ప్రజల భాగస్వామ్యంతోనే పల్లెల రూపురేఖలు మార్చడం సాధ్యమని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల కల్పనలో పట్టణాలకు దీటుగా పల్లెలను తీర్చిదిద్దాలని, అదే సమయంలో పరిశుభ్రత, పచ్చదనంతో కళకళ లాడేలా చూడాలని సూచించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం అమలుపై గ్రామ సర్పంచ్ లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
జూలై 8న దివంగత నేత వైఎస్ జన్మదినం సందర్భంగా ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని సిఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని ఈ కార్యక్రమం కోసం 1312.04 కోట్ల రూపాయలు కేటాయించామని వెల్లడించారు. ఆరోగ్యకరమైన గ్రామాలే లక్ష్యంగా స్వచ్ఛ సంకల్పానికి శ్రీకారం చుట్టమని, సర్పంచ్ లు ఈ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామ పరిపాలనలో సిఎం జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని, గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థతో పల్లె ముంగిట్లోకే పాలన వచ్చిందని పెద్దిరెడ్డి వివరించారు. రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ లు, మిల్క్ కలెక్షన్ కేంద్రాలు, 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల వద్దకే చేర్చారన్నారు. సర్పంచ్ లు ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని ఉద్భోదించారు. ప్రజా ప్రతినిధులుగా ఎదుగుదలకు సర్పంచ్ పదవి తొలిమెట్టు అని అభివర్ణించారు.
సర్పంచ్ లకు చెక్ పవర్ ఇవ్వడంలో కొద్దిగా ఆలస్యమైందని, మొత్తం 13, 095 మంది సర్పంచ్ లకు గాను 11,152మందికి ఇప్పటికే చెక్ పవర్ ఇచ్చామని, మిగిలిన 1,943 మందికి రెండ్రోజుల్లో చెక్ పవర్ ఇస్తామని పెద్దిరెడ్డి హామీ ఇచ్చారు.