స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. తనపై ఆంధ్ర ప్రదేశ్ సిఐడి దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన స్క్వాష్ పిటిషన్ ను ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. సిఐడి చేసిన వాదనలతో ఏకీభవించిన హైకోర్టు సింగిల్ బెంచ్ బాబు వేసిన పిటిషన్ ను తోసిపుచ్చింది.
మరోవైపు బాబును విచారించేందుకు ఐదురోజుపాటు కస్టడీ ఇవ్వాలంటూ ఏపీ సిఐడి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ఏసీబీ కోర్టు రెండురోజులపాటు కస్టడీ ఇచ్చింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే బాబును విచారిస్తామని ఆంధ్ర ప్రదేశ్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టుకు తెలియజేశారు.
చంద్రబాబును విచారించే అధికారుల జాబితా ఇవ్వాలని, విచారణ నివేదికను సీల్డ్ కవర్ లో అందజేయాలని ఏసీబీ కోర్టు జడ్జి ఆదేశించారు. ప్రతిరోజు ఉదయం 9.30గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ విచారించాలని, బాబు తరఫు న్యాయవాది సమక్షంలో ఇది కొనసాగాలని, విచారణకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బైటకు రాకూడదని షరతులు విధించింది. చంద్రబాబు వయస్సు, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.