Thursday, May 8, 2025
HomeTrending Newsకఠినంగా మాస్క్ నిబంధన

కఠినంగా మాస్క్ నిబంధన

రాష్ట్రంలో కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌మోహన్ రెడ్డి మంత్రులు, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.  ఈ సమావేశంలో రాష్ట్రంలోని కొన్ని దుకాణాలు, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకుండా నిబంధనలు అతిక్రమిస్తున్న విషయం సిఎం దృష్టికి వచ్చింది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి దుకాణాల్లో సిబ్బంది, వినియోగదారులు కచ్చితంగా మాస్క్ ధరించాల్సిందేనని, లేనిపక్షంలో 100 రూపాయలు జరిమానా విధించాలని సిఎం ఆదేశించారు.

దుకాణదారులు మాస్క్ పెట్టుకోకపోతే భారీ జరిమానా విధించడంతో పాటు అవసరమైతే రెండు మూడు రోజులపాటు దుకాణాలు సీజ్ చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మాస్క్ నిబంధన పాటించని దుకాణాల ఫోటోలను తీసి అధికారులకు పంపేందుకు ప్రత్యేకంగా ఒక వాట్సాప్ నంబరును ఏర్పాటు చేయనున్నారు.

మరోవైపు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కర్ఫ్యూ నిబంధనలు ఒకేలా అమలు చేయాలని సమావేశం నిర్ణయించింది. ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుంది. 9 నుంచి 10 గంటల మధ్యలో షాపులు మూసివేసి ఇంటికి చేరుకునేందుకు వెసులుబాటు కల్పించారు. రాత్రి 10 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ నిబంధనలు కఠినంగా అమలు చేస్తారు. పగటి పూట కూడా ప్రజలు ఎక్కువగా గుమికూడడా  144 సెక్షన్ పటిష్ఠంగా అమలు చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్