Friday, March 29, 2024
HomeTrending Newsఎమ్మెల్సీలుగా త్రిమూర్తులు, అప్పిరెడ్డి

ఎమ్మెల్సీలుగా త్రిమూర్తులు, అప్పిరెడ్డి

గవర్నర్ కోటాలో ఈరోజు ఖాళీ అవుతున్న నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అభ్యర్ధులను సిపార్సు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మోషేను రాజు, గుంటూరు నుంచి లేళ్ల అప్పిరెడ్డి, కడప జిల్లాకు చెందిన ఆర్వీ రమేశ్‌ యాదవ్‌, తూర్పుగోదావరి జిల్లా నేత తోట త్రిమూర్తులు ఉన్నారు. ఈ పేర్లను ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపినట్లు తెలిసింది.

గతంలో తెలుగుదేశం ప్రభుత్వం గవర్నర్ కోటాలో నామినేట్ చేసిన ఎమ్మెల్సీలు టీడీ జనార్దన్‌, బీద రవిచంద్ర, జి. శ్రీనివాసులు, పి.శమంతకమణిల పదవీ కాలం నేడు (జూన్ 11) ముగియనుంది. వీరి స్థానంలో నలుగురి పేర్లను ప్రభుత్వం గవర్నర్ కు సూచిస్తూ లేఖ రాసింది.

అయితే, ఏపీ శాసన మండలికి త్వరలో జరగబోయే ఎన్నికల తరువాత అధికార వైఎస్సార్ కాంగ్రెస్ సంపూర్ణ మెజార్టీ సాధించనుంది. అధికార పార్టీ సభ్యుల సంఖ్య భారీగా పెరగనుంది. మొత్తం 58 మంది సభ్యుల శాసన మండలిలో 20 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గం నుంచి, మరో 20 మంది స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి ఎన్నికవుతారు.. పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల నుంచి ఐదుగురు చొప్పున ఎన్నికవుతారు. మరో 8 మందిని గవర్నర్ కోటాలో నామినేట్ చేస్తారు.

మే 25 న ఎమ్మెల్యేల నుంచి మూడు ఖాళీలు ఏర్పాడ్డాయి. మండలి చైర్మన్ ఎం ఏ షరీఫ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజు, వైసిపి సభ్యుడు గోవిందరెడ్డి రిటైర్ అయ్యారు.

స్థానిక సంస్థల్లో మూడు ఎప్పటినుంచో ఖాళీగా ఉన్నాయి, జూన్ 18న మరో 8 మంది రిటైర్ అవుతున్నారు, మొత్తం 11 ఖాళీలు స్థానిక సంస్థల కోటాలో ఏర్పడతాయి. గవర్నర్ కోటాలో నలుగురు ఈరోజు (జూన్ 11న) రిటైర్ కానున్నారు. అంటే మొత్తం 18 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ కావాల్సి ఉంది. ఈ 18 స్థానాల్లో దాదాపు అన్నీ వైఎస్సార్ సిపి ఖాతాలోనే చేరనున్నాయి. మొత్తం 33 స్థానాలతో మెజార్టీ సాధించనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్