హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో ఇతర కార్యాలయాల నిర్మాణాలు అపకపోవడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పాఠశాలల ఆవరణలో రైతు భరోసా కేంద్రాలు, పంచాయతీ భవనాలు, గ్రామ సచివాలయ కార్యాలయాల నిర్మాణంపై దాఖలైన ధిక్కార పిటిషన్ ను హైకోర్టు నేడు విచారించింది. పాఠశాల ఆవరణ లోకి రాజకీయాలు ఎలా తీసుకెళ్తారని హైకోర్టు ప్రశ్నించింది.]
తాము ఆదేశాలు ఇచ్చినా నిర్మాణాలు ఎందుకు కొనసాగుతున్నాయని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ కేసులో నలుగురు ఐఏఎస్ అధికారులు …. పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాల క్ర్సిహ్న ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి, అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ కోర్టుకు హాజరయ్యారు.
స్కూల్ ఆవరణలో భవనాలు నిర్మించవద్దని ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పేద పిల్లలు చదువుకునే స్కూల్ లో వాతావరణం కలుషితం చేస్తున్నారని మండిపడింది. మీలో ఎవరైనా ఈ పాఠశాలలో చదువుకున్నారా అంటూ ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి దేవానంద్ ప్రశ్నించారు.
అన్ని విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నివేదిక ఇస్తామని అడ్వకేట్ జనరల్ ధర్మాసనానికి వివరించారు. తదుపరి విచారణను ఆగస్టు 31కి వాయిదా వేసింది హైకోర్టు, ఆరోజు కూడా అధికారులంతా హాజరుకావాలని ఆదేశించింది.