సామాజిక న్యాయం చేయాలంటే కుల గణన తప్పనిసరిగా చేయాల్సిందేనని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ స్పష్టం చేశారు. దేశంలో ఎంతమంది ఉన్నారనేది తెలుసుకోవడం తప్పనిసరి అని, ఇప్పటి వరకూ కులాల వారీగా గణన జరగడం లేదని ఆయన అన్నారు. ‘బిసి జనగణన’పై అసెంబ్లీ లో స్వల్పకాలిక చర్చ జరిగింది. దీనికి మంత్రి సమాధానం ఇస్తూ గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో బిసి కుల జనగణన చేపడతామని ప్రకటించారు. దీనికోసం విధాన రూపకల్పన కోసం ఆరుగురు సీనియర్ అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
1931లో మనదేశంలో కుల గణనతో కూడిన జన గణన జరిగిందని, 1941 లో రెండో ప్రపంచ యుద్ధం సమయంలో సెన్సెస్ సరిగా జరగలేదని, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీ లు మినహా మిగిలిన వారిని గంపగుత్తగా జనరల్ కేటగిరీలోనే వేస్తున్నారని, అందువల్ల బిసిలు ఎంతమంది ఉన్నారో తెలియడం లేదన్నారు. అందుకే కుల గణన తప్పనిసరి అని అన్నారు. కులాల వారీ జనాభాకు సంబంధించిన విద్యా, సామాజిక, ఆర్ధిక పురోగతి తెలుసుకోవడానికి, సముచిత విధాన నిర్ణయాలు తీసుకోవడానికి, మరిన్ని పథకాలు రూపకల్పన చేయడానికి ఇది అత్యవసరమని మంత్రి పేర్కొన్నారు. సామాజిక న్యాయానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
దాదాపు శతాబ్ద కాలం పాటు కుల గణన చేయకపోవడంతో అభివృద్ధి ఫలాలు అందుకోవాల్సినంతగా తమకు చేరుకోలేదని ఎన్నో కులాలు భావిస్తున్నాయని, వారు కుల గణనపై డిమాండ్ చేస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. సమాజంలోని అన్ని కులాల, వర్గాల వారికి దామాషా పధ్ధతిలో సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందుతాయని అభిప్రాయపడ్డారు.