ఆస్తి పన్నుపై ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు విపక్షాలు కుట్ర చేస్తున్నాయని మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఆస్తి పన్నుపై సమగ్ర అధ్యయనం చేసేందుకు మూడు కమిటీలు నియమించామని, ఈ కమిటీలు మూడు రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేశాయని వివరించారు. గతంలో మూడు నెలల అద్దె ప్రామాణికంగా పన్ను వేసేవారని, ఈ విధానం లోప భూ ఇష్టంగా ఉండేదని అందుకే కొత్త పన్ను విధానం తీసుకువచ్చామని వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజల్లో అపోహలు కలిగిస్తున్నారని బొత్స విమర్శించారు. ఆ పార్టీ లాగా ఎన్నికల ముందు ఒకమాట తరువాత మరోమాట చెప్పే విధానం తమది కాదన్నారు. ప్రభుత్వ ఫలాలు అందరికీ అందాలన్నదే తమ అభిమతమని, తమ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని వ్యాఖ్యానించారు.
గృహాలపై 0.10 నుంచి 0.50 శాతం, కమర్షియాల్ భవనాలకు 0.20 నుంచి 2 శాతం పన్ను వసూలు చేయాలని నిర్ణయించామని బొత్స వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఇంటిపన్ను, అసెస్మెంట్ కడుతున్న సముదాయాల సంఖ్య ౩౩ లక్షల 67 వేలు ఉన్నాయని, వీటిపై ప్రస్తుతం వస్తున్నా డిమాండ్ రూ.1,242 కోట్ల 13 లక్షలుగా ఉందని, ప్రస్తుతం పెంచిన 15 శాతం పెంచిన తర్వాత వచ్చే డిమాండ్ రూ.1,428 కోట్ల 45 లక్షలని, రూ.186 కోట్ల రూపాయలు మాత్రమే అదనంగా వస్తుందని, దీనిలో కూడా దీనిలో కూడా 375 చదరపు అడుగుల ఇల్లు ఉంటే వారికి కేవలం 50 రూపాయలు మాత్రమే వసూలు చేయాలని సిఎం జగన్ సూచించారన్నారు.
తమది పారదర్శక ప్రభుత్వమని, ఎక్కడా దాపరికం ఉండబోదని బొత్స స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనలు సడలించిన తరువాత ఈ ఆస్తి పన్ను విధానంపై అన్ని నగరాలు, పట్టణాల్లో ఓపెన్ డిబేట్ నిర్వహించే ఆలోచనలో ఉన్నామని వెల్లడించారు.