ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం జూన్ 6 వరకు ఎలాంటి తక్షణ చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది. పిన్నెల్లి తో పాటు నరసరావుపేట, తాడిపత్రి అభ్యర్ధులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి(వైసీపీ); జేసీ అస్మిత్ రెడ్డి(టిడిపి), కేతిరెడ్డి పెద్దారెడ్డి (వైసీపీ) లు దాఖలు చేసిన పిటిషన్లపై కూడా విచారణ జరిపిన హైకోర్టు అందరికీ ఇదే ఉపశమనం కలిగించింది.
ఎమ్మెల్యే అభ్యర్ధులు కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించాల్సి ఉంటుందని, కౌంటింగ్ ఏజెంట్లను కూడా ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి వారిపై వెంటనే చర్యలు తీసుకోవడం సరికాదంటూ అభ్యర్ధుల తరఫున వాదించిన న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకు వెళ్ళారు. ఈ వాదనాపై ఏకీభవించిన న్యాయమూర్తి జూన్ 6న ఉదయం 10 గంటల వరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని పేర్కొంది. ఈ కేసుతో సంబంధం ఉన్న అభ్యర్ధులు మినహా ఇతర నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది.
అభ్యర్ధులపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఈసీని ఆదేశించిన ధర్మాసనం, ముందస్తు బెయిల్ షరతులు ఉల్లంఘించవద్దని నిర్దేశించింది.