజ్జల ఇప్పటికైనా విమర్శలు మానుకోవాలని హితవు పలికారు.